ఎవరేమనుకుంటే మనకేం

శ్రావ్య, నేను చాలా మంచి ఫ్రెండ్స్‌. ఇద్దరివీ పక్కపక్క ఇళ్లే. వాళ్ల అమ్మ, మా అమ్మ ఇద్దరూ ఒకే ఆఫీసులో ఉద్యోగులు. నాకు, తనకూ నాన్న లేరు.,...

Published : 21 Jul 2018 01:43 IST

ఎవరేమనుకుంటే మనకేం

శ్రావ్య, నేను చాలా మంచి ఫ్రెండ్స్‌. ఇద్దరివీ పక్కపక్క ఇళ్లే. వాళ్ల అమ్మ, మా అమ్మ ఇద్దరూ ఒకే ఆఫీసులో ఉద్యోగులు. నాకు, తనకూ నాన్న లేరు. నా సైకిల్‌తోనే తను సైకిల్‌ నేర్చుకుంది. ఒకసారి తను సైకిల్‌పై నుంచి కిందపడబోతే నేను పడిపోయి... తనని ఆపాను. నా మోకాళ్లకు రక్తం వస్తుంటే ఎంతగా విలవిలలాడిందో నాకు ఇప్పటికీ కళ్లలో మెదులుతూ ఉంటుంది. ఇద్దరం ఒకే కాలేజీ చేరాం. ఉద్యోగ పనిమీద మా అమ్మలిద్దరూ మూడురోజులు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. మేమిద్దరం ఒకే ఇంట్లో ఉండి, కాలేజీకి వెళ్లే వాళ్లం. తను నాకు వంట చేసి పెట్టేది. ఏమైందో ఏమో నాలో ఏదో మార్పు కన్పించింది. తను ఇలా నాకు జీవితాంతం తోడుంటే బాగుంటుందనిపించింది. మేం అప్పుడు డిగ్రీ సెకండియర్‌ చదువుతున్నాం. నా మనసులో మాట తనతో చెబుదామా? వద్దా? అనుకుంటూనే కాలం గడిచిపోతోంది. డిగ్రీ ఫైనలియర్‌ పరీక్షలు జరుగుతున్నప్పుడే వాళ్ల అమ్మ తనకు పెళ్లిచూపులు ఏర్పాటుచేసింది. ఆ అబ్బాయి... శ్రావ్య మామయ్య కొడుకు, ప్రభుత్వ ఉద్యోగం. నేను ఆ పెళ్లి చూపుల్లో పిచ్చి చూపులు చూసుకుంటూ ఉండిపోయా! శ్రావ్య ఏం మాట్లాడలేదు. మరుసటి రోజు నాతో చెప్పింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, చదువుకోవాలని ఉందని.  నేను ఈ విషయం వాళ్లమ్మతో చెప్పాను. ఆంటీ వినలేదు. తను కన్నీళ్లతో రోజులను కొలిచేది. జూన్‌ 4న తన పెళ్లైంది. తన మెడలో మూడు ముళ్లు పడుతుంటే... నా గుండెను ముళ్లకంపలో వేసినట్లైంది. తర్వాత  భర్తతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అప్పుడప్పుడూ అమ్మకు కాల్‌ చేసేది. నేను మాట్లాడేవాడిని కాదు. తన భర్త పెద్ద శాడిస్ట్‌ అని 6 నెలలకే తెలిసిపోయింది. తనని నానా రకాలుగా టార్చర్‌ పెట్టేవాడు. తాగొచ్చి కొట్టేవాడు. ఈ కష్టాల్లోనే తను ఒక బిడ్డకు జన్మనిచ్చింది. భర్త ఉద్యోగం పోగొట్టుకున్నాడు. వేధించడం ఇంకా ఎక్కువ చేశాడు. ఒకరోజు తన బాస్‌ దగ్గరికి వెళ్లమని గొడవచేశాడంట... ఆ రోజుతో ఇక తను బతకడం వృథా అనుకొని ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకుంది. రాత్రి సరిగ్గా ఒంటి గంటకు ఫోనొచ్చింది.. తన వాయిస్సే. ఏడుస్తోంది. అయిదు నిమిషాల తర్వాత ‘ఐ లవ్యూ రాజ్‌... నేను నిన్ను ప్రేమించాను. నీకు అప్పుడు చెప్పలేకపోయాను. నీతో ఉంటే ఎంతో బాగుంటుంది. మా అమ్మ ఎలాగు ఒప్పుకోదు... పైగా నిన్ను ఏమంటుందో? ఏం చేస్తుందో?నని చెప్పలేకపోయాను. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే... ఈ రోజు నాకు చివరి రోజు... నేను చనిపోవాలనుకుంటున్నా.. చివరి సారి నీతో మాట్లాడాలని ఫోన్‌ చేశా’ అని ఏడుస్తోంది. ‘ఐ లవ్యూ రాజ్‌’ అనే మాట దగ్గర ఆగిపోయిన నా మెదడు... చనిపోవాలనుకుంటున్నా... అని అంటున్నప్పుడు ఈ లోకంలోకి వచ్చింది. ‘శ్రావ్య... ఆవేశ పడొద్దు. నీ బిడ్డ ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు’ అంటూ కారులో హైదరాబాద్‌ బయలుదేరాను. తనతో మాట్లాడుతూనే రాత్రంతా డ్రైవ్‌ చేసుకుంటూ... నేను, అమ్మ వాళ్లింటికి వచ్చాం. అప్పటికే తను రసాయనం తాగేసి పడిపోయి ఉంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. గండం గడిచింది. వాళ్ల అమ్మ, బంధువులు వచ్చారు. జరిగిన విషయమంతా శ్రావ్య చెప్పింది. ఇక అక్కడ వద్దని నెల్లూరుకు తీసుకెళ్లాం. తను మానసికంగా కోలుకోవడానికి చాలా చేశాను. కొంత కుదుటపడింది. 2017 డిసెంబరులో విడాకులు మంజూరయ్యాయి. అప్పుడు మనం పెళ్లి చేసుకుందామని తనకు ప్రపోజ్‌ చేశాను. తను ఒప్పుకోలేదు. ‘నాకు బిడ్డ ఉంది. నాలాంటి దాన్ని నువ్వు చేసుకొని అందరితో మాటలు పడాల్సి వస్తుంది. అది నేను భరించలేను’ అంటోంది.
శ్రావ్య... కన్నీళ్లతో నిన్ను చూడలేను. నీ జీవితంలో చినుకులై కురవాలనుంది. ప్రేమగా మొలకెత్తాలని ఉంది. దయచేసి ఒప్పుకో.. ఎవరో ఏదో అంటారని, మన జీవితం ఎందుకు పాడు చేసుకోవాలి.

- నీ రాజేశ్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని