Prajwal Revanna: అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్‌డ్రైవ్‌లను పంచారు: కుమారస్వామి

Karnataka Sex Tape Row: ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంపై తన బాబాయ్ కుమారస్వామి స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Published : 07 May 2024 17:27 IST

బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌ (Prajwal Revanna)లపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాజాగా దీనిపై స్పందించారు. ఎన్నికల ముందు ఆ అభ్యంతరకర వీడియోలున్న 25వేల పెన్‌డ్రైవ్‌లను పంచారని విమర్శించారు. ఈ కుట్ర వెనక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.(Karnataka Sex Tape Row)

‘‘ఈ సమాజంలో జరగకూడని ఒక అంశం గురించి మాట్లాడేందుకు నేను ఇక్కడికి వచ్చాను. మొదట బెంగళూరు రూరల్‌ నియోజకవర్గంలో ఒక పెన్‌డ్రైవ్‌ను విడుదల చేశారు. ఇది ఏప్రిల్ 21న జరిగింది. ఆ రోజు రాత్రి ఒక వాట్సాప్‌ ఛానల్‌ను క్రియేట్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు వీక్షించేందుకు ఈ ఛానల్‌ను ఫాలో అవండని అందులో మెసేజ్ పెట్టారు. దానిపై ఏప్రిల్‌ 22 మా పోలింగ్ ఏజెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ వీడియోలలో ఉన్న దేనినీ నేను సమర్థించడం లేదు. చట్టపరంగా తప్పు చేసినవారికి శిక్ష పడాలి. అలాగే ఆ వీడియోలను పంచిన విషయంలో నలుగురు వ్యక్తులపై కేసు నమోదైంది. ఈ కేసు నమోదై 15 రోజులు అవుతోంది. ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. సిట్‌ను ఏర్పాటుచేసినప్పుడు న్యాయం జరుగుతుందని నేను భావించాను. కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదు. అధికారంలో ఉన్నవారు సిట్ సభ్యుల్ని వారి ఇంటికి పిలిచి, కేసు గురించి మాట్లాడుతున్నారు’’ అని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ముగ్గురు జేడీఎస్ అభ్యర్థులు ఓడిపోతారని సిద్ధరామయ్య ధీమాగా చెప్పారని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. అలాగే పోలీసు అధికారుల సహాయంతో ఆ పెన్‌డ్రైవ్‌ల పంపిణీ జరిగిందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని