పెళ్లైన నన్ను పెళ్లాడతానంటోంది

నాకు పెళ్లై ఒక పాప. ఆర్నెళ్ల కిందట ఫేస్‌బుక్‌లో ఒకమ్మాయి పరిచయమైంది.

Published : 17 Jun 2017 01:30 IST

పెళ్లైన నన్ను పెళ్లాడతానంటోంది

* నాకు పెళ్లై ఒక పాప. ఆర్నెళ్ల కిందట ఫేస్‌బుక్‌లో ఒకమ్మాయి పరిచయమైంది. అప్పుడు పెళ్లి కాలేదని తనతో అబద్ధం చెప్పాను. ముందు సరదా మాటలతో మొదలైన మా పరిచయం రాన్రాను గాఢమైన అనుబంధంగా మారింది. తరచూ కలుస్తూనే ఉన్నాం. ఓరోజు తను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. మాట్లాడకుండా ఉండిపోయా. తర్వాత వారం తిరక్కుండానే ‘మన ప్రేమ విషయం మా ఇంట్లోవాళ్లకు చెప్పి ఒప్పించా. మీ పెద్దవాళ్లకు కూడా చెప్పి మన పెళ్లికి ఒప్పించు’ అంది. నా గుండెల్లో రాయి పడింది. తనదసలే అతిగా స్పందించే మనస్తత్వం. నిజం చెబితే ఎలా రియాక్ట్‌ అవుతుందోనని భయంగా ఉంది. పైగా తను నాకు దూరమవడం తట్టుకోలేను. ఇప్పుడేం చేయాలి?

- సీహెచ్‌.పి., వైజాగ్‌

* ఫేస్‌బుక్‌లాంటి అంతర్జాల పరిచయాలు అబద్ధాలతో మొదలవడం సాధారణమే. కానీ ఆమె నీ నుంచి కోరుకుంటోంది కాలక్షేపం, స్నేహం కాదని తెలిశాక కూడా నిజం చెప్పకపోవడం నీ తప్పు. నీ మనసు, బుద్ధి సరైన దారిలో ప్రయాణించడం లేదని అర్థమవుతోంది. సినిమాల్లో చూపించినట్టు ఇద్దరమ్మాయిలతో చాటుమాటు ప్రేమలు, సంసారాలు కొనసాగించడం ఎంతో కాలం సాధ్యపడదు. అబద్ధాలు ఎంతోకాలం దాగవు. నీది ఎంత గాఢమైన అనుబంధం అని చెప్పినా అది కేవలం అబద్ధం అనే పునాది మీద ఏర్పడిన బంధమని గుర్తించాలి. నీకు పెళ్లైందని తెలిస్తే తను తాత్కాలికంగా బాధ పడొచ్చు. నిన్ను ద్వేషించవచ్చు. కానీ నీ అంతట నువ్వే నిజం చెబితే కొంతకాలానికైనా నీ నిజాయతీని గుర్తిస్తుంది. అలా కాకుండా నీకు పెళ్లై కూతురు ఉందనే విషయం వేరొకరి ద్వారా తెలిస్తే నిన్నో మోసగాడిగా భావిస్తుంది. ప్రేమించడం మాని ద్వేషిస్తుంది. ఆమె మనసులో నీకు కనీసం ఒక మనిషిగా కూడా స్థానం దక్కదు. సమాజం దృష్టిలో చులకనవుతావు. నీ ఉద్యోగం, సంసారం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఆలస్యం చేయొద్దు. తను తొందరపడి ఆమె తల్లిదండ్రులను నీ ఇంటికో, ఆఫీసుకో పంపక ముందే నీకు వివాహమైన సంగతి చెప్పు. అంత ధైర్యం లేకపోతే ఒక లేఖ ద్వారా విషయం వివరించు లేదా మీ పరిచయానికి దారి తీసిన ఫేస్‌బుక్‌ ద్వారానే వివరాలన్నీ చెప్పి క్షమాపణ కోరు. తప్పు దిద్దుకున్న తర్వాత మంచి మనిషిగా నీ జీవితాన్ని పునఃప్రారంభించు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని