Bengaluru vs Gujarat: దంచికొట్టిన డుప్లెసిస్‌, కోహ్లీ.. గుజరాత్‌పై బెంగళూరు విజయం

ఐపీఎల్‌-2024లో బెంగళూరు జట్టుకు హ్యాట్రిక్‌ విన్‌. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 04 May 2024 23:51 IST

బెంగళూరు: ఐపీఎల్‌-2024లో బెంగళూరు హ్యాట్రిక్‌ విజయం సాధించింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. 148 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు.. 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది బెంగళూరు. కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ (42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. గుజరాత్‌ బౌలర్లలో జోష్‌ లిటిల్‌ 4, నూర్‌ అహ్మద్‌ 2 వికెట్లు తీశారు. 

డుప్లెసిస్ విధ్వంసం.. వరుస వికెట్లతో ఉత్కంఠ 

లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు అదిరే ఆరంభం లభించింది. మోహిత్ శర్మ వేసిన తొలి ఓవర్‌లో రెండు, చివరి బంతులను విరాట్ కోహ్లీ స్టాండ్స్‌లోకి పంపాడు. తర్వాత డుప్లెసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లిటిల్ వేసిన రెండో ఓవర్‌లో వరుసగా 4, 4, 6, 2, 0, 4 బాదేసి 20 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో వరుసగా 4,6 కొట్టాడు. ఈ క్రమంలోనే 18 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  లిటిల్ వేసిన ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన డుప్లెసిస్.. అదే ఓవర్లో ఐదో బంతికి షారుక్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.డుప్లెసిస్ ఔటైన తర్వాత మ్యాచ్‌ మలుపులు తిరిగింది. బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ నెలకొంది. విల్ జాక్స్‌ (1), రజత్ పటిదార్ (2), కామెరూన్ గ్రీన్ (1), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (4) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాసేపటికే కోహ్లీ కూడా వెనుదిరిగాడు. ఈ దశలో దినేశ్‌ కార్తిక్‌ (21; 12 బంతుల్లో 3 ఫోర్లు), స్వప్నిల్‌ సింగ్‌ (15; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. 

ఆదుకున్న షారుక్, మిల్లర్‌.. 

గుజరాత్ జట్టులో టాప్‌ ఆర్డర్ బ్యాటర్లు వృద్ధిమాన్ సాహా (1), శుభ్‌మన్ గిల్ (2), సాయి సుదర్శన్ (6) సింగిల్‌ డిజిట్‌ స్కోరుకు పరిమితమయ్యారు. 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్‌ను షారుక్ ఖాన్ (37; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (30; 20 బంతుల్లో 3 ఫోర్లు. 2 సిక్స్‌లు), రాహుల్ తెవాటియా (35; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకున్నారు. రాహుల్ తెవాటియా (35; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమై స్కోరు చేసింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, యశ్‌ దయాల్, విజయ్‌ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టారు.కర్ణ్‌ శర్మ, కామెరూన్ గ్రీన్‌లకు తలో వికెట్ దక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని