అణుశాంతికి భారత్‌ కట్టుబడి ఉంది

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 05:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఐరాస సర్వసభ్య సమావేశంలో ఎంపీ పురందేశ్వరి

ఈనాడు, దిల్లీ: అణు శాంతికి భారత్‌ కట్టుబడి ఉందని రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. ఆమె గురువారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ అణుఇంధన సంస్థ నివేదికపై భారత్‌ తరఫున ప్రసంగించారు. అణు సాంకేతికతను సురక్షితంగా, శాంతియుతంగా ఉపయోగించేలా దేశాలకు సాయం చేయడంలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు. ఆ సంస్థకు భారత్‌ మద్దతు అందిస్తున్నట్లు గుర్తుచేశారు. జాతీయ అభివృద్ధి వ్యూహాల అమలు, కొవిడ్‌ మహమ్మారి నుంచి కోలుకోవడంలో అణుశాస్త్రం, సాంకేతికతలు కీలకపాత్ర పోషించినట్లు చెప్పారు. 2015 ప్యారిస్‌ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకొని వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి నిర్దేశించుకున్న 2030 ఎజెండా అమలుకూ అణుశాస్త్రం దోహదపడుతుందని పేర్కొన్నారు. అణు ఇంధన ఉత్పత్తి, పరిశోధనల్లో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించినట్లు చెప్పారు. అణు ఇంధన వినియోగంలో భారత్‌ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, అణుసాంకేతికతను శాంతియుతంగా ఉపయోగించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు భారత్‌ తన మద్దతును ఇక ముందుకూడా కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు