ఆమె మనసు... నలుపు

అందం మనసుకి సంబంధించింది... శరీరానికి కాదు. ఈ నిజం తెలుసుకోలేక బలైపోయానంటున్న ఓ యువకుడు. ‘అమ్మాయి రంగు తక్కువ.

Published : 30 Jul 2016 01:37 IST

ఆమె మనసు... నలుపు

అందం మనసుకి సంబంధించింది... శరీరానికి కాదు. ఈ నిజం తెలుసుకోలేక బలైపోయానంటున్న ఓ యువకుడు.

‘అమ్మాయి రంగు తక్కువ. మరోసారి ఆలోచించరా’ నసుగుతూనే ఉంది అమ్మ. నేనేం పట్టించుకోలేదు. తన మనసు నాకు నచ్చింది. అంతే. ‘అమ్మాయి నచ్చింది’ మరో మాటెత్తకుండా చెప్పేశా. పెళ్లిచూపులు ముగిశాయి.

నెల కిందటే పరిచయమైంది తను. మొహంపై చెరగని చిరునవ్వు. ఎవరినీ నొప్పించని మనస్తత్వం ఆమె సొంతం. ఈరోజుల్లో ఇలాంటి అమ్మాయిలు అరుదు. ఇదే చెప్పి పెద్దల్ని ఒప్పించా. రంగు తక్కువని గొణిగినా నా బలవంతంతో ఒప్పుకున్నారు. ముహూర్తం పెట్టేసుకున్నాం. నెలరోజుల్లో పెళ్లి.

రోజులు గడుస్తున్నా అమ్మ అసంతృప్తి తగ్గలేదు. ‘అమ్మాయి నలుపు. నాకు నచ్చలేదు’ రోజుకు పదిసార్లైనా గుర్తు చేసేది. విధిలేక ‘మీరు చూసిన అమ్మాయినే చేస్కుంటా’ అని కన్నవాళ్లకి మాటిచ్చా. మొదటి సంబంధం కాన్సిల్‌ అయింది.

తొందర్లోనే నా జీవితంలోకి ఓ అందగత్తె వచ్చింది. కోడల్ని చూసి అమ్మ మురిసిపోయేది. తనతో బయటికెళ్తే నేనూ గర్వపడేవాణ్ని. కానీ తను ఇంట్లోకి అడుగుపెడుతూనే ఏమందో తెలుసా? ‘ఇది ఇల్లా? ఓల్డేజీ హోమ్‌నా?’ అంది అమ్మమ్మ, నాన్నమ్మలను ఉద్దేశించి. మా గుండెలదిరాయి. ఆ ఒక్కరోజే కాదు... ప్రతిరోజూ తూటాల్లాంటి మాటలతో మా మనసుల్ని ఛిద్రం చేసేది. ఏరోజు ఏం వినాల్సి వస్తుందో అని హడలిపోయేవాళ్లం. నోటికి ఏది వస్తే అది వాగేది. మనుషులంటే లెక్క లేదు. నెల తిరిగేలోపే స్వర్గంలాంటి ఇంటిని నరకం చేసింది.

వేరు కాపురం పెడితే తను మారుతుందనుకుంది అమ్మ. పెట్టాక అదీ జరగలేదు. మీ అమ్మానాన్నలతో మాట్లాడొద్దు... కలవొద్దు... అని షరతులు పెట్టేది. ఒక్కగానొక్క కొడుకు జీవితాన్ని నాశనం చేశానని అమ్మ ఏడ్వని రోజు లేదు. తన టార్చర్‌ భరించలేక ఓరోజు ఆత్మహత్యా యత్నం చేసి ఓడిపోయా. దీంతో తన దృష్టిలో మరింత చులకనయ్యా. చేతకానివాడిననేది. గృహహింస కేసు పెడతానని బెదిరించేది.

మూడేళ్లు గడిచాయి. ఇప్పటికీ నాకు అవే కష్టాలు. మరోవైపు నేను వదులుకున్న అమ్మాయి భర్తతో, పండంటి బాబుతో వూళ్లొ నా కళ్లముందే తిరుగుతోంది. తనని చూసినప్పుడల్లా మనసుకి రంపపు కోత. మేం పెళ్లి రద్దు చేసుకుంటున్నాం అన్నపుడు మాపై గొడవకు దిగలేదు. హుందాగా సెలవు తీసుకుంది. నన్ను మరుగుజ్జును చేసింది. అంతమంచి అమ్మాయిని వదులుకున్నందుకు ఇప్పుడు అందరం బాధ పడుతున్నాం. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? మనం చేసిన తప్పులకు వచ్చే జన్మలో శిక్ష పడుతుందనేది అబద్ధం. ఇప్పుడే అనుభవించి తీరాలి. నేనే నిదర్శనం.

ఓ పాఠ‌కుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని