ట్రెండు మారినా...ఫ్రెండు మనోడే!

ఆగస్టు మాసం... తొలి వారం సందడే వేరు. ‘మామా.. ఎక్కడ కలుద్దాం. మన బ్యాచ్‌ అంతా వస్తున్నారా? ఎవ్వరూ మిస్‌ అవ్వకూడదు..’ అంటూ వాట్సాప్‌ల్లోనూ.. వాయిస్‌ మెసేజ్‌ల్లోనూ ఒకటే కమ్యునికేషన్‌. ఎందుకంటే... రేపే స్నేహితుల దినోత్సవం. సెలబ్రేట్‌ చేసుకోవడం కామన్‌...

Published : 04 Aug 2018 04:48 IST

ట్రెండు మారినా...ఫ్రెండు మనోడే!  

ఆగస్టు మాసం... తొలి వారం సందడే వేరు. ‘మామా.. ఎక్కడ కలుద్దాం. మన బ్యాచ్‌ అంతా వస్తున్నారా? ఎవ్వరూ మిస్‌ అవ్వకూడదు..’ అంటూ వాట్సాప్‌ల్లోనూ.. వాయిస్‌ మెసేజ్‌ల్లోనూ ఒకటే కమ్యునికేషన్‌. ఎందుకంటే...
రేపే స్నేహితుల దినోత్సవం. సెలబ్రేట్‌ చేసుకోవడం కామన్‌. కానీ, దానికి ముందు కాస్త తీరిక దొరికినప్పుడు స్నేహ గీతాన్ని రివైండ్‌ చేయండి. ఎన్నో ఏళ్ల ముందు కలిసినా... నిన్నగాక మొన్నే కలిసినా.. ఫ్రెండు ఫ్రెండేగా? అందుకే పైన ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేయండి. మీరెలాంటి ఫ్రెండు? మీకెలాంటి ఫ్రెండ్స్‌ ఉన్నారో క్లారిటీ వస్తుంది. దీంతో సందర్భం ఏదైనా కలిసిన స్నేహాన్ని కలకాలం ఎలా నిలుపుకోవాలో తెలుస్తుంది.
క్లాస్‌మేట్‌.. రూమ్‌మేట్‌... బెంచ్‌మేట్‌
ఇలా అన్ని చోట్లా పార్టనర్‌ ఒక్కడే.. ‘స్నేహితుడు’
అలాంటి ఫ్రెండుతో ఏం పంచుకుంటున్నారు?
తీయని కలలా? తోచిందేదైనానా?
తరచి చూడండి.
మామా.. చిచా... రేయ్‌... కాకా...
ఇలా ఎలాగైనా పిలవగలిగేది..
పిలిస్తే పలికేది ఒక్కడే.. ‘స్నేహితుడు’
అలాంటి దోస్త్‌ ఎలా కలిశాడు..
మీరెలా ఫ్రెండ్‌ అయ్యారు?
ఛాన్స్‌ కొద్దీనా? ఛాయిస్‌తోనా?
గుర్తు తెచ్చుకోండి.
సినిమాలు.. షికార్లు... పార్టీలు
దేంట్లోనైనా జోష్‌ని పెంచేది ఒక్కడే.. ‘స్నేహితుడు’
అలాంటి జిగిరీతో ఎంత దూరం ప్రయాణం చేస్తున్నారు?
క్లాస్‌ ముగిసేవరకూ? క్యాంపస్‌ దాటే వరకేనా?
సమీక్షించుకోండి.
కష్టాలు.. ఒత్తిళ్లు.. కుంగుబాట్లు...
ఏ పరిస్థితిలోనైనా ఆశించకుండా నేనున్నాను అనేది ఒక్కడే... ‘స్నేహితుడు’
అలాంటి బెస్టీలు మీకెంతమంది ఉన్నారు?
కనీసం ఒక్కరు? లేదంటే ఇద్దరు?
ఇప్పటికైనా వెతకండి.

ఛాన్స్‌, ఛాయిస్‌... ఏదైనా?

స్మైలేంద్రకి ఇంటర్‌ వరకూ ఉన్న సర్కిల్‌ వేరు. ఇంజినీరింగ్‌ క్యాంపస్‌లోకి అడుగుపెడుతూనే మొదట ఆలోచించింది ఫ్రెండ్స్‌ గురించే. ఓరియంటేషన్‌కి వెళ్లి కూర్చుకోగానే. పక్క సీట్లో రూపేష్‌. ఒకరినొకరు విష్‌ చేసుకున్నారు. క్యాంపస్‌లో మొదటిగా హ్యాండ్‌ షేక్‌ చేసింది రూపేష్‌తోనే. వీళ్లిద్దరూ బై ఛాన్స్‌ తొలి రోజు పక్క పక్కనే కూర్చోవడం వల్ల ఫ్రెండ్స్‌ అయ్యారు. అదే సెక్షన్‌లో సుమ. క్లాస్‌ తొలి రోజు మొదలు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. ఓ నెల తర్వాత అనుకుంటా... వరుణ్‌ ఒక్కడితోనే మాట కలపడం మొదలెట్టింది. తనతో తప్ప. మరెవ్వరితో క్లోజ్‌గా మాట్లాడదు. వరుణ్‌ కూడా అంతే... తనతోనే ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడతాడు. వీరిద్దరిదీ ఛాయిస్‌. తమకి సరిపడేవాళ్లు ఎవరో వెతుక్కుని స్నేహితులవ్వడం అన్నమాట. సో... మీ స్నేహం బై ఛాన్స్‌ లేదా ఛాయిస్‌నా? ఇంటి పక్కనోళ్లు... డాన్స్‌ క్లాస్‌లో... ట్యూషన్‌లోనో... ఇలా బై ఛాన్స్‌ చాలా మంది ఫ్రెండ్స్‌ అవుతుంటారు. ఇలా ‘హాయ్‌లు.. బాయ్‌లు’ చెప్పేవారు చాలా ముందే ఉంటారు. కానీ, వీళ్లలో కొందర్ని ఆలోచించి ఛాయిస్‌ చేసుకుంటాం. వారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ దగ్గరవుతాం. ‘మై బెస్ట్‌ ఫ్రెండ్స్‌’ అంటుంటాం!!

కనీసం ఒక్కరు? లేదంటే ఇద్దరు?

వినీత్‌కి చదువుకోవడం ఇష్టం. సమాజంలో హుందాగా బతకాలనుకుంటాడు. తన ఫ్రెండ్స్‌లానే హాయిగా నవ్వాలనుకుంటాడు. అల్లరి చేయాలనుకుంటాడు. కానీ, ఇవేం చేయడు. పెద్దగా మాట్లాడడు. కారణం... ఇంట్లో పరిస్థితులు. నాన్న తాగుబోతు. పేదరికం. రోజూ ఇంట్లో గొడవలు. ఫ్రెండ్స్‌ ఎవరికి చెప్పాలో తెలీదు. చివరికి ఫేస్‌బుక్‌లో ‘ఐ క్విట్‌’ అని స్టేటస్‌ పెట్టి  ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్రెండ్‌ అప్‌డేట్‌ చూసేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది... అలాగే, రమ్యకీ ఓ సమస్య. ఇంటర్‌లో బాగా స్కోర్‌ చేసింది. మెడిసిన్‌లో ర్యాంకు సాధిస్తానో లేదో అనే ఒత్తిడి. తెలియని ఆందోళన. పేరెంట్స్‌కి చెప్పలేదు. ఇంకెవరూ? తనతో పాటు చదివిన ఏడో తరగతి ఫ్రెండు. ఫోన్‌లో మాట్లాడింది. తనేం చెప్పిందో ఏమో. రెట్టించిన ఉత్సాహంతో చదవడం మొదలుపెట్టింది.

గుర్తుంచుకోండి...

  * ఎలాంటి ఫ్రెండ్‌ అయినప్పటికీ మన వ్యక్తిత్వంలో.. నిర్ణయాల్లో ఎవరి పాత్ర వారిది. కొందరు ప్రొఫెషనల్‌ స్కిల్స్‌ నేర్పితే.. ఇంకొందరు లైఫ్‌ స్కిల్స్‌ రుచి చూపించి ఉంటారు. థాంక్‌ ధెమ్‌!!

ఇప్పటికైనా వెతకండి

* వెళ్లాల్సిన చోటు రాకముందే దారీతెన్నూ లేకుంటే మరో ద్వారం తెరిచి గమ్యాన్ని చేరేలా చేసే శక్తి ఒక్క స్నేహానికే ఉంది. నమ్మండి.. వెతకండి. మీకూ ఒక్కరో.. ఇద్దరో ప్రియమిత్రులు ఉంటారు. మీతో మీరు పంచుకోలేనివి కూడా వారితో పంచుకోగలరు.


స్నేహం ఇలాగైతే మధురమే!

బై ఛాన్స్‌ లేదంటే ఛాయిస్‌తో స్నేహితులవ్వడం అనేది ఫ్రెండ్‌షిప్‌కి ఓ ఎంట్రీపాయింట్‌ లాంటిది. ఒక్కసారి ఫ్రెండ్స్‌ అయ్యాక ఇరువురి ఆసక్తులు, అభిప్రాయాలు వాటిని ఎక్స్‌ప్రెస్‌ చేసే తీరు ఆధారంగా స్నేహం కొనసాగుతుంది. చదువు, ఉద్యోగం ఎక్కడైనా ఇరువురి స్నేహం వారి ఎదుగుదలకి ఉపయోగపడాలి.
* పంచుకునే ఇరువురి వ్యక్తిగత విషయాల్ని ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు. నెట్టింట్లో ఓ నెటిజన్‌గా ప్రైవసీని ఎలా కాపాడుకుంటామో.. అదే మాదిరి ఫ్రెండు ప్రైవసీని కాపాడుకున్నప్పుడే స్నేహం ఓ పవిత్రబంధంగా బలపడుతుంది.
* స్నేహంలోనూ గీత దాటే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఫ్రెండ్‌ అయిన కొద్ది రోజులకే వ్యక్తిగత వివరాల్ని పంచుకోవడం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి.
* పరిచయం మొదట్లో ఒకలా.. తర్వాత మరోలా ఉండొద్దు. గెలిచినప్పుడు దగ్గరకొచ్చి.. ఓడినప్పుడు ముఖం చాటేసే స్నేహం ఎప్పుడూ నిలవదు. ఉదాహరణకు ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థికి ఇంజినీరింగ్‌ మొదటి సెమిస్టర్‌లో ఎక్కువ మంది ఫ్రెండ్స్‌ పేరుతో దగ్గరవుతారు. పలు కారణాలతో అదే విద్యార్థికి ఏడాది చివర్లో ఏవైనా బ్యాక్‌లాగ్‌లు ఉంటే నెమ్మదిగా కొందరు దూరం అవుతారు. ఆశించి స్నేహం చేసేవారే ఇలా ప్రవర్తిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ‘నా ఫ్రెండు.. నాకు ఫ్రెండే!’ అనుకునే వారే నిజమైన స్నేహితులు.
* అభిప్రాయాలు, ఆలోచనలపై వెంటనే ఓ అంచనాకి వచ్చేస్తుంటారు. ఓ వయసు వచ్చాక మనకి అడుగు దూరంలోనే నిత్యం అందుబాటులో ఉండేది ఎక్కువగా ఫ్రెండ్సే. వాళ్ల ప్రభావం విద్యార్థి దశలో చాలా ఎక్కువ.
* మన జీవిత లక్ష్యాన్ని మార్చేవాడు ఫ్రెండు కాదు.. అనుకున్న లక్ష్యానికి త్వరగా దగ్గరయ్యేలా చేసేవాడే నిజమైన స్నేహితుడు.

సెల్ప్‌చెక్‌

* స్నేహం నుంచి ఆశిస్తారా?
* ఏదైనా షేర్‌ చేసుకుంటారా?
కారణం ఏదైనా క్షమిస్తారా?
స్నేహం, ప్రేమ ఒకటి కాదంటారా?
ఆపద ఏదైనా వెంటనే స్పందిస్తారా?
అవసరారికి ఆదుకోకుంటే దూరం చేస్తారా?
మీ తప్పుని అంగీకరిస్తారా?
మీలో చెడుని గుర్తిస్తే స్వీకరిస్తారా?
మీది విలువలతో కూడిన స్నేహమేనా?
మీపై స్నేహం ప్రేమగా మారితే ఒకే అంటారా?
వీటిలో ఏడింటికి పాజిటివ్‌గా స్పందించినా మీరో మంచి ఫ్రెండే!


తీయని కలలా.. తోచిందేదైనా?

క్యాంపస్‌ పిట్టగోడపై.. రాజా, శ్రీను కలిస్తే చాలు. ‘నిన్న మ్యాచ్‌ కోహ్లీ బ్యాటింగ్‌ కేక రా. అప్పుడే కరెంటు పోయిందిరా. అందుకే నీకు ఫోన్‌ చేశా. రేయ్‌.. శీను ఆర్‌ఎక్స్‌100 చూశావా? కచ్చితంగా చూడాలిరా. చంపేశాడు...’ ఇలా స్పోర్స్ట్‌, సినిమాలు, గాసిప్‌లు. ఒకటా రెండా.. ఉన్నంత సేపు తోచిందేదో మాట్లాడేసుకుంటారు. అదే క్యాంపస్‌ జిమ్‌లో విశ్వక్‌, సందేశ్‌... ‘ఏంట్రా.. విశ్వా ధ్యాస వర్క్‌అవుట్స్‌ మీదలేనట్టుంది. ఏం ఆలోచిస్తున్నావ్‌. నెక్స్ట్‌ సెమిస్టర్‌ ఫీజు గురించా? నేను డాడీతో మాట్లాడాలే. నీకు డబ్బు రావడం ఆలస్యమైతే నేను ఇస్తాలే. చివరి సెమ్‌ తర్వాత ఏంటి ప్లాన్‌? ఇద్దరం కలిసే పీజీ ప్లాన్‌ చేద్దామా? డాడీకి తెలిసిన ఫ్రొఫెసర్‌ ఎవరో ఉన్నారంటా కలవమన్నారు. అందరం కలిసి ఫేర్‌వెల్‌ ట్రిప్‌ ఎటు వెళ్దాం? అన్నీ నేను చూసుకుంటాలే..’ విశ్వక్‌ ఏం చెప్పకపోయినా. సందేశ్‌కి ఎలా తెలుస్తుంది? వాడేగా ఫ్రెండంటే? చెప్పకపోయినా తెలుస్తాయ్‌.

క్లాస్‌ ముగిసేవరకా?క్యాంపస్‌ దాటేవరకా?

వాట్సాప్‌ వెర్షన్లు మార్చినట్టుగా మిలీనియల్‌ మహేష్‌ ఫ్రెండ్స్‌ మారిపోతుంటారు. డ్యాన్స్‌ క్లాస్‌లో ఒకరికి బాయ్‌ చెబితే.. స్పోర్స్ట్‌ అకాడమిలో ఇంకొరికి హాయ్‌ చెబుతాడు. తన వాట్సాప్‌ గ్రూపుల్లో ఫ్రెండ్స్‌ వందల్లోనే. మరీ, అంతమందా అంటే? ‘నిద్ర లేచింది మొదలు.. గడియారంతో పరుగు. చదువు ఒక్కటేనా.. నాకిష్టమైన డ్యాన్స్‌, స్పోర్స్ట్‌ అన్నిట్లో పాల్గొంటా. అన్ని చోట్లా ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఉండాల్సిందే. అందరూ సమానమే’ అని ముక్కుసూటిగా చెప్పేస్తాడు. అంతే.. హుషారుగా ఉండేే నాగేష్‌ మాత్రం ఇందుకు భిన్నం. ‘వందల్లో మిత్రులున్నా నా స్కూల్‌ ఫ్రెండే బెస్టీ. వాడు లేనిదే నా సెలబ్రేషన్‌ ఏదీ స్టార్ట్‌ అవ్వదు’ అని సున్నితంగా చెబుతాడు.

తరచి చూడండి...

* తోచిందేదో మాట్లాడుతున్నా. భవిష్యత్తు కోసం కనే తీయని కలలైనా. తరచి చూస్తే మిత్రుడి మదిలోని ధ్యాసేంటో  తెలిసిపోతుంది. పిట్టగోడపై కబురుల్లో కిక్‌ ఒకరకమైతే.. ఫ్రెండు మనసుని అర్థం చేసుకోవడంలో మజా మరోరకం. మరి, మీరెలా స్పందిస్తున్నారు?

సమీక్షించుకోండి..

* నిత్యం అప్‌డేట్‌ అవ్వడం అనివార్యం. కానీ, అడోబ్‌ ఫొటోషాప్‌ వచ్చింది కదాని... చిన్నప్పుడు నేర్చుకున్న ఎమ్మెస్‌ పెయింట్‌ని మర్చిపోతామా? స్నేహ మాధుర్యాన్ని తొలిసారి రుచి చూపించిన పాత మిత్రుల్ని గుర్తుంచుకోండి. వెతికి పట్టుకుని స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి. వీలుంటే కలిసి హగ్‌ చేసుకుని రండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని