Festival Spending: ఫెస్టివ్ షాపింగ్‌.. కార్డ్‌ ఆఫర్లదే కీలక పాత్ర!

Eenadu icon
By Business News Team Published : 28 Oct 2025 17:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Festival Spending | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఫెస్టివ్ సీజన్‌లో వినియోగదారుల కొనుగోళ్లు కొత్త రికార్డులు సృష్టించాయి. దీపావళి సందర్భంగా ఇ-కామర్స్‌ సంస్థలు సేల్స్‌, ఆఫర్లతో ఆకట్టుకున్నాయి. 42 శాతం మంది క్రెడిట్‌ కార్డు వినియోగదారులు రూ.50 వేలకుపైగా ఖర్చు చేయగా.. 22 శాతం మంది రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కొనుగోళ్లు చేసినట్లు పైసాబజార్‌ సర్వేలో వెల్లడైంది. ఈ కొనుగోళ్లలో క్రెడిట్‌ కార్డు ఆఫర్లు కీలక భూమిక పోషించాయి.

ఈ సర్వేలో 2,300 మంది వినియోగదారుల క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లను విశ్లేషించారు. వారిలో 91 శాతం మంది క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్లకు అనుగుణంగా తమ షాపింగ్‌ చేయగా, 10 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఎటువంటి డిస్కౌంట్లూ లేకుండా షాపింగ్‌ చేసినట్లు వెల్లడించారు. 13 శాతం మంది తమ క్రెడిట్‌ కార్డులతో రూ.10 వేల్లోపు షాపింగ్‌ చేయగా.. 21 శాతం మంది రూ.10-25 వేల మధ్య కొనుగోళ్లు జరిపారు. రూ.25-50 వేల మధ్య 24 శాతం, రూ.50 వేలు నుంచి రూ.లక్ష మధ్య 22 శాతం మంది, రూ.లక్షకు మించి 20 శాతం మంది తమ క్రెడిట్‌ కార్డులతో ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

ఈ దీపావళి సీజన్‌లో హోమ్ అప్లయన్సెస్ (25%), మొబైల్స్ & యాక్సెసరీస్ (23%), దుస్తులపై (22%) ఎక్కువగా ఖర్చు చేశారు. ఫర్నిచర్ & హోమ్ డెకర్ (18%), బంగారం & ఆభరణాలు (12%) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం వినియోగదారుల కొనుగోలు ధోరణి మరింత ప్రీమియం, లైఫ్‌స్టైల్‌ ఆధారితంగా మారుతోందని పైసా బజార్‌ వెల్లడించింది.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఆధిపత్యం

అంతేకాక వినియోగదారులు ఎక్కువగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల్లో షాపింగ్‌ చేసేందుకు మొగ్గుచూపారని సర్వే నివేదిక తెలిపింది. దాదాపు 83 శాతం మంది అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలోనే ఉత్తమ ఆఫర్లు లభించాయని పేర్కొన్నారు. మొత్తం పండగ విక్రయాల్లో ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు కలిపి 43 శాతం మార్కెట్‌ వాటాను సొంతం చేసుకున్నాయి. 15 శాతం మార్కెట్‌ వాటాతో మింత్రా, 10 శాతంతో మీషో ఉన్నాయి. ఆజియో, నైకా, జెప్టో, టాటా క్లిక్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లు కలిపి 32 వాటాను కలిగి ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని