ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!

కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!

Published : 05 May 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుమారు 42 ఎకరాల్లో ఉన్న విల్లాను ఉచితంగా ఇస్తారట. కావాలనుకున్నవారు తీసుకోవచ్చట. స్వయానా ఓ దేశ ప్రభుత్వం ప్రజలకు ఈ ఆఫర్ ఇచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే..? జర్మన్‌ నియంత హిట్లర్ పేరు వింటేనే ఒకప్పుడు ప్రపంచం వణికిపోయింది. ఆయన అత్యంత సన్నిహితుల్లో జోసెఫ్ గోబెల్స్‌ ఒకరు. ఆయన నాజీ పార్టీకి ప్రధాన ప్రచారకుడు. వార్తా పత్రికలు, రేడియో, సినిమా మాధ్యమాలను ఉపయోగించుకొని నాజీ భావజాలానికి బలమైన ప్రచారం కల్పించారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌కు 25 మైళ్ల దూరంలో ఉన్న ఆ విల్లా ఈయనదే. 1936లో దానిని నిర్మించారు. గోబెల్స్ దీనిని అనేక అవసరాలకు వినియోగించారని, అక్కడ పలువురు నటీమణులతో సంబంధాలు నడిపారని పలు కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ భవంతి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటం, నాజీ పాలనతో ముడిపడిన చరిత్ర వంటి కారణాలతో దానిని వదిలించుకోవాలని చూస్తోంది. దీనిపై ఆర్థిక మంత్రి స్టెఫాన్‌ ఎవర్స్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే.. ప్రభుత్వం దానిని బహుమతిగా అందజేస్తుంది’’ అని వెల్లడించారు.

2000 సంవత్సరం నుంచి ఈ విల్లాలో ఎవరూ నివసించడం లేదు. ప్రస్తుతం అది రోజురోజుకూ దెబ్బతింటోంది. దానిని సొంతం చేసుకునేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి తగిన ప్రతిపాదన లేకపోతే.. ప్రభుత్వం దానిని కూల్చివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. రెండో ప్రపంచయుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో గోబెల్స్‌ తన భార్య, ఆరుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని