Credit Card: క్రెడిట్‌ కార్డును పరిమితికి మించి వాడుకోవచ్చా?

Credit Card: క్రెడిట్‌ వాడకంపై తరచూ ఎదురయ్యే కొన్ని కీలక సందేహాలకు ఇటీవల ఆర్‌బీఐ సమాధానాలు ఇచ్చింది. అవేంటో చూద్దాం..!

Published : 17 Mar 2024 00:09 IST

Credit Card | ఇంటర్నెట్‌ డెస్క్‌:  క్రెడిట్‌ కార్డును సరిగా ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణ అలవడుతుంది. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మంచి క్రెడిట్‌ హిస్టరీని నిర్మించుకోవచ్చు. బిల్లు చెల్లింపులు, కొనుగోళ్లకు కార్డును ఉపయోగించుకుంటూ సకాలంలో బకాయిలు కడితే క్రెడిట్‌ స్కోర్‌ మెరుగవుతుంది. ఈ ప్రయోజనాల నేపథ్యంలో వీటి వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా క్రెడిట్‌ కార్డుల విషయంలో తరచూ ఎదురయ్యే సందేహాలకు ఆర్‌బీఐ సమాధానాలు ఇచ్చింది. అవేంటో చూద్దాం..!

అనుమతి లేకుండా కార్డు పంపితే..

కార్డు జారీ సంస్థలు కచ్చితంగా కస్టమర్ల అనుమతితోనే క్రెడిట్‌ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు చేసుకోకున్నా.. కార్డు పంపినట్లయితే దాన్ని యాక్టివేట్‌ చేయొద్దు. కస్టమర్ల అభ్యర్థన మేరకు ఏడు రోజుల్లోగా ఎలాంటి ఛార్జీలు లేకుండా క్రెడిట్‌ కార్డు ఖాతాను జారీ సంస్థలు మూసివేయాలి. ప్రక్రియ పూర్తయిన తర్వాత వినియోగదారులకు సమాచారం అందజేయాలి. అనంతరం కస్టమర్‌ ఆ కార్డును ధ్వంసం చేయాలి. కావాలనుకుంటే ఆర్‌బీఐ అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేయొచ్చు.

లావాదేవీ చేయకున్నా.. కార్డు యూజ్‌ చేసినట్లేనా?

కేవలం ఆర్థిక లావాదేవీలు మాత్రమే కాకుండా.. స్టేట్‌మెంట్‌ తీయడం, పిన్‌ మార్చడం, లావాదేవీల పరిమితిని సవరించడం.. వంటివి చేసినా కార్డు వినియోగంలో ఉన్నట్లే. పై అంశాల్లో కాకుండా ఇతర ఏ కారణాలతోనైనా కస్టమర్‌ కేర్ సెంటర్‌కు కాల్‌ చేస్తే మాత్రం కార్డు ఉపయోగిస్తున్నట్లుగా పరిగణించరు.

పాక్షిక చెల్లింపు చేస్తే.. బిల్లు మొత్తంపై వడ్డీ, రుసుములు వర్తిస్తాయా?

మొత్తం బిల్లును సకాలంలో చెల్లించకపోతే వడ్డీరహిత గడువు ప్రయోజనాన్ని కోల్పోతారు. పాక్షిక చెల్లింపులు చేస్తే.. మిగిలిన మొత్తం (Outstanding amount)పై మాత్రమే లావాదేవీ జరిగిన రోజు నాటినుంచి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇతరత్రా రుసుములు సైతం బకాయిలకే (Outstanding amount) వర్తిస్తాయి. బిల్లు మొత్తానికీ (Total amount due) వడ్డీ, రుసుములు కట్టాల్సిన అవసరం లేదు.

బిల్లింగ్‌ సైకిల్‌ తేదీని మార్చుకోవచ్చా?

బిల్లింగ్ సైకిల్‌ ప్రారంభ, తుది తేదీలు కనీసం ఒకసారైనా మార్చుకోవడానికి కస్టమర్లకు సంస్థలు ఆప్షన్‌ ఇవ్వాలి. హెల్ప్‌లైన్‌, ఇ-మెయిల్ ఐడీ, ఇంటరాక్టివ్ వాయిస్‌ రెస్పాన్స్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్‌ వంటి మాధ్యమాల ద్వారా బిల్లింగ్ సైకిల్‌ మార్పునకు అభ్యర్థన దాఖలు చేయొచ్చు.

పరిమితికి మించి క్రెడిట్‌ కార్డును ఉపయోగించుకోవచ్చా?

క్రెడిట్‌ కార్డుపై ఎంత మొత్తం వాడుకోవచ్చనే దానికి కొంత పరిమితి ఉంటుంది. అయితే, కస్టమర్ల అనుమతితో దాన్ని మించి వాడుకునే ఆప్షన్‌ను సంస్థలు ఇవ్వొచ్చు. అవసరం లేదనుకుంటే దీన్ని డీయాక్టివేట్‌ చేసుకోవచ్చు. కస్టమర్‌కు తెలియజేయకుండా మాత్రం అదనపు పరిమితిని అనుమతించడం, దానిపై ఛార్జీలు వసూలు చేయడం మాత్రం చేయొద్దు. పైగా ఓవర్‌ లిమిట్‌ ఛార్జీలను వేసేటప్పుడు వడ్డీ, రుసుములను క్రెడిట్‌ లిమిట్‌ పరిధిలోకి తీసుకోవద్దు.

బకాయిల బాధ్యత ప్రధాన కార్డు హోల్డర్లదేనా?

ఒక క్రెడిట్‌ కార్డుపై యాడ్‌-ఆన్‌ కార్డులను తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాంటప్పుడు వాటన్నింటిపై ఉన్న బకాయిలను చెల్లించే బాధ్యత ప్రధాన కార్డుదారునిదే. బిజినెస్‌ క్రెడిట్‌ కార్డుల విషయంలో మాత్రం ఒప్పందాల మేరకు చెల్లింపులను విభజించుకునే వెసులుబాటు ఉంటుంది.

క్రెడిట్‌ కార్డులపై ఇన్సూరెన్స్‌ ఇవ్వాల్సిందేనా?

క్రెడిట్‌ కార్డుపై బీమా తప్పనిసరిగా ఇవ్వాలనే నిబంధనలేమీ లేదు. కానీ, సంస్థలు, నెట్‌వర్క్‌లు తమ కస్టమర్లకు ఇవ్వాలనుకుంటే మాత్రం నామినీ సహా బీమా వివరాలను ప్రతి స్టేట్‌మెంట్‌లో విధిగా తెలియజేయాలి. పాలసీ, బీమా కంపెనీ చిరునామా, ఫోన్‌ నంబర్‌ కూడా అందులో ఉండాలి. గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ అయితే, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలి.

కార్డు డీయాక్టివేషన్‌/బ్లాక్‌ వల్ల క్రెడిట్‌ కార్డు ఖాతా క్లోజ్‌ అవుతుందా?

క్రెడిట్‌ కార్డును డీయాక్టివేషన్‌/బ్లాక్‌ చేస్తే కేవలం దాన్ని వాడుకునేందుకు మాత్రమే కుదరదు. సంస్థలో ఉన్న క్రెడిట్‌ కార్డు ఖాతా మాత్రం అలాగే కొనసాగుతుంది. ప్రత్యేకంగా ఖాతాను మూసివేయాలని విజ్ఞప్తి చేస్తే మాత్రం ఆ సంస్థతో పూర్తిగా బంధం తెగిపోయినట్లే. కస్టమర్‌ నుంచి రిక్వెస్ట్‌ అందిన ఏడు రోజుల్లోగా సంస్థలు ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది. ఏమైనా బకాయిలు ఉంటే వెంటనే కస్టమర్‌కు తెలియజేయాలి. బిల్లింగ్ సైకిల్ ముగిసేవరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. చెల్లింపులు పూర్తి చేసిన దగ్గరి నుంచి ఏడు రోజుల్లో ఖాతాను మూసివేయాలి.

కార్డు జారీ సంస్థలపై ఫిర్యాదు చేయడం ఎలా?

ఏమైనా ఫిర్యాదులు ఉంటే తొలుత జారీ సంస్థలకు తెలియజేయాలి. 30 రోజుల్లోగా స్పందించకపోయినా, తిరస్కరించినా, ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా కస్టమర్‌ ఆర్‌బీఐ అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించొచ్చు. ఆన్‌లైన్‌ లేదా దరఖాస్తు ఫారం ద్వారా ఫిర్యాదును సమర్పించొచ్చు.

బిజినెస్‌ క్రెడిట్‌ కార్డు యాక్టివేషన్‌, క్లోజర్‌కు కార్పొరేట్లు/వ్యాపార సంస్థల అనుమతి తీసుకోవాలా?

కార్పొరేట్లు, వ్యాపార సంస్థల దరఖాస్తు ఆధారంగా ఇచ్చే బిజినెస్‌ క్రెడిట్‌ కార్డుల యాక్టివేషన్‌, క్లోజర్‌కు ముందు కచ్చితంగా వాటికి సమాచారం అందజేయాలి. ప్రత్యేకంగా ఒప్పందంలో మినహాయింపులు ఉంటే మాత్రం అవసరం లేదు. రిటైల్‌ కార్డుల విషయంలోనూ ప్రధాన కార్డుదారునికి తెలియజేయకుండా యాడ్‌-ఆన్‌ కార్డు హోల్డర్ల అభ్యర్థన మేరకు కార్డును క్లోజ్‌ చేయడం కుదరదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు