సీజ్‌ చేసిన బస్సుల్ని వదిలేయాలంటూ ఒత్తిళ్లు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 30 Oct 2025 06:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

34 బస్సుల ఎఫ్‌సీల రద్దుకు నోటీసుల జారీ
నేటి నుంచి మళ్లీ ట్రావెల్స్‌ బస్సుల తనిఖీలు

ఈనాడు-అమరావతి: కర్నూలులో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం ఘటన తర్వాత.. నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న ట్రావెల్స్‌ బస్సులపై రవాణా శాఖ తనిఖీలు జరిపి 114 బస్సులు సీజ్‌ చేయగా.. వాటిని విడిచి పెట్టాలంటూ అధికారులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. బస్సుల యాజమాన్యాలు కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. నేతలు ముఖ్యంగా జిల్లాలోని డీటీవోలు, ఆర్టీవోలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ బస్సుల్లో ఉల్లంఘనలపై ప్రభుత్వం కఠినంగా ఉండటం, కమిషనర్‌ కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాల్సిందేనని ఆదేశించడంతో.. తామేమీ చేయలేమని జిల్లా అధికారులు చెబుతున్నారు. 

981 కేసుల నమోదు

ఈనెల 24 నుంచి 27 వరకు అన్ని జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు తనిఖీలు జరిపి 981 కేసులు నమోదు చేశారు. అత్యవసర ద్వారాలు లేనివి 47, అగ్నిమాపక పరికరాలు లేనివి 274, ఫైర్‌ అలారం సిస్టమ్‌ లేనివి 33, అనధికారికంగా మార్పులు చేసిన 160 బస్సులపై కేసులు పెట్టారు. అనుమతి లేకుండా మార్పులు చేసిన, అత్యవసర ద్వారాన్ని మూసేసి సీట్లు, బెర్తులు ఏర్పాటు చేసిన 114 బస్సులను సీజ్‌ చేశారు. 34 బస్సుల ఫిట్నెస్‌ సర్టిఫికెట్ల రద్దుకు సిఫార్సు చేస్తూ రవాణాశాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవాటికి ఏపీలోని ఆటోమెటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌)లో మళ్లీ ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించుకుని ఎఫ్‌సీ పొందాలి. అలాగే అత్యవసర ద్వారం వద్ద ఏర్పాటుచేసిన బెర్తులు, సీట్లను తొలగించాలి. ఈ నిబంధనలన్నీ అమలు చేస్తేగానీ ఆ బస్సులను వదిలేది లేదని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. 

మళ్లీ తనిఖీలు కొనసాగింపు: ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్‌ చేసుకొని, ఆలిండియా పర్మిట్‌తో మన రాష్ట్రంలో తిరుగుతున్న ట్రావెల్స్‌ బస్సులను ఈనెల 24 నుంచి 27 వరకు ముమ్మరంగా తనిఖీ చేశారు. తుపాను కారణంగా 28, 29 తేదీల్లో తనిఖీలకు విరామం ఇచ్చారు. గురువారం నుంచి మిగిలిన బస్సులను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్‌తో ఏపీలో తిరుగుతున్నవి 530, ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్నవి 165 బస్సులని లెక్కతేల్చారు. వాటన్నింటినీ తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చారు.


బస్సు బాడీ డిజైన్‌ కోడ్‌కు కట్టుబడి ఉండాలి

స్లీపర్‌ బస్సులపై ఐఆర్‌ఎఫ్‌ స్పష్టీకరణ

దిల్లీ: స్లీపర్‌ బస్సుల బాడీ డిజైన్‌లో భద్రతా ప్రమాణాల కోడ్‌కు కట్టుబడి ఉండాల్సిందేనని అంతర్జాతీయ రోడ్డు ఫెడరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌) స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రతకు సంబంధించి బస్సుల బాడీ డిజైన్లపై ఇప్పటికే కఠిన నిబంధనలున్నాయని పేర్కొంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ సహా పలుచోట్ల స్లీపర్‌ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి 40 మంది దాకా మరణించిన నేపథ్యంలో ఐఆర్‌ఎఫ్‌ స్పందించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ, భద్రతాపరమైన రోడ్ల కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. ఇటీవల జరిగిన ప్రమాదాలు.. బస్సుల్లోని ప్రమాదకర పరిస్థితులను తెలియజేస్తున్నాయని ఐఆర్‌ఎఫ్‌ అభిప్రాయపడింది. ‘మండే గుణం కలిగిన ఇంటీరియర్స్, ఇరుకైన ఎగ్జిట్‌లు, అత్యవసర ద్వారాలు లేకపోవడం, లోపాలమయంగా ఉండటం, ఫైర్‌ సేఫ్టీ గేర్‌ లేకపోవడం, బయటపడటానికి ఎక్కువ సమయం లభించకపోవడం, సరైన శిక్షణ లేని సిబ్బంది వల్లే ఈ ప్రమాదాలు జరిగాయి’ అని పేర్కొంది. నిబంధనల ప్రకారం.. అగ్నిమాపక పరికరాలు, స్పీడ్‌ గవర్నర్లు, డ్రైవర్లకు నిర్ణీత సమయమే విధులు, ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రాలు అవసరమని ఐఆర్‌ఎఫ్‌ స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో సమయానికి సాయం అంది ఉంటే పలువురి ప్రాణాలను కాపాడగలిగే అవకాశం ఉండేదని అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు