ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో ఉండాలి

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 28 Oct 2025 06:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మంత్రి నారా లోకేశ్‌

ఈనాడు, అమరావతి: తుపాన్‌ ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సూచించారు. ‘ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడండి. కాకినాడ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సాయం అందించాలి.

కూటమి పార్టీల కేడర్‌ సహాయక చర్యల్లో పాల్గొనాలి. తుపాను ప్రభావిత తీర ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజల కోసం ముందస్తుగా సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారం, నీరు సిద్ధంగా ఉంచాలి. వర్షాల తర్వాత అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు చేపట్టాలి. అంబులెన్స్‌లు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలి. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకుండా ఆ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలి. కమ్యూనికేషన్‌ సమస్యలు తలెత్తకుండా సెల్‌ఫోన్‌ ఆపరేటర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. పంట పొలాల్లో నీరు నిలిస్తే, వెంటనే తొలగించేందుకు ఆయిల్‌ మోటార్లు సిద్ధంగా ఉంచుకోవాలి’ అని లోకేశ్‌ సూచించారు.

జలవనరులశాఖ అధికారులు అప్రమత్తం కావాలి: మంత్రి నిమ్మల

‘తుపాను ప్రభావిత జిల్లాల్లో జలవనరులశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సీఈ స్థాయి నుంచి లస్కర్‌ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. అందరూ వారి ప్రధాన కేంద్రంలో అందుబాటులో ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలి. సెలవుల్లో ఉన్నవారు వెంటనే రద్దు చేసుకుని విధుల్లో చేరాలి’ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం సాయంత్రం జలవనరులశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి మాట్లాడారు.

చెరువులు, కాల్వగట్లు తెగిపోతే తక్షణం మరమ్మతులు చేపట్టాలన్నారు. జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేసే ముందు ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లాలో వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌పై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. విజయవాడ నగరంలో వెలగలేరు రెగ్యులేటర్‌ నుంచి ఎనికేపాడు అండర్‌ టన్నెల్‌ వరకు పాత బుడమేరు ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఎర్రకాలువ, యనమదుర్రు డ్రెయిన్, బురద కాలువ, సుద్దవాగు, ఏలేరు రిజర్వాయర్, రైవాడ కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. 

Tags :
Published : 28 Oct 2025 04:52 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు