తెదేపా నేత కాలవ శ్రీనివాసులు గృహ నిర్బంధం

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. శనివారం ఉదయం ఆయన రాయదుర్గానికి వెళుతుండగా మార్గంమధ్యలో అనంతపురం

Published : 22 May 2022 05:49 IST

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. శనివారం ఉదయం ఆయన రాయదుర్గానికి వెళుతుండగా మార్గంమధ్యలో అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వడ్డుపల్లి దగ్గర పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ శ్రీనివాసులు ప్రతిఘటించగా బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి, అనంతపురంలోని ఆయన నివాసానికి తరలించారు. రాత్రి వరకు గృహ నిర్బంధంలో ఉంచారు. తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నరసానాయుడు, మురళి తదితరులు ఆయనకు మద్దతు పలికారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.

సవాలును స్వీకరించి వెళ్తుండగా...
పోలీసులను అడ్డం పెట్టుకుని రాయదుర్గం వెళ్లకుండా తనను అడ్డుకోవడం దుర్మార్గ చర్య అని కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైకాపా నాయకులు అధికార దర్పంతో ప్రజలకు చెడు చేయడంతోపాటు దేవదేవుడి కార్యక్రమాలకు ఆటంకం కలిగించారన్నారు. రాయదుర్గంలో గత బుధవారం ప్రసన్న వేంకటరమణ స్వామి కల్యాణోత్సవాన్ని 3 గంటలు ఆలస్యంగా నిర్వహించి... ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్రమైన అపచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి రాక ఆలస్యం కావడంతో ఏకంగా కల్యాణాన్నే ఆపేశారన్నారు. దీనిపై ప్రశ్నిస్తే బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కల్యాణం ఆలస్యం కాలేదని కాపు రామచంద్రారెడ్డి సవాల్‌ చేయడంతో శనివారం రాయదుర్గంలోని ఆలయానికి వస్తానని చెప్పి తాను బయలుదేరగా.. పోలీసులు అడ్డుకున్నారన్నారు. వైవీ సుబ్బారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని