Saving Account: పొదుపు ఖాతా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

బ్యాంకులో పొదుపు ఖాతా అనేది ఖాతాదారుడికి ఒక విభిన్నమైన ఆర్థిక సాధనం. ఇది ఖాతాదారుడికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.

Published : 20 Feb 2024 22:37 IST

దేశంలో బ్యాంకులు గ్రామ స్థాయికి విస్తరించాయి. సాధారణంగా వినియోగదారులు బ్యాంకులో ఖాతాదారుడిగా చేరడానికి సేవింగ్స్‌ ఖాతాను ప్రారంభిస్తారు. ఇది బ్యాంకు అందించే సాధారణ డిపాజిట్‌ ఖాతా. ఈ ఖాతాలో మీ డబ్బును సురక్షితంగా నిల్వ చేసుకోవడమే గాక స్వల్ప వడ్డీని కూడా పొందొచ్చు. పొదుపు ఖాతా డబ్బు కోసం ఒక డిపాజిటరీ మాత్రమే కాదు. ఇది అనేక విభిన్న ప్రయోజనాల కోసం ఉపయోగించే ఖాతా. మీ ఆర్థిక జీవితాన్ని వివిధ మార్గాల్లో సులభతరం చేసే బహుముఖ సాధనంగా ఉపయోగపడుతుంది. పొదుపు ఖాతా.. పాస్‌బుక్‌, నెట్‌ బ్యాంకింగ్‌, చెక్‌ బుక్‌ సౌకర్యాన్ని అందిస్తుంది. నామినీని కూడా ఎంచుకోవచ్చు. దీంతో పాటు పొదుపు ఖాతా ఉన్నవారికి అనేక బ్యాంకులు తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. పొదుపు ఖాతా ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో ఇక్కడ చూడండి.

లిక్విడిటీ

పొదుపు ఖాతాలో చాలా ప్రధానమైంది, కీలకమైంది లిక్విడిటీ. ఎవరైనా బ్యాంకులో డబ్బులుంటే కావలసినప్పుడు నిర్దేశిత మొత్తాన్ని తీసుకోవాలనుకుంటారు. ఖాతాదారుడు తన డబ్బును ఏ సమయంలోనైనా నిర్దిష్ట పరిమితి వరకు ఉపసంహరించుకోవచ్చు. ఉద్యోగులు, సీనియర్‌ సిటిజన్లకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ అత్యవసర నిధిని పొదుపు ఖాతా ద్వారా నిర్వహించొచ్చు. బ్యాంకు పొదుపు ఖాతా నుంచి పెద్ద మొత్తాలను ఉపసంహరించేటప్పుడు చెక్కును ఉపయోగించవచ్చు. ఖాతాను తెరిచినప్పుడు ఏటీఎమ్‌(డెబిట్‌) కార్డును కూడా బ్యాంకు అందిస్తుంది. పొదుపు ఖాతాలో ఉన్న డబ్బును బ్యాంకు వేళలలోనే కాకుండా ఏ సమయంలోనైనా ఏటీఎమ్‌ ద్వారా నిర్దేశిత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు, డిపాజిట్‌ చేయొచ్చు. బ్యాంకులు కొన్ని ఎంపికచేసిన పొదుపు ఖాతాలకు అంతర్జాతీయ డెబిట్‌ కార్డులను అందిస్తున్నాయి. వీటిని విదేశాల్లోని ఏటీఎంల నుంచి ఉచితంగా నగదు ఉపసంహరించుకోవడానికి వీలుంటుంది.

భద్రత, వడ్డీ

బ్యాంకు లావాదేవీలు చాలా పారదర్శకంగా ఉంటాయి. పొదుపు ఖాతాలోని మీ నగదు బ్యాంకులో పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు భద్రతా, నిబంధనల విషయంలో కఠినమైన నిబంధనలను కలిగి ఉంది. బ్యాంకులు డిపాజిట్‌ బీమా (DICGC)ను అందిస్తాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు సంబంధించిన ప్రతి పొదుపు ఖాతా/డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది. చాలా బ్యాంకులు తమ పొదుపు ఖాతాలపై 2.50-3% వడ్డీను అందిస్తున్నాయి. అయితే, కొన్ని డిజిటల్‌ సేవింగ్స్‌ ఖాతాలు వినియోగదారులను ఆకర్షించడానికి 7% వరకు కూడా వడ్డీని ఇస్తున్నాయి.

ఆన్‌లైన్‌ లావాదేవీలు

ప్రస్తుతం చాలా వరకు బ్యాంకులు పొదుపు ఖాతాతో పాటు నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఇది బ్యాంకు ఖాతాకు సంబంధించిన రోజువారీ నిర్వహణను చాలా సౌకర్యవంతంగా చేస్తుంది. బ్యాంకు బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా సౌకర్యవంతంగా నిర్దేశిత బ్యాంకింగ్‌ కార్యకలాపాలను ఇంటి వద్ద నుండే నిర్వహించవచ్చు. ఈ నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యంతో మీరు నిధులను ఎవరికైనా బదిలీ చేసే అవకాశముంటుంది. ఆన్‌లైన్‌లో.. ఫిక్స్‌డ్‌, రికరింగ్‌ డిపాజిట్ల ఖాతాలను తెరవచ్చు. చెక్‌బుక్‌ను ఆన్‌లైన్‌లో అభ్యర్థించవచ్చు. ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు మొబైల్‌ యాప్‌ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. మీరు మొబైల్‌ అప్లికేషన్‌ ఉపయోగించి ఆన్‌లైన్‌లో మీ ఖర్చులను ట్రాక్‌ చేయొచ్చు. డెబిట్‌ కార్డు పోగొట్టుకున్నా/అనధికారికంగా ఎవరైనా ఉపయోగించినా కార్డును తాత్కాలికంగా బ్లాక్‌/అన్‌బ్లాక్‌ చేయొచ్చు.

డిజిటల్‌ వ్యాలెట్‌, యూపీఐ చెల్లింపులు

ఈ సదుపాయంతో ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి ప్రముఖ డిజిటల్‌ వ్యాలెట్లను మీ బ్యాంకు పొదుపు ఖాతాకు లింక్‌ చేయొచ్చు. బ్యాంకు పొదుపు ఖాతా, వ్యాలెట్‌ మధ్య నిధులను సజావుగా బదిలీ చేయడానికి అనుమతి ఉంటుంది. దీనివల్ల మీ డిజిటల్‌ చెల్లింపులు సులభంగా నిర్వహించొచ్చు. మీ వ్యాలెట్ను రీఛార్జ్‌ చేయడానికి మీ బ్యాంకు ఖాతాను ఉపయోగించవచ్చు. చాలా బ్యాంకులు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) సేవలను అందిస్తాయి. వర్చువల్‌ పేమెంట్‌ అడ్రస్‌(వీపీఏ)ను ఉపయోగించి తక్షణమే డబ్బు పంపడానికి/స్వీకరించడానికి వీలు ఉంటుంది. వ్యాపారుల వద్ద చెల్లింపులు కూడా చేయొచ్చు.

రుణం

మీకు బ్యాంకులో పొదుపు ఖాతా ఉండి, దాన్ని మెరుగైన నగదు నిల్వలతో నిర్వహిస్తున్నట్లయితే, అవసరమైన సందర్భంలో వ్యక్తిగత రుణం పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగత రుణం మాత్రమే కాకుండా వెహికల్‌ లోన్స్‌, బంగారంపై రుణం, ఇంటి రుణం మొదలైనవి పొందడానికి ఈ పొదుపు ఖాతా ఎంతగానో ఉపయోగపడుతుంది. రుణాలు పొందేటప్పుడు పొదుపు ఖాతా ఉన్నవారికి బ్యాంకులు ప్రాధాన్యతనిస్తాయి.

రివార్డ్‌ పాయింట్లు

అనేక బ్యాంకులు పొదుపు ఖాతాతో విలువ ఆధారిత సేవలు, ప్రయోజనాలను అందిస్తాయి. షాపింగ్‌ చేసేటప్పుడు పొదుపు ఖాతాతో వచ్చే డెబిట్‌ కార్డులు బాగా ఉపయోగపడతాయి. డెబిట్‌ కార్డును ఉపయోగించి వ్యాపారులతో చేసే కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌/రివార్డు పాయింట్లను పొందొచ్చు. భారతీయ బ్యాంకులు జారీ చేసే నిర్దిష్ట డెబిట్‌ కార్డులు మీ ప్రయాణాల సమయంలో బుకింగ్‌లు లేదా లావాదేవీల కోసం వాటిని ఉపయోగించినప్పుడు ప్రయాణ బీమా, ఇతర పెర్క్‌లను అందిస్తాయి. కొన్ని బ్యాంకుల డెబిట్‌ కార్డులు కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌, లైఫ్‌స్టైల్‌ ప్రయోజనాలను అందిస్తాయి.

పిల్లలకు ఖాతా

పిల్లల పొదుపు ఖాతా 10-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లల కోసం ఉద్దేశించిన ఒక రకమైన పొదుపు ఖాతా. ఈ ఖాతాను పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పర్యవేక్షిస్తారు. ఈ ఖాతాలో ఇ-మెయిల్‌ స్టేట్‌మెంట్‌, బ్యాలెన్స్‌ ఎంక్వైరీలు, పాస్‌బుక్‌, ఏటీఎం కార్డు, రోజువారీ ఉపసంహరణ పరిమితులు మొదలైనవి సాధారణ పొదుపు ఖాతాలాగే ఉంటాయి. పిల్లలకు కూడా పొదుపు ఖాతాను తెరవడం ద్వారా, వారికి బ్యాంకు ఖాతాను ఎలా నిర్వహించాలనే ప్రాథమిక అంశాలను అర్ధం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. వారు ఈ ఖాతా ద్వారా ఆర్థిక నిర్వహణ, డబ్బు విలువను తెలుసుకోవడమే కాకుండా, పొదుపు ఎలా చేయాలనే ఆసక్తిని చిన్నప్పటి నుంచి కలిగిఉండేందుకు దోహదపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని