logo

జగన్‌ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం

జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్‌ యాక్ట్‌-2022)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated : 05 May 2024 08:42 IST

హక్కులన్నీ ‘భూ’స్థాపితం
భూములు, ఆస్తులు సర్కారుకే తర్పణం


జిల్లాలో మొత్తం మండలాలు: 38
రెవెన్యూ గ్రామాలు: 822
వ్యవసాయ భూముల విస్తీర్ణం:4.50లక్షల ఎకరాలు
మొత్తం రైతులు: 4.78 లక్షలు
అందులో చిన్న రైతులు: 1.29 లక్షలు


ఒంగోలు గ్రామీణం, ఒంగోలు నగరం- న్యూస్‌టుడే: జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్‌ యాక్ట్‌-2022)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చట్టం అమలులోకి వస్తే యజమాని తన ఆస్తిపై భద్రత కోల్పోతాడు. గ్రామాలు, పట్టణాల్లోని పొలాలు, స్థలాల రిజిస్ట్రేషన్‌ అసలు పత్రాలన్నీ ప్రభుత్వం నియమించే టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి ఆధీనంలో ఉండిపోతాయి. యజమాని బ్యాంకుల్లో రుణాలు పొందాలన్నా, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవాలన్నా సంబంధిత అధికారి చుట్టూ తిరగాల్సిందే. ఈ వికృత చట్టాన్ని జగన్‌ సర్కారు తేవడంపై అన్ని వర్గాల్లోనూ ఆగ్రహం కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని న్యాయవాదులు దాదాపు నెలకు పైగా కోర్టులను బహిష్కరించి నిరసన తెలిపారు. ప్రజల ఆస్తి హక్కులు ప్రభుత్వ అధికారి చేతుల్లో పెట్టే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా జగన్‌ మాత్రం గొప్ప సంస్కరణ అంటూ మాయమాటలు చెబుతూ జనం ఆస్తులను ఏకంగా తన ఆధీనంలోకి తీసుకుని వారిని బికారులుగా మార్చి పెత్తనం చేసే బృహత్తర కుట్రకు తెర లేపారు. 2023 అక్టోబర్‌ నెలాఖరు నుంచి ఈ చట్టాన్ని హడావుడిగా అమల్లోకి తెస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో ఆస్తుల భద్రతకు ముప్పంటూ ఆందోళన చేస్తున్న న్యాయవాదులు(పాత చిత్రం)

ఇప్పటికే వివాదాలు  బోలెడు...

జిల్లాలో ఇప్పటికే భూ వివాదాలు ఎక్కువ. ప్రతి గ్రామంలోనూ ఒక రైతుకు చెందిన భూ విస్తీర్ణం, మరో రైతు పేరు మీద వెబ్‌ల్యాండ్‌లో నమోదై ఉన్నాయి. కొన్ని చోట్ల పక్క రైతు పొలాన్ని ఆక్రమించుకుని ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నారు. బాధిత రైతు సర్వే నిమిత్తం అర్జీ పెట్టుకున్నా అధికారులు కదలరు. సర్వే చేసినా ఆన్‌లైన్‌లో సరిచేయరు. వీఆర్వో నుంచి తహసీల్దార్‌ వరకు ఒకరి మీద మరొకరు చెప్పుకొంటూ కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలోనూ 80 శాతం రెవెన్యూ సమస్యలపై అర్జీలు వస్తున్నాయంటే క్షేత్రస్థాయిలో భూ వివాదాలకు దర్పణం పడుతోంది. అయినా భూ సమస్యలు పరిష్కారం కావడం లేదు.

దేవాదాయ భూములకూ దిక్కుండదు...

జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో సుమారు 30 వేల ఎకరాల భూములున్నాయి. అందులో అయిదు వేల ఎకరాలు ఆక్రమణ చెరలో ఉన్నాయి. మరి కొందరు ఆక్రమణదారులు తమకే హక్కులున్నాయంటూ కోర్టులను ఆశ్రయించారు. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా భూములూ వైకాపా తెచ్చిన చట్టంతో ప్రమాదంలో పడనున్నాయి. సదరు దేవాదాయ శాఖ అధికారులను ఎవరైనా దారికి తెచ్చుకుని ప్రభుత్వ, దేవాదాయ భూములకు యజమానిగా టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు చేర్పించకున్నా పట్టించుకునేవారుండరు. దస్త్రాలు సైతం అధికారుల ఆధీనంలో ఉంటే వివరాలు బయటకు కూడా తెలియకపోవచ్చు. కాలక్రమేణా యాజమాన్య హక్కులు వారికే దక్కే అవకాశం ఉంటుంది. తీర ప్రాంతంతో పాటు, పశ్చిమ ప్రకాశంలో సుమారు 50 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములను పేదలకు సాగు నిమిత్తం పట్టాలు పంపిణీ చేశారు. ఇవన్నీ అధికారం, ధనబలం, కండబలం ఉన్న వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయి.


అధికారిక భూకబ్జాతో  సమానం...

లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలైతే ఆస్తిదారులకు భవిష్యత్తులో చిక్కు సమస్యలు తలెత్తుతాయి. ఒక విధంగా ఇది అధికారికంగా భూ కబ్జా చేయడం వంటిది. మన స్థలాలు, పొలాలను ప్రభుత్వం ఎవరికి తాకట్టు పెట్టినా ప్రశ్నించే హక్కు మనకుండదు. ఆస్తి రిజిస్ట్రేషన్‌ పత్రం యజమాని వద్దనే ఉండాలి. ప్రభుత్వం నియమించే అధికారుల వద్ద ఉంచాలనే నిబంధన చట్ట విరుద్ధం. ఆస్తి వివాదాల పరిష్కారానికి రాజ్యాంగపరంగా ఏర్పాటు చేసిన న్యాయస్థానాలున్నాయి. అక్కడ అందరికీ సమాన న్యాయం లభిస్తుంది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ఆశించలేం. 

సుంకర సాయిబాబు


వివరాలు  నమోదు చేయకున్నా జైలు...

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం వల్ల ఇప్పటివరకు అమలులో ఉన్న భూమి రికార్డులన్నీ నిర్వీర్యమైపోతాయి. భూమి కలిగిన వారంతా స్వచ్ఛందంగా సదరు అధికారి వద్దకు వెళ్లి ఆస్తి వివరాలు నమోదు చేయించుకోవాలి. దీనివల్ల రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకమవుతుంది. ఆస్తి సమాచారం ఇతరుల చేతికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఆస్తి వివరాలు నమోదు చేయించుకోకపోయినా, ఇచ్చిన సమాచారం సరైంది కాదని అధికారులు భావించినా ఆరు నెలలు జైలు, రూ.50 వేలు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ చట్ట అమలైతే భవిష్యత్తులో సవాలక్ష సమస్యలొస్తాయి.

నల్లూరి సత్యశ్రీనివాసరావు


అధికారులకు అప్పగింత  సరికాదు..

ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పన్ను వసూళ్లు, రెవెన్యూ దస్త్రాల పనులు చూసే రెవెన్యూ శాఖకు ప్రజల స్థిరాస్తుల హక్కులు ఇవ్వడం సరికాదు. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం. రాజకీయ నాయకుల సిఫార్సులకు తలొగ్గే అధికారుల వద్ద న్యాయం ఎలా జరుగుతుంది. నీతి అయోగ్‌ చెప్పిందొకటి, రాష్ట్రం అనుసరిస్తుంది మరొకటి. భూవివాదాలు సత్వర పరిష్కారానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తే జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఏకంగా ప్రజల ఆస్తులను తమ ఆధీనంలో ఉంచుకోడానికి ఏర్పాట్లు చేస్తోంది.

మొలకలపల్లి అజయ్‌బాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని