ఓ రిక్వస్ట్‌... జీవితాన్ని మార్చేస్తుంది!

టిండర్‌.. క్యుపిడ్‌... హింజ్‌... హ్యాపెన్‌... ఇవన్నీ ఎంటో అనుకునేరు. డేర్‌గా చేసే డేటింగ్‌ యాప్‌లు... అన్నింటిలోనూ నేను పిచ్చ యాక్టివ్‌. ఫేస్‌బుక్‌, ట్విట్టర్లలో చేసే హల్‌చల్‌ వేరు. రచ్చ రచ్చే! రోజూ నాకొచ్చే ఫ్రెండ్‌ రిక్వస్ట్‌లు చూస్తే... అవాక్కవ్వాల్సిందే. తక్కువలో తక్కువ రోజుకి పది. (రిక్వస్ట్‌లు చూస్తూ...) వావ్‌... హి ఈజ్‌ రాకింగ్‌... పేరేంటబ్బా??? హిమేష్‌. ఎక్కడి నుంచీ... దిల్లీ. ఊఁఁ...

Published : 26 May 2018 01:48 IST

ఓ రిక్వస్ట్‌... జీవితాన్ని మార్చేస్తుంది!
వర్చువల్‌ లైఫ్‌...
ఛాటింగ్‌లు.. సెల్ఫీల్లో ఓ కథ...
సూటిగా సుత్తిలేకుండా...

టిండర్‌.. క్యుపిడ్‌... హింజ్‌... హ్యాపెన్‌... ఇవన్నీ ఎంటో అనుకునేరు. డేర్‌గా చేసే డేటింగ్‌ యాప్‌లు... అన్నింటిలోనూ నేను పిచ్చ యాక్టివ్‌. ఫేస్‌బుక్‌, ట్విట్టర్లలో చేసే హల్‌చల్‌ వేరు. రచ్చ రచ్చే! రోజూ నాకొచ్చే ఫ్రెండ్‌ రిక్వస్ట్‌లు చూస్తే... అవాక్కవ్వాల్సిందే. తక్కువలో తక్కువ రోజుకి పది. (రిక్వస్ట్‌లు చూస్తూ...) వావ్‌... హి ఈజ్‌ రాకింగ్‌... పేరేంటబ్బా??? హిమేష్‌. ఎక్కడి నుంచీ... దిల్లీ. ఊఁఁ... యాక్సెప్ట్‌ చేద్దాం. (మరుక్షణం అట్నుంచి రిప్లై...)
హయ్‌ నేను హిమేష్‌... మీరు?
కుర్రోడికి దూకుడెక్కువే. (హాయ్‌లు మొదలై వారం అయ్యిందో లేదో.. డేటింగ్‌ మొదలయ్యింది) డియర్‌ చెప్పు... ఎక్కడున్నావ్‌? ఇంట్లోనా? ఏదీ ఓ సెల్ఫీ పంపు. అడిగానో లేదో వచ్చేసింది. సిక్స్‌ప్యాక్‌... మిలటరీ హెయిర్‌కట్‌. అచ్చు అల్లు అర్జున్‌లానే. కత్తిలా ఉన్నాడు. తన ఫ్రొఫైల్‌లో రాసుకున్నట్టే. ఇంప్రెసీవ్‌.
నువ్వెలా ఉంటావు. చూడాలని ఉంది
క్షణాల్లో నా సెల్ఫీ పంపేశా. మనం తగ్గుతామా. తెలుగమ్మాయ్‌ ఇక్కడ. నికార్సైన హైబ్రీడ్‌ పిల్ల. ఒక్కటే పీస్‌. కోమలి...
గదంతా నీట్‌గా.. ఒక్కరేనా? నో రూమ్మేట్స్‌?
తొందరగా ఎవ్వరితోనూ క్లోజ్‌ అవ్వను. కలిస్తే వదలను. కాస్త కమిట్మెంట్‌ ఎక్కువ. నా ప్రపంచం... నేను. నాకు ఫిదా అవ్వాలంటే కొంచెం కష్టం.
నేను నీ మాదిరే. చిత్రంగా ఉందే. మీకు ఫ్రెండ్‌ రిక్వస్ట్‌ పంపేటప్పుడే ఊహించా. నా లెక్కే ఉంటావని. అదే నిజం అయ్యింది. ఇంతలా నేను దగ్గరైన వ్యక్తులు ఇద్దరే. ఒకటి మా అమ్మ. తర్వాత నువ్వే!
నేనూ అదే అనుకుంటున్నా. నువ్వు నార్త్‌. నేను సౌత్‌. భాషలు.. సంస్కృతీ సంప్రదాయలు వేరు.. వందల మైళ్ల దూరం.. అయినా ఒకేలా ఎలా? అవునూ.. మీ అమ్మంటే నీకు అంతిష్టమా? సో.. స్వీట్‌.
ఒకటి చెప్పనా. ఇద్దరం రైలు పట్టాల్లా సమాంతరంగా వేల మైళ్లు జోడుగానే వెళ్తాం. బాగా చెప్పానా? అమ్మంటే ఇష్టంలేనివారు ఎవరుంటారు చెప్పు.
సార్‌కి ఫిలాసఫీ కూడా టచ్చుందే. మరైతే, నార్త్‌ నుంచి సౌత్‌కి రాకెప్పుడో?
నువ్వు ఎప్పుడీ మాటంటావా అని ఎదురు చూస్తున్నా. నేను రెడీ. నువ్వు ఎప్పుడంటే అప్పుడు.
ఛలో... నెక్స్ట్‌ వీకెండ్‌. ఛార్మినార్‌లో షాపింగ్‌. పేరడైజ్‌ బిర్యానీ. ఒక్కసారి తిన్నావంటే సౌత్‌లోనే సెటిల్‌ అయిపోదాం అనుకుంటావ్‌
నువ్వు తోడుంటే దేనికైనా రెడీ
అబ్బో... ఎక్కడో కొట్టావ్‌గా. వచ్చాక ఆలోచిద్దాం. (ప్లాన్‌ ప్రకారం... హిమేష్‌ హైదరాబాద్‌ రావడానికి ఒకరోజు ముందు)
డియర్‌.. సారీ. నేను రాలేకపోతున్నా. అమ్మకి ఒంట్లో బాలేదు. హాస్పటల్‌కి తీసుకెళ్లా. ఇప్పుడు హాస్పటల్‌లోనే ఉన్నా.
అవునా... మరేం ఫర్వాలేదు. ఆవిడకి ఎలా ఉంది.ఏవో టెస్ట్‌లు రాశారు. చేయిస్తున్నా. అనుకోకుండా బయలుదేరా. డబ్బు సరిపడా తేలేదు. నువ్వు ఏమీ అనుకోకపోతే నాకో 10,000 ట్రాన్స్‌ఫర్‌ చేస్తావా? నేను మళ్లీ నీకు పంపేస్తా.
అలా అంటావేంటి? మరీ, ఇంత మొహమాటమా. అదీ నా దగ్గర. ఇప్పుడే ‘తేజ్‌’లో పంపిస్తున్నా. చెక్‌ చేసుకో.
థ్యాంక్స్‌. ఏం చెప్పాలో అర్థం కావట్లే.
ఇప్పుడేం చెప్పొద్దు. ముందు అమ్మ ట్రీట్‌మెంట్‌ చూడు. (అదే రోజు రాత్రి...)
హే.. ఏం చేస్తున్నావ్‌. నాకేం చేయాలో అర్థం కావట్లేదు.
ఏమైంది. అమ్మ రిపోర్టులు వచ్చాయా?
వచ్చాయ్‌. క్యాన్సర్‌ అట. కీమో స్టార్ట్‌ చేయాలంట. వెంటనే. ఇన్సూరెన్స్‌ కూడా రాదట. నాకంతా అయోమయంగా ఉంది. నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మకి క్యాన్సర్‌ ఏంటి?
సో.. శాడ్‌. ఎంతవుతుందన్నారు?
రేపటికైతే ఓ రెండు లక్షలు అవుతుందన్నారు. నా దగ్గర అన్ని చూస్తే లక్ష దాటల్లేదు.
నువ్వేం కంగారు పడకు. నేను ఇప్పుడో 50,000 పంపుతున్నా. నువ్వు ఆలస్యం చేయకుండా ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చేయించు.
ఏం మాట్లాడాలో తెలియట్లే. చాలా థాంక్స్‌!!
(ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చేసిన మరుసటి రోజు..) ఎలా ఉంది అమ్మకి.
ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చేశారు. అమ్మని ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నా. డబ్బు కోసం ప్రయత్నిస్తున్నాం. చుట్టాలైతే నన్ను చూస్తేనే తప్పుకొని తిరుగుతున్నారు.
నువ్వంత ఇబ్బంది పడకు. నేనో లక్ష పంపుతున్నా. వీలు చూసుకుని రెండు రోజుల్లో దిల్లీ వస్తాను. ఏం కంగారు పడకు.
రక్త సంబంధం ఉన్నోళ్లే తప్పంచుకుని తిరుగుతుంటే... ఏ సంబంధం లేని నువ్విలా.
ఎకౌంట్‌కి డబ్బు పంపేశాను. ఒకసారి చెక్‌ చేసుకో. (మరుసటి రోజు...)
హిమేష్‌. ఇప్పుడెలా ఉంది అమ్మకి. (రిప్లై లేదు..)
ఎన్ని సార్లు చేసినా ఫోన్‌ రింగ్‌ అవుతోంది.... (ఎత్తడం లేదు)
మరుసటి రోజు మెసేజ్‌లు పంపా. స్పందన లేదు. ఫోన్‌ చేస్తే ఈ సారి స్విచ్‌ఆఫ్‌.. ఏం జరిగి ఉంటుంది? వాళ్ల అమ్మకి ఏమై ఉంటుంది? తనే చేస్తాడు అనుకున్నా. వారం... రెండు వారాలు.. మెసేజ్‌లు పంపుతున్నా. ఫోన్‌ చేస్తున్నా. ఎలాంటి స్పందన లేదు. నేను మోసపోయానా? నమ్మలేకపోతున్నా!! ఎవరికైనా షేర్‌ చేసుకుందామంటే క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఎవ్వరూ లేరు. ఇంట్లో చెబితే... ఉద్యోగం లేదు.. ఏం లేదు ఇంటికొచ్చెయ్‌ అంటారు. నాలో నేనే సతమతమయ్యా. డబ్బు పోయినదానికంటే... అతనికి ఎమోషనల్‌గా కనెక్టు అయ్యాననే విషయం నన్ను ఎక్కువగా బాధిస్తోంది. నా సేవింగ్స్‌ పోగొట్టుకోవడమే కాదు.. చింతలేని జీవితాన్ని చిందరవందర చేసుకున్నా. నిపుణుల్ని సంప్రదిస్తే వారు చెప్పిన సంఘటనలు విని షాక్‌ అయ్యా. ‘డియర్‌... ’అంటూ కలిసే ఈ డేటింగ్‌ మోసగాళ్ల కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న కేసులు ఎన్నో ఉన్నాయట. నాలా  అమ్మాయిలే కాదు. ఎంతో మంది అబ్బాయిలు మోసపోయిన తీరుని విని షాక్‌ అయ్యా. నా లైఫ్‌లో జరిగినట్టే...
నెట్టింట్లో మాటకలుపుతారు...
మాయ చేస్తారు.. ప్రేమంటూ.. నువ్వే ప్రాణమంటారు!
నువ్వు లేక నేను లేనని నమ్మిస్తారు..
ఒకరికొకరం అంటూ సాయం కోరతారు..
అందినకాడికి లాగేస్తారు.. ఊడ్చేస్తారు..
వారెవరో తెలుసా? డాట్‌ కామ్‌ ఇండస్ట్రీలో ‘కాన్‌ ఆర్టిస్టులు’ డేటింగ్‌ యాప్‌లు... సోషల్‌ నెట్‌వర్కులు వీరి అడ్డాలు మీ వర్చువల్‌ సర్కిల్‌లోనూ ఉండుంటారు..
ఏదొక రోజూ మీకూ ఓ రిక్వస్ట్‌ వస్తుంది..
ఒకటి రెండు సార్లు ఆలోచించి ఓకే చేయండి లేకుంటే నాలా ఆ రిక్వస్ట్‌ మీ జీవితాన్ని మార్చేస్తుంది.
(ఇది యదార్థ సంఘటనకి అక్షర రూపం. పాత్రల పేర్లు మార్చాం)


ఎలా గుర్తించడం?

* విదేశాల నుంచని చెబుతారు. కానీ, వారి టెక్స్ట్‌ మెసేజ్‌ల్లో అక్షర, వ్యాకరణ దోషాలు పదే పదే దొర్లుతుంటాయి. ఇలా అనిపిస్తే వాళ్లు లోకల్‌ అని అర్థం.
* ప్రొఫైల్‌లో తమ గురించి రాసుకున్నది చదివించేలా ఉంటే అనుమానించాల్సిందే. ఎందుకంటే ఈ కాన్‌ ఆర్టిస్టులు డేటింగ్‌ సైట్‌ల్లో బాగున్న ప్రొఫైల్స్‌ని కాపీ, పేస్ట్‌లు చేస్తుంటారు. సొంతంగా ఆలోచించి రాసేంత సమయం తీసుకోరు. ఎందుకంటే... అదే పనిగా పదుల సంఖ్యలో ఎకౌంట్స్‌ని మెయిన్‌టెన్‌ చేస్తూ వల పన్నేందుకు ప్రయత్నిస్తుంటారు.
* అధికారికంగా ఎలాంటి మోసపూరిత ఆలోచనలు లేని వారు వారి ఎకౌంట్‌ల్లో అన్ని అప్‌డేట్స్‌ పెడుతుంటారు. వారెక్కడున్నదీ...  ఏం చేస్తున్నదీ... అన్నీ అప్‌డేట్‌ చేస్తుంటారు. కానీ, స్కామర్లు వీటికి దూరం. వారేం చేస్తున్నదీ.. ఎక్కడున్నదీ షేర్‌ చేయరు.
* జాబ్‌ పోగొట్టుకున్నాననో... ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలనో.... కొత్త వ్యాపారం స్టార్ట్‌ చేస్తున్నానో డబ్బు కోరడం ఒక్కటే కాదు. ఇంకాస్త క్రియేటీవ్‌గా స్కామర్లు వల పన్నుతారు. పూర్తిగా నమ్మించాక మీకో ఖరీదైన బహుమతి పంపామని చెబుతారు. ఎయిర్‌పోర్ట్‌లో ఉందని చెబుతారు. సుంకాన్ని చెల్లించి తీసుకునేలా ప్రేరేపిస్తారు. నమ్మారో కాన్‌ ఆర్టిస్టుల నటనకి బలయినట్టే.


‘గీత’దాటొద్దు

వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్‌ చేసేలా పోస్టింగ్‌లు పెట్టొద్దు. ఓ సర్వేలో తేలిందేమంటే... పది మందిలో అడ్రస్‌లు, ఫోన్‌ నెంబర్లు, కుటుంబ వివరాల్ని, వ్యక్తిగతమైన ఫొటోలను పంచుకునేందుకు వెనకాడడం లేదు. మాటల్లో పెట్టి కొన్నిసార్లు మీరెలాంటి పాస్‌వర్డులు వాడతారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీరు గ్రహించేలోపే మీ ప్రైవసీని మొత్తాన్ని కొల్లగొట్టేస్తారు. ఇంటర్‌ తప్పిన ఓ కుర్రాడు డాక్టరుగా ఆన్‌లైన్‌లో వెబ్‌పేజీని క్రియేట్‌ చేసుకుని అమ్మాయిల నుంచి డబ్బు కాజేసిన ఘటనే ఇందుకు ఉదాహరణ. అతను లక్ష్యంగా చేసుకున్న ఏ ఒక్క అమ్మాయితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. స్మార్ట్‌గా వాళ్లతో రిలేషన్‌ కొనసాగిస్తూ ఆరు నెలల్లో 28 మంది అమ్మాయిల నుంచి సుమారు 6 లక్షలు తీసుకున్నాడు. అతనికున్న కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోనే అమ్మాయిల సైకాలజీని అర్థం చేసుకుని నెట్టింట్లో చేసిన దందా ఇది. కొందరు స్కామర్లు గ్రూపుగా పని చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో నిపుణులై ఉంటారు. ఒకరు ఛాటింగ్‌ పేరుతో దగ్గరైతే... ఇంకొకరు ఆ డబ్బుని ఏ ఎకౌంట్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్‌ అయ్యేలా చూడాలనేది చూసుకుంటాడు. మరొకరు తెలివిగా మోసం చేసేందుకు అనువైన మార్గాల్ని అన్వేషిస్తారు.

- సీహెచ్‌ఏఎస్‌ మూర్తి, జాయింట్‌ డైరెక్టర్‌ సీ-డాక్‌

కాస్త జాగ్రత్త

* ఫ్రెండ్‌ రిక్వస్ట్‌ పంపడానికి ముందే మీ ప్రొఫైల్‌ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. స్టేటస్‌ అప్‌డేట్‌లు, కామెంట్‌లు, సంభాషణల్ని వడపోస్తారు. మీపై ఓ అంచనాకి వచ్చాకే ఆహ్వానం పంపుతారు.
* మీరు పంచుకునే ఫొటోల ఆధారంగా మీరు పేరెంట్స్‌తోనా.. సింగిల్‌గా ఉంటున్నారా? అనే విషయాల్ని పసిగడతారు. సింగిల్‌గా ఇంటికి దూరంగా ఉన్నవారినే లక్ష్యంగా పెట్టుకుంటారు.
* వేళాపాళా లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఛాట్‌ చేస్తున్నారంటే ఎలాంటి బాధ్యతా లేకుండా ఉన్నారని గుర్తించాలి. స్కామర్లకు వేరే పని ఉండదు. ట్రాప్‌ చేయడమే వారి పని.
* మీ ఆలోచనలు, అభిరుచులకు మాత్రమే కట్టుబడి ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారి కంటూ ఎలాంటి వ్యక్తిగత అభిరుచులు లేనట్టుగా మసులుకుంటే అనుమానించాల్సిందే.
* వ్యక్తుల ప్రొఫైల్స్‌, వారి మాటల్లో... చేష్టల్లో ఏవైనా మోసపూరితమైనవి అనిపిస్తే వెంటనే డేటింగ్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ నిర్వాహకులకు రిపోర్ట్‌ చేయండి.
* పదే పదే ఇల్లు లేదా ఆఫీస్‌ అడ్రస్‌ అడుగుతున్నా నిరభ్యంతరంగా అన్‌ఫ్రెండ్‌ చేసేయండి.
* సంభాషణల్లో ఏవైనా వెబ్‌ లింక్‌లను పంపుతున్నట్లేయితే క్లిక్‌ చేయకపోడం మంచిది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని