ట్విట్లు... కురిపిస్తున్నాయ్ కోట్లు!
ట్విట్లు... కురిపిస్తున్నాయ్ కోట్లు!
సోనాక్షిసిన్హా ఇన్‌స్టాగ్రామ్ ఫొటో చూసి చిత్తైపోతాం... వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్‌కి కడుపుబ్బా నవ్వుకుంటాం... తారల ఆన్‌లైన్ పోస్ట్‌ల్ని మళ్లీ మళ్లీ చదువుతాం... అభిమానం చాటుకోవాలనే తపన మనదైతే... ఆ ట్వీట్లు... పోస్ట్‌లతోనే కోట్లు కొల్లగొట్టేస్తున్నారు సెలెబ్రెటీలు... తెరవేల్పులు, తారాగ్రేసరులకే కాదు... ట్వీట్లతో కనికట్టు చేసేవారికీ... సామాన్యులకూ ఉంది ఈ ఛాన్స్... జోరందుకుంటున్న ఆ ట్రెండ్‌పై ఓ కన్నేద్దాం.
‘ఈ ఆర్నెళ్లలో ట్వీట్ల ద్వారా రూ.30 లక్షలకు పైగా సంపాదించా’ అన్నాడు సెహ్వాగ్.
దేశం ముక్కున వేలేసుకుంది. ఉబుసుపోక ట్వీట్ చేస్తే లక్షలా? ఇంతకీ వీరేంద్రుడు చెప్పింది కొసరే. అసలు కథ వింటే వామ్మో అనాల్సిందే. తమ పాపులారిటీని ట్విట్టర్ ట్వీట్లు, ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు, ఫేస్‌బుక్ చిత్రాలుగా మలచి పెద్దమొత్తం పోగేసుకుంటున్న సెలబ్రిటీల జాబితా రోజురోజుకీ పెరిగిపోతోంది.
పక్కా వ్యూహం
సినిమా తారలు, క్రికెటర్లు, సెలెబ్రెటీలను వాణిజ్య ప్రకటనల్లో నటింపజేయడం పాతపద్ధతైపోయింది. ఇప్పుడు వాళ్లు జస్ట్... ట్విట్టర్ ట్వీట్లు, ఫేస్‌బుక్ పోస్టులతోనే అటు కంపెనీలకు కూడా ప్రచారం సాగించవచ్చు. చేయాల్సిందల్లా ఆ ట్వీట్లతో కలిపి పెట్టే ఫొటోల్లో కంపెనీల ఉత్పత్తుల్ని ఎలాగోలా ప్రదర్శిస్తే సరి. ఆ ట్వీట్‌కి, ఫొటోకి కొంత మొత్తం నజరానా అందుతుంది. ఎందుకంటే... ప్రస్తుతం రెండు వందల కోట్ల ఫేస్‌బుక్ ఖాతాలు, ముప్ఫైకోట్ల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారులు, రెండువందల కోట్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లు ఉన్న అతిపెద్ద ఆన్‌లైన్ విపణి అందుబాటులో ఉంది. వీరిలో అత్యధికులు కార్పొరేట్ కంపెనీల మహరాజ పోషకులే. వీళ్లకి దగ్గరవడానికి ఎంత పెద్దమొత్తమైనా వెచ్చించడానికి కంపెనీలు రెడీ.
షరతులు వర్తిస్తాయ్
తెరపై ఉన్న పేరు... మైదానంలో చేసిన పరుగులు... సమాజంలో ఉన్న పలుకుబడి ఆధారంగా ఈ పారితోషికాలు అందవు. చేసే పోస్టులో పంచ్‌పవర్ చూపేవాళ్లు... ట్వీటుతో అభిమానుల గుండెల్ని మీటేవాళ్లు... ఫొటో పెట్టి కుర్రహృదయాలను ఆకట్టుకునే వారినే కంపెనీలు ఏరికోరి ఎంచుకుంటాయ్. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో... ఎక్కువమంది అభిమానులు, అనుసరించేవాళ్లు ఉంటే ప్లస్‌పాయింట్. అయితే ఆ ట్వీట్లన్నీ అభిమానులతో సొంత విషయం పంచుకున్నట్టే ఉండాలి. అందులోనే కంపెనీ ప్రచారం చేసేయాలి. ఉదాహరణకు కళ్లు మూసుకొని మైమరిచిపోతూ ఏ చాక్లెట్ తింటూనో... ఐస్‌క్రీమ్‌ని ఆబగా ఆరగిస్తున్నట్టో పోజు కొట్టాలి... అయితే ఆ చాక్లెట్ రేపర్, ఆ ఐస్‌క్రీమ్ బ్రాండ్ కనిపించేలా ఫొటో ఉంటే సరి. ఆపై కంపెనీల వీడియో, వెబ్‌సైట్ లింక్, ఫొటోని షేర్ చేసినా, రిట్వీట్ చేసినా దానికి తగ్గట్టు కాసులొచ్చి ఒళ్లొ రాలతాయి.
చెప్పలేనంత ప్రభావం
హాలీవుడ్ అందగాడు ఆస్టన్ కచర్ కొత్తఏడాది సంబరాలు చేసుకోవడానికి అనువైన ప్రదేశాలివే అని చెబుతున్న ఓ వెబ్‌సైట్ లింక్‌ని షేర్ చేశాడు. గంటలోనే రెండున్నర లక్షలమంది ఆ వెబ్‌సైట్‌ని వీక్షించారు. అమ్మాయిల గుండెల్లో నిద్రించే పాటగాడు జస్టిన్ బీబర్ గత మదర్స్ డే నాడు మనల్ని కనిపెంచిన మాతృమూర్తులకు పూలబొకేలు పంపిద్దాం అని ఒక్క ట్వీటు ట్వీటాడు. దెబ్బతో అమెరికాలో పూలకు కరువొచ్చింది. నేను వాడుతున్న ఇయోస్ లిప్‌బామ్ ఆకృతి చూస్తుంటే గర్భం దాల్చిన అమ్మాయే గుర్తొస్తుంది అని ఆశ్చర్యపోయింది కిమ్ కార్దాషియాన్. వాటి అమ్మకాలు అమాంతం పెరిగాయి. అదీ వ్యాపార రహస్యం. ‘కంపెనీ ప్రచారం కోసం తారల్ని రప్పించి యాడ్స్ షూట్ చేసి పెద్ద మొత్తం ముట్టచెప్పినా...అది కొందర్ని మాత్రమే చేరేది. ఇప్పుడలా కాదు... ఒకే ట్వీట్, ఫొటోతో మిలియన్లకొద్దీ వినియోగదార్లను చేరగలుగుతున్నాం’ అంటాడు ఎక్సీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈవో ఉదయ్‌సింగ్.
కొసరే ముద్దు
ఈ ట్రెండ్ ఎంతలా ముదిరిందంటే కొందరైతే అద్భుతంగా ట్వీటడానికి రాతగాళ్ల సాయం తీసుకుంటున్నారు. ఫొటో బాగా రావాలని స్టైలిస్ట్‌లు, హెయిర్‌మేకప్ ఆర్టిస్టులు, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల సాయం తీసుకుంటున్నారు. అవసరమైతే ఫొటో మార్ఫింగ్‌లు, ఫొటోషాప్‌లకీ సిద్ధపడిపోతున్నారు. తెర వెనక ఇంత యంత్రాగం నడుస్తోంది గనకే ‘వహ్.. జడ్డూ భాయ్ హమారే పాస్ తో 2000 కే చుట్టే నహీ హై ఔర్ ఆప్ పేటీఎమ్ మే ఏక్ లాఖ్ లే గయే. థోడా హమారే పేటీఎమ్ మే భీ ట్రాన్స్‌ఫర్ కీజియే’ అనే ప్రచార ట్వీట్లు పేలిపోతున్నాయ్.
ఆచితూచి అడుగు
భారత్‌లో ఈ ధోరణి ఇప్పుడే వూపందుకుంటోంది. క్రికెట్ మైదానాన్ని వీడాక హస్య చతురత పంచే ట్వీట్లతో చెలరేగిపోతున్న వీరూ ఇందుకో తాజా సాక్ష్యం. ఇలా సోనాక్షి సిన్హా పదికిపైగా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. నేహా ధూపియా చోళ ఫ్యాషన్‌బ్రాండ్, వీబా ఫుడ్స్, వోగ్ మేగజైన్‌లపై ప్రేమ చూపిస్తోంది. మన సైనానెహ్వాల్ ఆల్ఫాన్సో మామిడి ఫ్రాప్పుసినోకి రాయబారిగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే తారల జాబితా చేంతాడంత. అయితే ఇందులో కోట్లే కాదు...కొంత రిస్క్ కూడా ఉంది. అమెరికాలో అయితే ఆన్‌లైన్ ప్రచారం చేసే కంపెనీల ఉత్పత్తుల్లో ఏవైనా తేడాలుంటే తారలు కూడా వూచలు లెక్కపెట్టాల్సిందే. అక్కడి అడ్వర్టైజింగ్ స్టాండర్స్ అసోసియేషన్ (ఏఎస్‌ఏ) ఈ వ్యవహారాలన్నీ చూస్తూ సూపర్‌స్టార్లని కూడా కోర్టుకు లాగుతోంది. భారత్‌లో మ్యాగీ వివాదం చెలరేగాక వ్యవహారం మనవాళ్లకీ అర్ధమై విచక్షణతోనే వ్యవహరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అయితే తనకు తానే ఒక నిబంధన విధించుకుంది. తను ప్రచారం చేసే ఏ ఉత్పత్తి అయినా వాడిచూసి సంతృప్తి చెందితేనే ఒప్పుకుంటానంటోంది.
సామాన్యులకు కూడా...
సెలబ్రిటీలే కాదు... సామాన్యులు ట్వీట్లతో సంపాదించే అవకాశాలు లేకపోలేదు. ఎక్కువమంది ఫాలోయర్లు ఉంటే సామాన్యులూ సంపాదించే అవకాశం ఉందంటున్నాయి paidpertweet.com, everywaytomakemoney.com, 101 వియర్డ్ వేస్ టు మేక్ మనీ అనే వెబ్‌సైట్లు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!