China: ఆస్ట్రేలియా హెలికాప్టర్‌పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య

చైనా యుద్ధ విమానాలు మరోసారి ఆస్ట్రేలియాను బెదిరించే ప్రయత్నం చేశాయి. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం ముదిరింది. 

Published : 07 May 2024 17:56 IST

ఇంటర్నెట్‌డెస్క్: చైనా(China)-ఆస్ట్రేలియా (Australia)ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈసారి దీనికి యెల్లో సీ వేదికగా మారింది. ఆస్ట్రేలియా నౌకాదళానికి చెందిన ఓ హెలికాప్టర్‌పై డ్రాగన్‌కు చెందిన ఓ యుద్ధ విమానం నిప్పుల వర్షం కురిపించింది. గత వారాంతంలో ఈ ఘటన చోటుచేసుకొన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎంహెచ్‌-60 హెలికాప్టర్‌ ఉత్తర కొరియాపై ఐరాస ఆంక్షల అమలు పరిశీలనకు వెళ్లింది. ఆ సమయంలో హఠాత్తుగా దూసుకొచ్చిన చైనా ఫైటర్‌ జెట్‌ ఆ హెలికాప్టర్‌కు అత్యంత సమీపంలో భారీగా ఫ్లేర్స్‌ను (అగ్ని గోళాలు) విడుదల చేసింది. దీంతో హెలికాప్టర్‌ సిబ్బంది కంగారుపడ్డారు. 

ఈ ఘటనను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బెనీస్‌ తీవ్రంగా పరిగణించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ‘‘ఆ హెలికాప్టర్‌ అంతర్జాతీయ జలాలపై ఉన్నాయి. ఉ.కొరియా వద్ద ఐరాస మిషన్‌పై పని చేస్తోంది. వారు చేసిన పనికి సరైన దౌత్యమార్గాల్లో సమాధానం చెబుతాము’’ అని వ్యాఖ్యానించారు. ఆ దేశ రక్షణ మంత్రి రిచర్చ్‌ మార్లెస్‌ మాట్లాడుతూ ఇది సురక్షితం కాని బాధ్యతా రాహిత్య చర్య అని అభివర్ణించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. 

ఇటీవల అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరుగుతున్న ఘర్షణలకు ఇది నిదర్శనంగా నిలిచింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై చైనా వాయుసేన, నావికా దళాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

దీనిపై చైనా సైన్యం స్పందిస్తూ ‘‘ఐరాస ఆంక్షల అమలు పర్యవేక్షణ పేరిట ఆస్ట్రేలియా ఎయిర్‌ క్రాఫ్ట్‌ మా గగనతల సరిహద్దులను ఉల్లంఘించి ఇబ్బందులు సృష్టించాలని చూసింది. మేం తగిన చర్యలు తీసుకొన్నాం’’ అని సమర్థించుకొంది. ఎంహెచ్‌-60 సీహాక్‌ రెండు ఇంజిన్లతో పనిచేసే హెలికాప్టర్‌. దీనిలో ముగ్గురు సిబ్బంది ప్రయాణించవచ్చు. హెచ్‌ఎంఏఎస్‌ హోబార్ట్‌ నుంచి దీనిని అంతర్జాతీయ జలాల్లో వినియోగిస్తున్నారు. ఆపరేషన్‌ ఆర్గోస్‌లో భాగంగా యెల్లో సీలో ప్రయాణిస్తుండగా ఈ ఘర్షణ చోటుచేసుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని