టీచర్‌గానే మిగిలిపోయింది

క్లాస్‌ అంతా ఒకటే సందడి. గోల గోలగా ఉంది. నేను ఫోన్‌లో వాట్సాప్‌ గ్రూపు గుసగుసలు చూస్తున్నా. ఇంతలో క్లాస్‌ అంతా ఏదో మంత్రం వేసినట్టుగా నిశ్శబ్దం అయిపోయింది. ఫోన్‌ ధ్యాసలో ఉన్న నాకు ఓ క్షణం పాటు ఏం అర్థం కాలేదు. ఇంతలోపే క్లాస్‌లో అందరూ లేని నించుని ‘గుడ్‌ మార్నింగ్‌ టీచర్‌’ అంటుండగానే....

Published : 02 Dec 2017 02:01 IST

మనసులో మాట!
టీచర్‌గానే మిగిలిపోయింది

క్లాస్‌ అంతా ఒకటే సందడి. గోల గోలగా ఉంది. నేను ఫోన్‌లో వాట్సాప్‌ గ్రూపు గుసగుసలు చూస్తున్నా. ఇంతలో క్లాస్‌ అంతా ఏదో మంత్రం వేసినట్టుగా నిశ్శబ్దం అయిపోయింది. ఫోన్‌ ధ్యాసలో ఉన్న నాకు ఓ క్షణం పాటు ఏం అర్థం కాలేదు. ఇంతలోపే క్లాస్‌లో అందరూ లేని నించుని ‘గుడ్‌ మార్నింగ్‌ టీచర్‌’ అంటుండగానే నేనూ లేచి చూశాను. ఏం మాయ చేశావే సినిమాలో సమంతలా చీరలో ఓ ‘కుందనపు బొమ్మ’ కనిపించింది. ఓ గంట పాటు అనుకుంటా... ఏదో మైకం కమ్మేసినట్లయింది. మనుపెప్పుడూ నాకిలా అనిపించలేదు... అందం హుందాగా ఉంటుందని. 45 నిమిషాల పిరియడ్‌ నాలుగే నిమిషాల్లా అనిపించింది.

ఓ టీచర్‌ గురించి ఇలా చెబుతున్నాడేంటి? నేను అసలు స్టూడెంటేనా? అనే సందేహం వస్తుంది కదూ! నిజంగా నేను విద్యార్థినే. డిగ్రీ ద్వితీయ సంవత్సరం. కానీ, నేను మాట్లాడింది మాత్రం టీచర్‌ గురించే. కానీ, తను ఒక్కరోజు టీచర్‌. ఎందుకంటే... ఆ రోజు టీచర్స్‌ డే. మాకు క్లాస్‌ తీసుకోవడానికి మా పక్క సెక్షన్‌ నుంచి వచ్చిన అమ్మాయి తను. రోజూ అదే క్యాంపస్‌లో తిరుగుతున్నా. తను నాకు అలా ఎప్పుడూ కనిపించలేదు. కట్టుకున్న చీర మహత్యమో... ఆ కటౌట్‌ అందమోగానీ... నేనైతే ఫిదా అయిపోయా. ఆ రోజు నుంచి తననే ఫాలో అయ్యేవాడిని. తనకి తెలియకుండా. తను జీన్స్‌లో ఉన్నా... చుడిదార్‌ వేసుకున్నా... చీరలో పాఠం చెప్పిన టీచర్‌లానే అనిపించేది. అందుకేనేమో... స్టూడెంట్‌లా టెన్షన్‌ పడేవాడిని. కానీ, నా దోబూచులాటలు ఎన్నో రోజులు సాగలేదు. నా డిగ్రీ సిలబస్‌నే తనకు దగ్గరయ్యేలా చేసింది. ఏడాది చివర్లో సిలబస్‌ పూర్తి కావడం లేదని మా రెండు సెక్షన్లను కలిపేశారు. తను నా పక్క బెంచీనే. చూడనట్టుగా చూశా. నా ప్రేమకథ చిత్రంగా అనిపించింది. నన్ను గమనించినట్టుగానే అనిపించలేదు. తన ధ్యాసంతా చదువుపైనే!

ఓ రోజు సార్‌ క్లాస్‌ చెబుతున్నారు. అనుకోకుండా తన టేబుల్‌ మీద బ్యాగు కిందపడి పుస్తకాలన్నీ చెల్లాచెదురైయ్యాయి. నేను పక్క బెంచీ కావడంతో కొన్ని పుస్తకాలు తీసి తనకి అందించా. అప్పుడే తను నన్ను చూడడం. ఓ చిన్న చిరునవ్వు. దాంట్లోనే నేను అన్నీ వెతికేసుకున్నా. తర్వాత రోజు నుంచి హాయ్‌... బాయ్‌లు... మొదలయ్యాయి. రోటీన్‌గా నేనూ... స్నేహంతోనే తనతో నా ప్రేమ ప్రయాణాన్ని ప్రారంభించా. ఫైనల్‌ ఇయర్‌కి వచ్చేశాం. తన మాటల్లో ఏదో సాధించాలనే తపన కనిపించేది. తనదో ఫిలాసఫీ. ఓ ఫ్రెండ్‌గా తనకి వందకి వంద మార్కులేయవచ్చు. ఏదైనా విషయాన్ని విశ్లేషించడంలో తనో దిట్ట. తన స్నేహాన్ని దాటుకుని ప్రేమకుడిగా పరిచయం కాస్త క్లిష్టమైనదే అనిపించింది. డిగ్రీ చివరి అంకానికొచ్చేశాం. తనకి ఎలాగైనా నా ప్రేమ విషయం చెప్పాలనుకున్నా. కాలేజీ ఫేర్వెల్‌ పార్టీలోనూ తనో స్పీచ్‌ కూడా ఇచ్చింది. వింటూ తన ఉన్నతమైన వ్యక్తిత్వానికి సలామ్‌ చేశా. ఆ రోజు టీచర్‌గా ఎందుకు అవతారమెత్తిందో అప్పుడు నాకు అర్థమైంది. యువతకి ఓ లక్ష్యంగా ఉండాలని కొత్తగా తను చెప్పిన విధానం నన్ను ఇంకా ఆకట్టుకుంది. చివరి నిమిషంలో నా అభిప్రాయాన్ని తన ముందుంచా. ఐ లవ్‌ యూ అని చెప్పలేదుగానీ.. ప్రేమిస్తున్నా అని మాత్రం చెప్పేశా. ప్రేమపై తనకి ఎలాంటి అభిప్రాయం లేదని, అలాంటి ఫీలింగ్స్‌ ఏమైనా ఉంటే తనతో ఫ్రెండ్‌షిప్‌ చేయవద్దంది. నేను ఉన్న స్థితిలో ప్రేమ కంటే లక్ష్యం నాకు ఉన్నతంగా కనిపిస్తోంది. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చూస్తుండిపోయా... తను చెప్పిందీ నిజమే అనిపించింది. నేనూ కెరీర్‌పై ధ్యాస పెట్టా ప్రస్తుతానికి... ఎప్పటికైనా తన కోసం ఎదురుచూస్తూనే ఉంటా!

- అంజి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని