ప్రేమ ఆటకు ‘నో’ పెళ్లి బాటకి ‘సై’

ఏదో పనుండి చాలారోజుల తర్వాత మామయ్యకి ఫోన్‌ చేశా. ‘హాయ్‌ బావా.. నాన్న వూరెళ్లారు. మీరంతా ఎలా ఉన్నారు?’ అవతలి వైపు చిన్ని.

Published : 01 Oct 2016 01:29 IST

ప్రేమ ఆటకు ‘నో’ పెళ్లి బాటకి ‘సై’

ఏదో పనుండి చాలారోజుల తర్వాత మామయ్యకి ఫోన్‌ చేశా. ‘హాయ్‌ బావా.. నాన్న వూరెళ్లారు. మీరంతా ఎలా ఉన్నారు?’ అవతలి వైపు చిన్ని. నా మరదలు. మళ్లీమళ్లీ వినాలనిపించేంత తీయని గొంతు. చూసి ఏళ్లైంది. కొద్దిరోజులకే బంధువుల ఫంక్షన్‌లో కలిసింది. తన రూపం కూడా గొంతులాగే ఉంది.

బీటెక్‌ అయిపోగానే ఉద్యోగం కోసం సిటీకొచ్చా. చిన్ని కూడా ఏదో కోర్సు చేయడానికొచ్చిందట. ఓసారి బస్‌లో కనపడింది. పలకరింపులయ్యాక ఫోన్‌ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. ఆపై మా సెల్‌ఫోన్లకు నిద్ర కరువైంది. రూపంలోనే కాదు.. ఆప్యాయత చూపడంలోనూ తను చక్కనమ్మే. వాట్సాప్‌లోనే ప్రపోజ్‌ చేశా. కొన్నాళ్లు నాన్చి నా ప్రేమకు పచ్చజెండా వూపింది. ఓసారి వాళ్లింటికెళ్లా. నాకోసం కష్టపడి ఎగ్‌ కర్రీ చేసింది. నచ్చకపోయినా ‘సూపర్బ్‌గా ఉంద’ని పొగిడేశా. ఆరోజైతే నాకు పండగే. రోజంతా తన పక్కనే ఉండి జాలీగా గడిపా. ఏదో వంకతో మరోసారెళ్తే వాళ్లక్క మధ్యలో చేరింది. కళ్లతోనే వూసులాడుకున్నాం. సిటీలో ఉన్నపుడైతే వీలున్నప్పుడో, వీలు చేస్కొనో కలుస్తూనే ఉండేవాళ్లం. ‘బావా... నన్నొకడు వేధిస్తున్నాడు’ అందోరోజు. వివరాలు చెప్పమంటే నా ఎక్స్‌ లవరంది. గుండె కలుక్కుమంది. ‘వయసు ఆకర్షణలో తనపై మోజుపడ్డా. అది గతం. ఇప్పుడు నా మనసంతా నువ్వే ఉన్నావ్‌’ అంది. చిన్ని నిజాయతీ నచ్చి తనపై ప్రేమ రెట్టింపైంది. జంటపక్షుల్లా తిరిగేవాళ్లం.

మా ప్రేమ విషయం బావకి చెప్పా. మా అమ్మానాన్నల్ని పెళ్లికి ఒప్పిస్తానన్నాడు. జరగబోయే పెళ్లి, మరదలితో జీవితం వూహించుకుంటూ కలల్లో తేలిపోయా. సరిగ్గా ఈ సమయంలోనే బాంబ్‌ పేల్చింది చిన్ని. ‘నువ్వు నాకు వద్దు బావా. మనిద్దరికీ సెట్‌ కాదు’ అంటూ ఫోన్‌, చాట్‌ కట్‌ చేసింది. వూపిరి ఆగినంత పనైంది. మీవాళ్లని నేనొప్పిస్తా అని ఎన్నిసార్లు బతిమాలినా వినదే! నా ఓపిక, విచక్షణ నశించాయి. ‘ఒకడ్ని మర్చిపోయావ్‌. ఇంకొకడ్ని మోసగించడం నీకు తేలికే’ అని తిట్టా. ఏడుస్తూ వెళ్లింది.

మరదలి బాధ నుంచి తేరుకోవడానికి చాన్నాళ్లే పట్టింది. తర్వాతేంటి? నేనేంటో నిరూపించుకోవడానికి మంచి ఉద్యోగమే ఏకైక దారిగా కనిపించింది. మూణ్నెళ్లు తీవ్రంగా కష్టపడ్డా. నా శ్రమ ఫలించి ఓ ఎమెన్సీ కంపెనీలో కొలువు దక్కింది. నేను హ్యాపీ. నెల తిరక్కముందే మామయ్య వూడిపడ్డాడు. ‘చిన్నీని పెళ్లి చేసుకుంటావా?’ అనడిగాడు. నవ్వుతోపాటు ఆపుకోలేనంత కోపమొచ్చింది. ‘ఇంతకీ నీ కూతురు ఒప్పుకుందా?’ అంటే ‘చిన్నికి నువ్వంటే ఇష్టం అని చెబితేనే వచ్చాన్రా’ అన్నాడు. ఓసారి తనని కలవాలన్నా.

‘హాయ్‌ బావా?’ అంటూ ఏమీ ఎరగనట్టే పలకరించింది. చాచి కొట్టాలనిపించింది. ‘నన్ను పెళ్లి చేస్కోవడం ఇష్టమే అన్నావట. నా ఉద్యోగం చూసి మళ్లీ ప్రేమ పుట్టిందా?’ అనడిగా ఎకసెక్కంగా. ‘కొత్తగా పుట్టుకు రావడం ఏంటి? ఎప్పట్నుంచో ఉంది. ఉంటుంది కూడా’ అంది. అయినా నా కోపం చల్లారలేదు. అలాంటపుడు మనిద్దరికి సెట్‌ కాదని ఎందుకు చెప్పావని నిలదీశా. మరదలు ఇచ్చిన సమాధానంతో నా మతి పోయింది. మేమిద్దరం కలిసి ఉండటం మామయ్య చూశారట. పరువు తీయొ.ద్దని బాధ పడ్డారట. ‘నీ దృష్టిలో నాన్నను విలన్‌ని చేయలేను. అలాగే మా నాన్నని బాధ పెట్టడం నాకిష్టం లేదు. తప్పనిసరై అలా ప్రవర్తించా’ అని సంజాయషీ ఇచ్చుకుంది. నా కళ్లముందు అపార్థాల మబ్బులు తేలిపోయాయి. సారీ చెప్పి ప్రేమగా తనని కౌగిలించుకున్నా.

తర్వాత షరామామూలే. మేం గాఢమైన ప్రేమలో మునిగిపోయాం. మా పెద్దలు పెళ్లి ముహూర్తాలు పెట్టేశారు. నవంబరులోనే మేం భార్యాభర్తలవబోతున్నాం. మామధ్య ఎలాంటి ఎడబాట్లు రాకుండా మా జీవితం సాఫీగా సాగిపోవాలని మీరూ దీవించండి.

-మ‌నోహ‌ర్‌, న‌ల్గొండ‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని