సొంతింటికి గ్యారంటీ ఇస్తారా?

ప్రధానమైనది సొంతిల్లు. భూముల ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు సొంతిల్లు కలగానే మారుతోంది. ముఖ్యంగా భూముల ధరలు భారీగా పెరగడంతో సరసమైన ధరల(అఫర్డబుల్‌) ఇళ్ల నిర్మాణం పూర్తిగా తగ్గిపోయింది. తమ కష్టార్జితంతో ఇళ్లు కొనుగోలు చేద్దామంటే బడ్జెట్‌ సహకరించని పరిస్థితి.

Updated : 27 Apr 2024 09:40 IST

సార్వత్రిక ఎన్నికల ముంగిట సామాన్య, మధ్యతరగతి వర్గాల ఎదురుచూపులు
సరసమైన ధరల ఇళ్ల నిర్మాణంపై ఒక విధానం అవసరమంటున్న నిర్మాణ సంఘాలు  
ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజల ముందుకొస్తున్నాయి. గ్యారంటీలకు హామీ ఇస్తున్నాయి. సిటీలో అన్నింటికంటే ప్రధానమైనది సొంతిల్లు. భూముల ధరలు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు సొంతిల్లు కలగానే మారుతోంది. ముఖ్యంగా భూముల ధరలు భారీగా పెరగడంతో సరసమైన ధరల(అఫర్డబుల్‌) ఇళ్ల నిర్మాణం పూర్తిగా తగ్గిపోయింది. తమ కష్టార్జితంతో ఇళ్లు కొనుగోలు చేద్దామంటే బడ్జెట్‌ సహకరించని పరిస్థితి. వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఒక గృహ విధానమంటూ ఉండాలని ఆయా వర్గాలు కోరుకుంటున్నాయి.

నగరానికి దూరంగా వెళ్తేనే..

సిటీలో ఇల్లు కొనడం కొన్ని వర్గాలకు తలకు మించిన భారంగా మారింది. కోటి ఉంటేనే ఇల్లు గురించి ఆలోచించాలి అనే రోజులు వచ్చాయి. శివార్లలో రూ.70 నుంచి రూ.80 లక్షల్లో సొంతం చేసుకోవచ్చు. ఐటీ కారిడార్‌లో అయితే కోటిన్నర పైనే వెచ్చించాలి. నెలకు లక్ష రూపాయల ఆదాయం ఉంటే తప్ప ఈ స్థాయి ధరల ఇళ్లను కొనలేరు. సిటీలో అత్యధిక మంది కుటుంబ ఆదాయం రూ.50వేల లోపే. ఈ వర్గాల కోసం రూ.50 లక్షలు అంతకంటే తక్కువ ధరలో కడుతున్న ఇళ్లు చాలా స్వల్పం. అది కూడా సిటీకి దూరంగా ఉన్న ప్రాంతాలకు వెళితేనే సాధ్యం.

గత నెలలో విక్రయాలు చూస్తే..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో మార్చి నెలలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు చూస్తే సరసమైన ధరల ఇళ్ల వాటా చాలా తక్కువగా ఉంది. 500 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం కలిగిన  ఇళ్లు 3 శాతం రిజిస్ట్రేషన్‌ కాగా.. 500 నుంచి 1000 చ.అ. విస్తీర్ణం కలిగినవి 13 శాతం రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. మొత్తంగా  16 శాతంలోపే.  గత ఏడాది 20 శాతంగా ఉండేది. ఏటేటా ధరల పెరుగుదలతో ఈ వర్గాల కోసం కట్టే..కొనే ఇళ్లు తగ్గిపోతున్నాయి.

గృహరుణ వడ్డీ సబ్సిడీతో...

అద్దె ఇళ్లలో ఉండే మధ్యతరగతి వర్గాలు సొంతిల్లు కొనేందుకు ఒక పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్రం 2024-25 బడ్జెట్‌లో ప్రకటించింది. ఆ పథకం ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ప్రకటించలేదు. ఈ లోపు ఎన్నికలు వచ్చేశాయి. మళ్లీ అధికారం తమదే అంటున్న భాజపా దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. జాతీయ స్థాయిలోనూ పగ్గాలు అందుకోవాలని చూస్తున్న తరుణంలో పార్టీ వైఖరి ఏంటనేది స్పష్టం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిర్మాణదారులు రాజకీయ పార్టీలకు పలు సూచనలు, డిమాండ్లు చేస్తున్నారు.


2021 వరకు

మూడేళ్ల క్రితం వరకు సామన్య, మధ్యతరగతి వర్గాల కోసం పీఎంఏవై క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ స్కీమ్‌(సీఎల్‌ఎస్‌ఎస్‌) ఉండేది. ఎవరైనా గృహరుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తే వడ్డీ సబ్సిడీ కింద గరిష్ఠంగా రూ2.67 లక్షల వరకు మంజూరు చేశారు. మొదట్లో తక్కువ విస్తీర్ణం నిబంధనలు పెట్టినా.. తర్వాత ఎంఐజీ1, 2 వంటి ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్లకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేశారు. నేరుగా సొమ్మును బ్యాంకు రుణ ఖాతాలో జమ చేయడం ద్వారా ఈఎంఐ భారం తగ్గింది. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఈ పథకంతో సొంతింటి కల నెరవేర్చుకున్నారు. ఇంకా లక్షలాది మంది ఇల్లులేని వారు హైదరాబాద్‌తో సహా వేర్వేరు నగరాల్లో ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ తరహా పథకాన్ని పెరిగిన ధరలకు అనుగుణంగా అమలు చేయడం ద్వారా సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం కలుగుతుందని బిల్డర్లు అంటున్నారు.


అక్కడ.. ఇక్కడ విధానాలపై..

  • రాష్ట్రస్థాయిలో ప్రత్యేకించి సరసమైన ధరల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూమిని గుర్తించి తమకు కేటాయిస్తే సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనగలిగే బడ్జెట్‌లో ఇంటి నిర్మాణం పూర్తిచేసి ఇస్తామని బిల్డర్లు అంటున్నారు. దీనిపై ఒక విధానం ఉండాలని కోరుతున్నారు.
  • సరసమైన ధరల ఇళ్ల విస్తీర్ణం పరిధిని పెంచాల్సి ఉంది. నగరాలను బట్టి వెలుసుబాటు ఇవ్వాలని సూచిస్తున్నారు.
  • జీఎస్‌టీ సాధారణ ఇళ్లకు 5 శాతం, సరసమైన ధరల ఇళ్లకు 1 శాతం ఉంది. విస్తీర్ణంపై విధించిన ఆంక్షలు సమస్యగా ఉంది.  వెసులుబాటు ఇవ్వాలని బిల్డర్లు కోరుతున్నారు. ః స్టీల్‌, సిమెంట్‌, ఎలక్ట్రికల్‌తో సహా నిర్మాణ రంగంలో ఉపయోగించే ఉత్పత్తుల్లో చాలావాటిపై జీఎస్‌టీ అధికంగా ఉంది. గరిష్ఠంగా 18శాతం వసూలు చేస్తున్న ఉత్పత్తులు అధికంగా ఉన్నాయి. వాటిపై జీఎస్టీనితగ్గించాలని అభ్యర్థిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని