Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 May 2024 21:10 IST

1. ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైకాపా నేతలు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌పై దాడికి పాల్పడ్డారు. కూటమి కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనపై పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన చొక్కా చిరిగిపోయింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు

జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir)లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఇక్కడి పూంచ్‌ జిల్లాలోని శశిధర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంతోపాటు మరో దానిపైనా దాడికి దిగారు. ఈ ఘటనలో అయిదుగురు జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. కిడ్నాప్‌ కేసు.. సిట్‌ అదుపులో హెచ్‌డీ రేవణ్ణ

ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ అపహరణ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను (HD revanna) ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. పద్మనాభ నగర్‌లోని మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ నివాసంలో రేవణ్ణను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. రాయ్‌బరేలీలో రాహుల్ భారీ తేడాతో ఓడిపోతారు: అమిత్ షా

వయనాడ్, రాయ్‌బరేలీ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీలో భారీ తేడాతో ఓడిపోతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. గుజరాత్‌లోని ఛోటాడేపూర్ జిల్లాలోని బోడెలి పట్టణంలో పార్టీ నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన రాహుల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ఉత్తరాదిన ఆ మూడు నియోజకవర్గాలు ప్రత్యేకం.. ప్రధాన పార్టీలను ఎన్నుకోని ప్రజలు..!

లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ తమదైనశైలిలో ప్రచారం చేస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నాయి. అయితే.. ఉత్తరాదిలో ఓ మూడు స్థానాలు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌లు దాదాపు గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేకపోవడం గమనార్హం.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన

ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫా(Rafah)పై ఇజ్రాయెల్‌ (Israel) దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనియన్‌ పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. గాజాలోని ఈ నగరంపై సైనిక దాడి రక్తపాతానికి దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్‌ అధనామ్‌ హెచ్చరించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఓడినా బలపడ్డాం.. ఐదు కోట్ల మందికి ధైర్యం నూరిపోశాం: పవన్‌ కల్యాణ్‌

ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అన్నారు. ఐదు కోట్ల మందికి జనసేన ధైర్యం నూరిపోసిందని చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరమని, దీని కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. జగన్‌కు ప్యాలెస్‌లు.. పేదలకు పూరిళ్లా?: చంద్రబాబు

 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. జగన్‌కు అభివృద్ధి తెలియదని, విధ్వంసమే తెలుసని విమర్శించారు. దోపిడీకి ఆయన సామ్రాట్‌ అని ఎద్దేవా చేశారు. భూగర్భ వనరులు దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ జిల్లా నూజివీడులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. సందేశ్‌ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసిన సందేశ్‌ఖాలీ వ్యవహారం (Sandeshkhali incidents)లో కొత్త కోణాన్ని అధికార టీఎంసీ తెరపైకి తీసుకొచ్చింది. ఇదంతా లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ముందు పశ్చిమ బెంగాల్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు భాజపా (BJP) పన్నిన కుట్రేనని ఆరోపిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. జై షాకు బ్యాట్‌ పట్టుకోవడం తెలుసా..?: ఆప్‌ విమర్శలు

 క్రికెట్‌ ఎలా ఆడాలో తెలియకుండానే భాజపా అగ్రనేత అమిత్‌ షా కుమారుడు జై షా .. బీసీసీఐలో ఉన్నతస్థానంలో ఉన్నారంటూ ఆమ్‌ఆద్మీపార్టీ (AAP) నేత సంజయ్‌ సింగ్(Sanjay Singh) విమర్శించారు. వారసత్వ రాజకీయాల గురించి కాషాయ పార్టీ చేస్తున్న విమర్శలను ఉద్దేశించి ఈవిధంగా స్పందించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని