Andhra News: పాలనా సౌలభ్యం.. భౌగోళిక అనుబంధాలే ప్రాతిపదిక

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 28 Oct 2025 03:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

వీటి ఆధారంగానే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు 
సాధ్యాసాధ్యాలపై నివేదికలు తీసుకున్న ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: పాలనా సౌలభ్యంతోపాటు భౌగోళిక, సాంస్కృతిక అనుబంధం, విద్య, వైద్య మౌలిక సౌకర్యాలే ప్రాతిపదికగా కొత్త జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల ఏర్పాటు, పేర్ల్ల మార్పు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, ప్రజల నుంచి 200కు పైగా వినతులు రాగా.. సంబంధిత జిల్లాల కలెక్టర్లకు వాటిని పంపి సమగ్ర పరిశీలన చేయించింది. సంబంధిత మండలాల తహసీల్దారు, డివిజన్‌ ఆర్డీవోలు, సబ్‌ కలెక్టర్లు, కలెక్టర్ల నుంచి సాధ్యాసాధ్య నివేదికలు తెప్పించింది. మంగళవారం సీఎం చంద్రబాబు వద్ద జరిగే సమావేశంలో వాటిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మార్కాపురంతోపాటు ఏజెన్సీ ప్రాంతంలో మరో జిల్లా ఏర్పాటుపై ఇప్పటికే స్పష్టత రాగా.. మరికొన్ని జిల్లాల ఏర్పాటుపైనా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. 10 రెవెన్యూ డివిజన్లతోపాటు మరికొన్ని మండలాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నియోజకవర్గాల పరిధిలోని మండలాల్ని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చాలనే అభ్యర్థనలూ పరిశీలించనున్నారు. 

  • ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు అందాయి. ఈ నియోజకవర్గంలోని నూజివీడు, అగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల స్థానికులు అర్జీలు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలో చేసిన జిల్లాల విభజనకు ముందు ఇవి కృష్ణా జిల్లాలో ఉన్నాయి. సాంఘిక, ఆర్థిక, విద్య, వైద్య అవసరాల వారీగా చూస్తే ఈ మండలాల ప్రజలకు విజయవాడతో ఎక్కువ అనుబంధం ఉందని అధికారులు పేర్కొన్నారు. 
  • ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని అర్జీలు అందాయి. కలిదిండి, ముదినేపల్లి, కైకలూరు, మండవల్లి మండలాలు 2022 ముందు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. వీటిని మళ్లీ కృష్ణా జిల్లాలోకే తేవాలని ప్రజాప్రతినిధులు కోరారు. భౌగోళిక, పాలనాపరంగా ఈ మండలాలు కృష్ణా జిల్లాలో కలపడం అనుకూలంగా ఉంటుందని అధికారులు నివేదించారు. 
  • బాపట్ల జిల్లాలో అద్దంకి, కొరిశపాడు, సంతమాగులూరు, జె.పంగులూరు, బల్లికురవ మండలాలు ప్రకాశం జిల్లాకు దగ్గరగా ఉంటాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వీటిని ప్రకాశం జిల్లాలో కలిపితే అక్కడి ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది. ఈ అయిదు మండలాలతో ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌ కూడా ప్రతిపాదించారు. అద్దంకి నియోజకవర్గంలో మైనింగ్‌ ఆదాయం అధికం. ఇది ప్రకాశం జిల్లాలోకి వెళ్తే బాపట్ల జిల్లా విస్తీర్ణం, ఆదాయం తగ్గుతుంది. 
  • శ్రీసత్యసాయి జిల్లా మడకశిర కేంద్రంగా మడకశిర, అమరాపురం, గుడిబండ, రోళ్ల, అగలి మండలాలతో ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌ ప్రతిపాదించారు. ఈ మండలాలు ప్రస్తుతం పెనుకొండ డివిజన్‌లో ఉన్నాయి. పెనుకొండకు అగలి నుంచి 74 కి.మీ ఉంటే మడకశిరకు 34 కి.మీ మాత్రమే. రోళ్ల నుంచి కూడా పెనుకొండకు 64 కి.మీ ఉంటే మడకశిరకు 24 కి.మీ మాత్రమే.. మడకశిర రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తే ప్రయాణ దూరం బాగా తగ్గుతుందని గణాంకాలతో అధికారులు వివరించారు. 
  • చిత్తూరు జిల్లాలోని నగరి, నిండ్ర, విజయపురం మండలాల్ని చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఈ మండలాలు తిరుపతికి దగ్గరగా ఉంటాయి. 
  • తిరుపతి జిల్లాలోని గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాలతో కూడిన గూడూరు రెవెన్యూ డివిజన్‌ను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. ఈ మండలాలు నెల్లూరుకు దగ్గరగా ఉంటాయి. వీటిని తిరుపతి జిల్లాలో కలిపితే గూడూరు డివిజన్‌లో వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లె మిగులుతాయి. వాటిని శ్రీకాళహస్తి డివిజన్‌లో కలపవచ్చని పేర్కొన్నారు.
Tags :
Published : 28 Oct 2025 03:23 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు