icon icon icon
icon icon icon

రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు?

పంట రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవుతుందని, కాళేశ్వరంలో భారాస నేతలు దోచుకున్న రూ.లక్ష కోట్ల కన్నా, హైదరాబాద్‌ చుట్టూ దోచుకున్న భూముల విలువ కన్నా అది ఎక్కువ కాదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 27 Apr 2024 08:44 IST

ఆగస్టు 15లోపు చేసి తీరుతాం
హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరిస్తున్నా
రాజీనామా లేఖను సీస పద్యంలా రాస్తారా?
పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: పంట రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవుతుందని, కాళేశ్వరంలో భారాస నేతలు దోచుకున్న రూ.లక్ష కోట్ల కన్నా, హైదరాబాద్‌ చుట్టూ దోచుకున్న భూముల విలువ కన్నా అది ఎక్కువ కాదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే తమకు అధికారం ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం తన నివాసంలో కాంగ్రెస్‌ మీడియా విభాగం ఛైర్మన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సోషల్‌ మీడియా వారియర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ ప్రసంగించారు. ‘‘ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని, రాజీనామా చిట్టీ జేబులో పెట్టుకొమ్మని హరీశ్‌రావుకు చెప్పా. మోసం చేయాలనుకున్న ప్రతిసారీ ఆయనకు అమరవీరుల స్తూపం గుర్తుకొస్తుంది. గతంలో ఎప్పుడైనా అక్కడికి వెళ్లారా? ఈ రోజు స్తూపం వద్దకు వెళ్లి అబద్ధాలు చెప్పారు. రాజీనామా లేఖ స్పీకర్‌ ఫార్మాట్‌లో ఉండాలి. సీస పద్యంలా రాస్తే చెల్లుతుందా? హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరిస్తున్నాం. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతాం. మోదీ, కేసీఆర్‌లకు మూడోసారి పదవులు కావాలట. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల్లోని ఐదు హామీలు అమలు చేసిన కాంగ్రెస్‌ దిగిపోవాలని అంటున్నారు. రాష్ట్రంలో కష్టపడి తెచ్చుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. రేవంత్‌రెడ్డి దిగిపోతే చాలు.. ఎవరున్నా ఓకే అని భారాస నేతలు భావిస్తున్నారు. నన్ను చూస్తేనే ఒంటిపై జెర్రులు పాకినట్లుగా కేసీఆర్‌, కేటీఆర్‌ భావిస్తున్నారు. అందుకే ఎవరితోనైనా కలుస్తామంటున్నారు. ఈ ఎన్నికల్లో 12 సీట్లు గెలిస్తే ఏడాదిలో రాష్ట్రంలో భారాస ప్రభుత్వం వస్తుందని కేటీఆర్‌ అంటున్నారు. ఎలా వస్తుంది? తండ్రి పేరు చెప్పుకొని నేనేమైనా అమెరికా నుంచి వచ్చి కూర్చున్నానా? ఎన్నికల్లో భాజపా, భారాస కుట్రలను తిప్పికొట్టాలి. ఈ ఎన్నికల్లో భాజపా గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి. అవి కొనసాగాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలి. ఈ విషయాన్ని ప్రజలకు పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలు వివరించాలి.

ఈ ఎన్నికలు కీలకం..

దేశాన్ని భాజపా నుంచి రక్షించుకోవాలి. ప్రజాస్వామాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఈ ఎన్నికలు కీలకం. 14 సీట్లు నెగ్గడమో, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడమో, రాహుల్‌ ప్రధాని కావడమో ముఖ్యం కాదు. రాహుల్‌ కుటుంబానికి సొంతిల్లు కూడా లేదు. రాజ్యాంగంలో సమూల మార్పులు తెచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతోంది. ఇప్పటికే రూ.60 లక్షల కోట్ల విలువ చేసే సంస్థలను రూ.6 లక్షల కోట్లకే అమ్మేశారు. దేశం రూ.168 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. కేసీఆర్‌ రూ.7 లక్షల కోట్లు, మోదీ రూ.113 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ డబ్బు ఎక్కడికి పోయిందంటే మోదీ చెప్పరు. అడిగితే రామాలయం కట్టామంటారు. కేసీఆర్‌ కూడా అప్పుల సొమ్ము ఎక్కడికి పోయిందంటే జైతెలంగాణ అనేవారు.

లాలూప్రసాద్‌ చెప్పిన గాడిద కథ..

లాలూప్రసాద్‌ గతంలో ఒక కథ చెప్పారు. ఒక రజకునికి ఒక గాడిద ఉండేదట. దానిపై ఉన్న దుప్పటిపై రాముడి బొమ్మ ఉండేది. అది పొలం మేయడానికి పోతే రాముడి బొమ్మ ఉందని ఎవరూ ఏమీ అనేవారు కాదు. ఒకసారి దుప్పటి గాలికెగిరిపోయింది. అప్పుడు అదే గాడిద పొలంలో మేస్తోంటే.. ఓ రైతు కర్రతో కొడితే దాని నడుం విరిగింది. అలాగే భాజపా నేతలు రాముడి ముసుగు వేసుకుని తిరిగినంతకాలం ప్రజలు మద్దతిచ్చారు. ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది. ఇప్పుడిక భాజపా నడుం విరగడం ఒక్కటే మిగిలిఉంది. శ్రీరామనవమిని ఓ పెద్ద సమస్యగా చిత్రీకరించడానికి భాజపా ప్రయత్నం చేస్తోంది. బతుకమ్మ, బోనాలు ఎత్తుకోవడం కవిత నేర్పినట్లు.. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి చేసుకోవడం బండి సంజయ్‌ లేదా అర్వింద్‌ నేర్పినట్లు ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి విషయాలను సమయస్ఫూర్తితో తిప్పికొట్టాలి.

ట్వంటీ-20 మ్యాచ్‌ల్లాగా పనిచేయాలి

క్రికెట్‌లో గతంలో టెస్ట్‌ మ్యాచ్‌లకు ఎక్కువ ఆదరణ ఉండేది. కాలక్రమేణా వాటికి ఆదరణ తగ్గడంతో వన్‌డే మ్యాచ్‌లను తెచ్చారు. ఇప్పుడు ట్వంటీ-20లు ఆడిస్తున్నారు. ట్వంటీ-20ల్లో ధాటిగా ఆడకపోతే మ్యాచ్‌ చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా సోషల్‌ మీడియా ఏదైనా అంశాన్ని ఒక్క సెకన్‌ కూడా ఆలస్యం కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగం గట్టిగా పనిచేసినందునే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితం వచ్చింది. చాలా గ్రామాల్లో తిరిగి ఉపన్యాసాలు ఇచ్చినందుకే ప్రభుత్వం వచ్చిందని చాలామంది నాయకులు అనుకుంటారు. ఎన్ని గంటలు ఉపన్యాసాలిచ్చినా కోట్ల మందికి చేరవేసింది సోషల్‌ మీడియానే’’ అని సీఎం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img