నేనే నానీనే.. నీకై వేచి ఉన్నానే!

కళ్లు మూస్తే గతం.. అదో తీపి జ్ఞాపకం.. కళ్లు తెరిస్తే వర్తమానం.. అంతా బాధలమయం....

Published : 29 Apr 2017 02:00 IST

నేనే నానీనే.. నీకై వేచి ఉన్నానే!

కళ్లు మూస్తే గతం.. అదో తీపి జ్ఞాపకం.. కళ్లు తెరిస్తే వర్తమానం.. అంతా బాధలమయం.
నచ్చిన అమ్మాయితో బైక్‌పై షికార్లు.. పార్కుల్లో ప్రేమ వూసులు.. కౌమారం నుంచే ఇలాంటి వూహలు ఉక్కిరిబిక్కిరి చేసేవి. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలనిపించేది.

డిగ్రీలో ఒకమ్మాయి పరిచయమైంది. మా పక్క వూరే. మెసేజ్‌లతో మొదలైన పరిచయం చాటింగ్‌తో తెల్లారేదాకా కొనసాగేది. తనని ముద్దుగా ‘బుజ్జీ’ అని పిలిచే వాణ్ని. నన్ను ‘నానీ’ అనేది.

చదువైపోయింది. ఆరోజు గది ఖాళీ చేసి ఇంటికెళ్తున్నా. ‘నేనూ నీతో రావొచ్చా?’ అంది. లడ్డూ కావాలా నాయనా.. అంటే ఎవరైనా వద్దంటారా? ఆరుగంటల ప్రయాణంలో అరనిమిషం వృథా చేయలేదు. ‘మా అన్నయ్య, అమ్మే నా లోకం. నువ్వన్నా అంతే ఇష్టం’ బస్సు దిగుతుంటే చెప్పింది. తననక్కడే గుండెలకు హత్తుకున్నా.

మా కులాలు వేరు. నీకు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే మావాళ్లు పెళ్లికి ఒప్పుకుంటారంది. సిటీకొచ్చా. తినీ తినక.. పగలూరాత్రీ మర్చి చదివా. ఎంత కష్టమైనా ఓర్చుకున్నా. ఎస్‌.ఐ.ఉద్యోగం కొద్దిలో తప్పినా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా. వూరంతా పొగుడుతున్నా బుజ్జికి దగ్గరవుతున్నాననే సంతోషమే ఎక్కువ కిక్‌ ఇచ్చేది. కొన్నాళ్లకి తనూ టీచర్‌గా ఎంపికైందనే శుభవార్త. ఇద్దరం సెటిలయ్యామని పెద్దల ముందుకె’ళ్లాం. ‘ఠాఠ్‌.. మేం ఒప్పుకోం’ అన్నారు. కట్నం ఆశ చూపి తనని చదువు లేని ఒకబ్బాయికి కట్టబెట్టాలనుకున్నారు. అసలు దారుణం ఏంటంటే ‘మావాళ్లు నా మాట వినట్లేదు. నువ్వు నన్ను మర్చిపోవాలి’ అంటూ నన్నే మార్చడానికి ప్రయత్నించింది బుజ్జి. ఆపై మాటల్లేవ్‌. ప్రాణం పోతున్నట్టుండేది.

పెళ్లికింకా పదిహేనురోజులుంది. ‘నిన్ను వదులుకోవడం నావల్ల కావట్లేదు నానీ. నేను నీ దగ్గరికొచ్చేస్తా’ అందోరోజు. ప్రాణం లేచొచ్చింది. మా అదృష్టం బాగుండి ఆ అబ్బాయి మంచివాడు కాదని తెలియడంతో పెద్దవాళ్లే సంబంధం రద్దు చేశారు. ‘ఇక నువ్వే నా భర్తవి. నువ్వు నా మెడలో తాళి కట్టినపుడు నీ మొహంలో కలిగే ఆనందం చూడాలని ఉంది’ అంది. మూణ్నెళ్లయ్యాక గట్టిగా ప్రయత్నిద్దామని చెప్పింది. కుదిరినప్పుడల్లా మేం కలుసుకుంటూనే ఉన్నాం.

రోజులు లెక్కిస్తున్నా. ఈలోపే తనకి బ్యాంకు ఉద్యోగితో పెళ్లి కుదిరిందనే చెడు వార్త విన్నా. వెంటనే వెళ్లి నిలదీశా. ‘చనిపోతానని అమ్మ బెదిరించింది. ఒప్పుకోక తప్పలేదు. ఇష్టంలేని పెళ్లి చేసుకోలేను. నేను చనిపోతా. నువ్వైనా బాగుండు’ అంటూ ఏడ్చింది. ఏం చేయాలో తెలియని అయోమయం. గుండెలు మండుతుంటే వెళ్లి ఆ అబ్బాయిని కలిశా. మేం సన్నిహితంగా ఉన్న ఫొటోల్ని చూపించా. పెళ్లాగింది. కొత్త ట్విస్టు మొదలైంది. నాకు అండగా ఉంటుందనుకున్న బుజ్జి పోలీస్‌స్టేషన్‌లో నాపైనే ఫిర్యాదు చేసింది. ‘తనతో నాకేం సంబంధం లేదు. చదువుకునేటపుడు కొంచెం సన్నిహితంగా ఉంటే ఫొటోల్ని మార్ఫింగ్‌ చేశాడు. మమ్మల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు’ అని. పోలీసులు నా గోడు విన్లేదు.

ప్రాణంలా ప్రేమించి, భార్యలా కలిసి ఉన్న అమ్మాయే ఇలా చేసిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. కేసులు.. కోర్టులు.. చిరాకేస్తోంది. ‘పెళ్లి ఆగిపోయి రూ.ఏడు లక్షలు నష్టపోయాం. ఆ డబ్బులిస్తే కేసు వాపసు తీసుకుంటా’ రాయబారం పంపింది. నావల్ల కాదని తేల్చి చెప్పా. ఇప్పుడు నా జీవిత గమ్యం ఎటెళ్తుందో నాకే అర్థం కావడం లేదు. ఇంత జరిగినా ఇప్పటికీ నాకు తనపై ప్రేమే ఉంది తప్ప ద్వేషం లేదు. నన్ను అర్థం చేసుకుంటే పెళ్లాడి గుండెల్లో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా.

- నాని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని