క్షమించు.. ప్రణీతా

పొద్దున్నే బద్ధకంగా ఒళ్లు విరుచుకుని.. ఫోన్‌లో డేటా ఆన్‌ చేశా. బీప్‌ బీప్‌మంటూ కుండపోతలా వచ్చిపడుతున్నాయి వాట్సాప్‌ మేసేజ్‌లు. ఓపెన్‌ చేశాను. ఓ మెసేజ్‌పై నా చూపు ఆగిపోయింది. ఎరుపు రంగు బ్రేకప్‌ ఎమోజీ.. దాని పక్కనే ‘నీకు మనుషుల పట్ల నమ్మకం లేదు. ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకంపైనే అనుబంధం...

Published : 30 Sep 2017 01:44 IST

క్షమించు.. ప్రణీతా

పొద్దున్నే బద్ధకంగా ఒళ్లు విరుచుకుని.. ఫోన్‌లో డేటా ఆన్‌ చేశా. బీప్‌ బీప్‌మంటూ కుండపోతలా వచ్చిపడుతున్నాయి వాట్సాప్‌ మేసేజ్‌లు. ఓపెన్‌ చేశాను. ఓ మెసేజ్‌పై నా చూపు ఆగిపోయింది. ఎరుపు రంగు బ్రేకప్‌ ఎమోజీ.. దాని పక్కనే ‘నీకు మనుషుల పట్ల నమ్మకం లేదు. ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకంపైనే అనుబంధం నిలబడుతుంది’ అనేది సారాంశం. అది చూడగానే ముచ్చెమట్లు పట్టాయి. పంపింది ప్రణీత. నా కళ్లే కాదు.. మనసూ నమ్మలేకపోయింది. గ్లాసు నీళ్లు తాగి.. తలుపులు తెరిచి.. వరండాలోకి వచ్చాను. అక్కడో ఉత్తరం కనిపించింది. ఓపెన్‌ చేశా. తెల్లటి కాగితం మీద ఎరుపు రంగుతో ‘ప్రేమంటే నన్ను మాత్రమే ఇష్టపడటం కాదు.. నా వ్యక్తిత్వాన్నీ గౌరవించాలి. అప్పుడే మన ప్రేమకు ఓ అర్థం ఉంటుంది.. ఐ హేట్‌ యూ’ అని రాసుంది. ప్రణీతను నేనేమంత తప్పుమాట అన్నాననీ? సోఫాలో కుప్పకూలిపోయా. జ్ఞాపకాలు పది రోజుల వెనక్కి తీసుకెళ్లాయి.

ఆ రోజు విశాఖ సముద్ర తీరం అలల హోరుతో గర్జిస్తోంది. అసలే వర్షాకాలం. తూరుపు దిక్కున నల్లటి దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఇసుకతిన్నెల మీద కూర్చుని సముద్రపు నీళ్లలో కాళ్లు ఆడిస్తూ.. ‘‘చెప్పు ప్రణీత.. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం?’’ అన్నాను. ‘‘మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. అయినా మనిద్దరి గురించి ఒకరికొకరం అర్థం చేసుకోవాల్సింది చాలానే ఉంది’’ అంటూ చెప్పుకొచ్చిందామె. నాకు చిర్రెత్తుకొచ్చింది.. ‘‘ఎప్పుడూ ఇదే మాట అంటున్నావ్‌. నేనింకా నీకు అర్థం కాలేదా’’ విసుగ్గా గొంతు పెంచాను. ఎరుపెక్కిన ఆమె కళ్లు నా వైపు తీక్షణంగా చూశాయి. ఒక్క క్షణం భయమేసింది. ఆ కళ్లలోకి ధైర్యంగా చూడలేకపోయా. ఇద్దరం విసురుగా లేచి ఎవరిదారిన వాళ్లం వెళ్లిపోయాం. ‘ఛ! బుద్ధిగడ్డి తిని ప్రేమించా..’ అనుకుంటూ ఇంటికి బయలుదేరాను. మధ్యలో టీ తాగుదామని హోటల్‌ దగ్గర బైక్‌ ఆపా. అప్పుడు గుర్తొచ్చింది.. మొన్న నేను ఆ సుందర్‌కు ఫోన్‌ చేసి ఏమడిగాను.. ‘ఒరే, ఫేస్‌బుక్‌లో ప్రణీత పోస్టులకు నువ్వెందుకు అస్తమానం లైక్‌లు కొడుతుంటావ్‌?’ అని. నా క్లాస్‌మేట్‌ రవి కూడా ప్రణీత ఫోటోలకు తెగ కామెంట్లు చేస్తుంటాడు. వాణ్ణి వాట్సాప్‌లో ఏకిపారేసిన సంఘటన గిర్రున కళ్లముందు తిరిగింది. వెంటనే ఆ ఇద్దరికీ ఫోన్‌ చేసి.. ‘ఎందిరా కథ’ అంటూ ఆరాతీశా. అప్పుడు అసలు విషయం అర్థమైంది. ప్రణీత చెవిన వేశారు ఆ ఇద్దరూ! అదీ అసలు విషయం.

వాట్సాప్‌లో ‘సారీ.. ప్రణీతా..’ అన్న మెసేజ్‌ పెట్టాను. రిప్లై లేదు. సాయంత్రం ఆరింటిదాకా మెసేజ్‌లు పెడుతూనే ఉన్నా. వూహూ.. అటునుంచి స్పందన రాలేదు. ఆశ చచ్చిపోయింది. అప్పుడొచ్చిందొక మెసేజ్‌. అందులో ‘ఒక అమ్మాయి తన సొంతం అని భావించినప్పుడే ఇలాంటి అనుమానాలు కలుగుతాయి. మన ప్రేమ నా స్వేచ్ఛను హరించేదై ఉండకూడదు. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. ఫేస్‌బుక్‌లో రకరకాల స్నేహితులు ఉంటారు. లైక్‌లు, కామెంట్లు సహజం. అవన్నీ వాళ్ల వాళ్ల ఆలోచనలు, స్వభావాన్ని బట్టి ఉంటాయంతే! వాటి ఆధారంగా నన్ను అంచనా వేసి.. మీ స్నేహితులను కనుక్కోవడం నాకు నచ్చలేదు.. నీ తప్పును అంగీకరిస్తే.. ఈ రోజు సాయంత్రం ఏడుగంటలకు బీచ్‌కు వచ్చేయ్‌. లేదంటే.. నా కళ్లకు మళ్లీ కనిపించకు..’ అని రాసుంది. నాకు నేనే క్షమాపణ చెప్పుకుని.. బీచ్‌కు బయలుదేరాను. మధ్యలో సెల్‌ఫోన్‌ బీప్‌బీప్‌మని మోగింది. అది వాట్సాప్‌ మెసేజ్‌. టెన్షన్‌తో ఓపెన్‌చేశా. ఎరుపురంగు లవ్‌ సింబల్‌, ఒక పూలబొకె.. పంపింది ఎవరని ఆలోచించలేదు. చిరునవ్వుతో బీచ్‌వైపు బైక్‌లో రయ్‌మని దూసుకెళ్లా!

- ఆర్‌.బి.రవితేజ, విశాఖపట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని