పెళ్లి చూపుల్లోనే ప్రేమ ప్రపోజల్‌

కొత్త ప్రాజెక్టు రూపంలో ఆరు నెలలుగా ఒకటే టెన్షన్స్‌. తీరిక లేకుండా గడిచిపోయాయి. ఇంటికెళ్లి ఓ ఆరు నెలలు దాటిందనుకుంటా.

Published : 28 Oct 2017 01:40 IST

పెళ్లి చూపుల్లోనే ప్రేమ ప్రపోజల్‌

కొత్త ప్రాజెక్టు రూపంలో ఆరు నెలలుగా ఒకటే టెన్షన్స్‌. తీరిక లేకుండా గడిచిపోయాయి. ఇంటికెళ్లి ఓ ఆరు నెలలు దాటిందనుకుంటా. జుట్టు, గడ్డం కూడా బాగా పెరిగాయి. నన్ను చూస్తే ఎవరైనా లవ్‌ ఫెయిల్యూర్‌ అనుకుంటారేమో. ఒక్కమాటలో చెప్పాలంటే అర్జున్‌రెడ్డిలో విజయ్‌లా. కానీ, నాకసలు లవ్‌స్టోరీనే లేదు. నా దృష్టిలో ప్రేమించడానికి చాలా తీరిక సమయం కావాలేమో అనిపిస్తుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే నా కలీగ్స్‌ ప్రేమలు, పెళ్లిళ్లు ఈ మధ్య కాలంలో దగ్గరగా చాలానే చూశా. నాలాగా సోలో ఉంటేనే నయం అని చాలా సార్లు అనేవారు. నేను నవ్వుకునే వాడిని. ఏదిఏమైనా ప్రేమ... పెళ్లి... ఇవి రెండూ నాకు ఏ మాత్రం పరిచయం లేని ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలుగా అనిపిస్తాయి.

ఇంతలో రైల్వే ఎనౌన్స్‌మెంట్‌ నేను ఎక్కాల్సిన ట్రైన్‌ మరో గంట ఆలస్యంగా నడుస్తోందని. ఏం చేయాలో అర్థం కాక ఓ సెల్ఫీ దిగుదాం అనుకుని కూర్చున్న చోటు నుంచే సెల్ఫీ స్టిక్‌ని పైకి ఎత్తి శ్నాప్‌ తీసుకున్నాను. నేను కూర్చున్న వెనకంతా జనారణ్యమే. ఫొటోని జూమ్‌ చేసి చూస్తున్న. నా వెనకే ముఖానికి స్కార్ఫ్‌ కట్టుకున్న అమ్మాయి. కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. పక్కనే ఒక బ్యాగు. చేతిలో పుస్తకం. పేరేంటో చూద్దాం అని ఫొటోని ఇంకా జూమ్‌ చేశా. చేతన్‌ భగత్‌ రాసిందే. ‘వన్‌ నైట్‌ ఎట్‌ కాల్‌ సెంటర్‌’. చిత్రంగా అనిపించింది. అప్పటికి నేను చదువుతున్న నవల కూడా అదే. నా ప్రమేయం లేకుండానే మొదటిసారి ఓ అమ్మాయిని తలతిప్పి చూడడం అదే తొలిసారి అనుకుంటా! కానీ, తను అక్కడ లేదు. పక్కన బ్యాగూ లేదు. చిన్న హ్యూమన్‌ జిరాఫీలా తలని అటు.. ఇటు తిప్పుతూ చూస్తున్నా. ఇంతలో ‘ఎక్స్‌క్యూజ్‌ మి’ అని ఓ వాయిస్‌. చూస్తే తనే. ‘పవర్‌ బ్యాంకు ఉంటే ఇస్తారా? ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ అయింది. ఓ ముఖ్యమైన కాల్‌ మాట్లాడాలి!’ అంది. తీక్షణమైన తన కళ్లే కనిపిస్తున్నాయి. బ్యాక్‌పాక్‌లో నుంచి పవర్‌బ్యాంకు తీసిచ్చాను. నేను కూర్చున్న బెంచికి అటుగా కూర్చుంది.

‘అమ్మా స్టేషన్‌కి వచ్చేశా... తిన్నాను... అబ్బా... ఎందుకంత కంగారు. ఫోన్‌ ఛార్జింగ్‌ అయిపోయిందంతే... ట్రైన్‌ గంట లేట్‌. నేను ట్రైన్‌ ఎక్కాక మెసేజ్‌ పెడతా.’ అంటూ మాట్లాడుతూ నా వైపు చూసి కళ్లతోనే చిన్నగా నవ్వింది. ఫోన్‌ పెట్టేసి ‘మా అమ్మండీ... ఒకటే కంగారు... అమ్మాయివి... కాస్త జాగ్రత్త... అని భయ పడుతోంది. ఎంతైనా అమ్మ కదా! బై ద వే... నేను భవ్య.’ అంటూ బెంచ్‌పై నిబ్బరంగా కూర్చుంది. మిలీనియల్‌ జనరేషన్‌కి ప్రతినిధిలా అనిపించింది. నేను అఖిల్‌... అనేలోపే తన ఫోన్‌ మళ్లీ రింగ్‌ అయింది. ‘నాన్న... అంతా ఒకే. నేను ఎక్కాక మీకు మెసేజ్‌ చేస్తా. ఉదయం స్టేషన్‌కి రండి!’ అంటూ మాటల్లోనూ... కళ్లలోనూ కాస్త రుసరుసలు... పరిచయం ఉన్న వ్యక్తిగా ‘అఖిల్‌... మీరు చెప్పండి. ఈ ప్రేమ, పెళ్లి అనేవి వ్యక్తిగతమైనవి. ఎవరికి వారుగా కమిట్‌ అయితేనే కిక్‌ ఉంటుంది. మంచి సంబంధం... రేపే వస్తున్నారు. నువ్వు బయల్దేరి రావాలి అని నాన్న. కెరీర్‌తో బిజీగా ఉన్నప్పుడు ప్రేమా... పెళ్లీ అంటే ఎలా?’... అంటూ విసుగ్గా ముఖానికి ఉన్న స్కార్ఫ్‌ తీస్తుంటే నా గుండె వేగం అమాంతం పెరిగింది. ఎందుకో నాకు అర్థం కాలేదు.

తన ముఖాన్ని చూశా. కళ్లలోని నిబ్బరమే కాదు... ముక్కుకున్న పుడకతో అచ్చమైన తెలుగుదనం కనిపించింది. అమ్మ పంపిన ఫొటో తనదే. నేను తనని చూడ్డానికి వెళ్తున్నా. కానీ, ఏ మాత్రం నాకు పెళ్లి ఇష్టం లేదు. అంత తీరికా లేదు అనుకుంటూ మొదలైన నా ప్రయాణం సినిమాల్లోనే చూసే చిత్రమైన సన్నివేశంతో మలుపు తిరిగింది. మా వూరికి ఓ పాతిక కిలోమీటర్ల దూరంలో వాళ్లూరు. ఇద్దరం ఎక్కాల్సింది ఒకటే ట్రైన్‌ అని నాకు అర్థం అయింది. ‘మీకీ పెళ్లి చూపులు ఇష్టం లేదనుకుంటా? అబ్బాయిని చూశారా?’ అని మాట కలిపా. ‘అవును. కానీ, నాన్నంటే నాకు గౌరవం. అన్నీ నా కోసం పక్కాగా ప్లాన్‌ చేశారు. పెళ్లి నా వ్యక్తిగతం అనే విషయం ఆయనికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. పెళ్లి చూపుల్లో అబ్బాయితో మాట్లాడైనా చెబుదాం అని వెళ్తున్నా.’ అంటూనే మీ సంగతేంటి? అంది... కాస్త తడబడుతూనే వూరికి సొంతూరి వెళ్తున్నా అంటూ దిక్కులు చూస్తూ చెప్పా. ‘లవ్‌ ఫెయిల్యూరా?’ అంటూ షాక్‌ అయ్యేలా కొంటెగా అడిగింది. ప్రేమ దేశానికి పాస్‌పోర్ట్‌ అప్లై చేద్దాం అనుకుంటుండగానే ఈ ఫెయిల్యూర్‌ ప్రపోజల్‌ ఏంట్రా బాబూ అనుకుంటూ అంత తీరికెక్కడిదీ... లైఫ్‌ స్టైల్‌ ఫెయిల్యూర్‌. ప్రాజెక్టు బిజీలో పర్సనల్‌ పనులు మర్చిపోతుంటా. అయినా, ఎమ్మెన్సీ ప్రేమలు ఎక్కువగా కరెన్సీతోనే ముడిపడి ఉంటాయి. అది నాకు నచ్చదు అని సాగుతున్న సంభాషణ మధ్యలో ట్రైన్‌ వస్తోందని మళ్లీ ఎనౌన్స్‌మెంట్‌. ఇద్దరం ఒకరి కళ్లలోకి ఒకరం... ఇద్దరి నోటి నుంచి ఒకేసారి.. ‘ఆల్‌ ది బెస్ట్‌’ అని. ఇద్దరం ట్రైన్‌ ఎక్కేందుకు వెళ్తున్నాం. వేసే ప్రతి అడుగూ తనతో కలిసి వేస్తున్న ఏడడుగుల్లా అనిపించాయి. చాలా స్ట్రేంజ్‌ ఫీలింగ్‌. మరో రెండు రోజుల్లో తనని చూడ్డానికి వెళ్తున్నా. పెళ్లి చూపుల్లోనే నా లవ్‌ ప్రపోజల్‌. ఎలా రియాక్ట్‌ అవుతుందోనని కాస్త టెన్షన్‌!!

- అఖిల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని