Emergency Loan: అత్యవసరంగా డబ్బు అవసరం పడినప్పుడు ఉన్న ఆప్షన్స్‌ ఏంటి?

చాలా మందికి అత్యవసరంగా నగదు అవసరం ఏర్పడొచ్చు. అలాంటప్పుడు మెరుగైన క్రెడిట్‌ స్కోరున్నా, కొన్ని కేటగిరీల ఆస్తులున్నా సరే వేగంగా రుణం పొందొచ్చు.

Published : 13 Feb 2024 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మందికి అనేక రకాల ఆస్తులుంటాయి. వీరికి అత్యవసరంగా విద్య, వైద్యం లేదా ఇతర ఖర్చులకు నగదు అవసరం పడినప్పుడు చేతిలో నగదు ఉండకపోవచ్చు. కొంతమందికి ఈ ఖర్చులు కొంతకాలం వరకే ఉండొచ్చు. ఇటువంటి సందర్భంలో వెంటనే గుర్తుకొచ్చేది వ్యక్తిగత రుణమే. ఈ రుణానికి మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఉన్నప్పుడే తక్కువ వడ్డీతో, వేగంగా రుణం లభించే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఆస్తులను పూచీకత్తుగా పెట్టి ఇతర రుణాలు పొందొచ్చు. అలాంటి తనఖా రుణాలు ఏమున్నాయ్‌? ఆ రుణాల వడ్డీ రేట్లు.. రుణాలకు సంబంధించి ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం.. 

ఎఫ్‌డీలపై రుణం

చాలామంది తమ జీవితంలో ఏదో ఒకసారి బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఖాతా తెరిచే ఉంటారు. డబ్బు అవసరం పడినప్పుడు బ్యాంకులో ఉన్న ఎఫ్‌డీని రద్దు చేయకుండానే దాన్ని పూచీకత్తుగా పెట్టి 70-95% వరకు రుణం తీసుకోవచ్చు. ఈ రుణంపై బ్యాంకులు సాధారణంగా ఎఫ్‌డీలపై ఇచ్చే వడ్డీ రేటు కంటే 1-2% అదనపు వడ్డీ వసూలు చేస్తాయి. ఉదాహరణకు బ్యాంకులు ఎఫ్‌డీలపై 7% వడ్డీ ఇస్తుంటే.. ఎఫ్‌డీ రుణాలపై 8-9% వరకు వడ్డీ రేటును వసూలు చేస్తాయి. ఎఫ్‌డీపై రుణం అనేది మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ వడ్డీ రుణాల్లో ఒకటి. అదనపు డాక్యుమెంటేషన్‌ లేకుండా రుణం వేగంగా లభిస్తుంది. క్రెడిట్‌ హిస్టరీతో పనిలేదు. మరో ముఖ్యమైన విషయం.. రుణం తీసుకున్నప్పటికీ డిపాజిట్‌పై వడ్డీ వస్తూనే ఉంటుంది. మైనర్‌ పేరుతో ఉన్న ఎఫ్‌డీలపై మాత్రం రుణం లభించదు. లోన్‌ డిఫాల్టయితే ఎఫ్‌డీ మొత్తాన్ని తీసుకుని బ్యాంక్‌ ఆ ఖాతాను మూసివేస్తుంది.

పీపీఎఫ్‌పై రుణం

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు గ‌ల పొదుపు ప‌థ‌కం. దీనిపై వ‌డ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. ఇది 15 ఏళ్ల దీర్ఘ‌కాల పొదుపు ప‌థ‌కం అయినప్పటికీ మెచ్యూరిటీ సమయానికి ముందే ఈ ఖాతాలో ఉన్న నిధిలో కొంత శాతం వరకు రుణంగా తీసుకోవచ్చు. ఖాతాదారులు ఖాతా తెరిచిన 3-6 సంవ‌త్స‌రాల మ‌ధ్య పీపీఎఫ్ ఖాతాపై రుణం పొందేందుకు అర్హులు. పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంపై 25% వ‌ర‌కు గ‌రిష్ఠంగా రుణం తీసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రేటు కన్నా 1% అదనంగా (ప్రస్తుతం 8.10%) వసూలు చేస్తారు. రుణం కాలవ్యవధి 3 ఏళ్లు.

బంగారంపై రుణం

ప్రస్తుతం బ్యాంకులు బంగారంపై రుణాలు ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. బ్యాంకుల వద్ద తాకట్టుగా బంగారం ఉంటుంది కాబట్టి, వీటిని సెక్యూర్డ్‌ లోన్స్‌గా భావిస్తాయి. రుణగ్రహీతలకు వేగంగా రుణం లభించడానికి ఈ రుణాలు మంచి మార్గం. ఈ రుణాలపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. చాలా బ్యాంకులు 8-9 శాతం నుంచి వడ్డీని వసూలు చేస్తున్నాయి. రుణం, బంగారం విలువపై 50-70% వరకు లభిస్తుంది. రుణగ్రహీతలు తాకట్టు పెట్టే బంగారం విలువను బట్టి రూ.20 వేల నుంచి రూ.1.50 కోట్ల వరకు రుణం పొందొచ్చు. రుణ మంజూరు కొన్ని నిమిషాలు/గంటల్లోనే అయిపోతుంది. డాక్యుమెంటేషన్‌ పని పెద్దగా ఉండదు. క్రెడిట్‌ స్కోరుతో పని లేదు. బ్యాంకుల నియమ నిబంధనలను బట్టి రుణాన్ని 3-5 సంవత్సరాల మధ్య సమయంలో తీర్చాల్సి ఉంటుంది. అలాకాని పక్షంలో బ్యాంకు బంగారాన్ని వేలం వేస్తుంది. బంగారం విలువ బాగా పడిపోయిన సందర్భంలో రుణ బకాయిని బట్టి బ్యాంకు అదనపు బంగారాన్ని కోరొచ్చు.

కారుపై రుణం

వివిధ బ్యాంకులు, రుణ సంస్థలు కారు హామీగా పెట్టుకుని రుణాలిస్తుంటాయి. మీ కారు నూతన మోడల్‌ అయ్యుండి.. అధిక రీసేల్‌ విలువ కలిగి ఉంటే నిబంధనల మేరకు మెరుగైన రుణం లభించే అవకాశం ఉంది. మరీ పాత మోడల్‌ కార్లకు రుణం లభించే అవకాశం ఉండదు. మీ క్రెడిట్‌ ప్రొఫైల్‌ను బట్టి కారు విలువపై 50-150% వరకు రుణం పొందొచ్చు. వడ్డీ రేటు 11-23% మధ్య ఉంటుంది. అనేక బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఫీజును వసూలు చేస్తున్నాయి. ఈ ఫీజులు బ్యాంకును బట్టి మారతాయి.

జీవిత బీమా పాలసీపై రుణం

జీవిత బీమా అనేది చాలా మందికి సుపరిచితమే. పాలసీ ఉన్నవారు ఎక్కడా రుణం దొరకని పక్షంలో బీమా సంస్థ వద్ద ఈ పాలసీ పట్టాను పూచీకత్తుగా పెట్టి రుణం తీసుకోవచ్చు. పాలసీ సరెండర్‌ విలువపై 85-90% వరకు రుణం లభిస్తోంది. బ్యాంకులు కూడా పాలసీని తాకట్టుగా పెట్టుకుని రుణం ఇస్తాయి. కానీ, ప్రాసెస్‌ సమయం ఎక్కువ. బీమా సంస్థలో మాత్రం ప్రాసెస్‌ వేగంగా అవుతుంది. రుణం చెల్లింపుల్లో డిఫాల్టయినప్పుడు.. రుణం, వడ్డీ కలిపి పాలసీ విలువను మించి ఉంటే.. పాలసీ రద్దు కావచ్చు.

స్థిరాస్తిపై రుణం

వివిధ స్థిరాస్తులను తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం అనేది చాలా కాలం నుంచి ఉన్నదే. వ్యక్తుల వద్ద రుణం తీసుకున్నప్పుడు వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, బ్యాంకుల వద్ద ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం మేలు. వీటిపై బ్యాంకులు 9.50% నుంచి వసూలు చేస్తాయి. బ్యాంకును బట్టి వడ్డీ రేట్లు మారతాయి. ఆస్తి విలువపై 50-60% వరకు రుణం పొందొచ్చు. ఈ రుణాలపై ఉన్న సౌలభ్యత ఏంటంటే క్రెడిట్‌ హిస్టరీతో పనుండదు. డాక్యుమెంటేషన్‌ విషయంలో లీగల్‌ వెరిఫికేషన్‌ ఎక్కువే ఉంటుంది. లోన్‌ ప్రాసెస్‌ దాదాపుగా ఇంటి రుణంతో పోలి ఉంటుంది. ఆస్తి ఉండే ప్రదేశాన్ని, దాని భౌతిక స్థితిని బట్టి రుణాన్ని ఇవ్వాలా? వద్దా? అని బ్యాంకులు నిర్ణయించుకుంటాయి. రుణగ్రహీతలు రుణాన్ని తిరిగి చెల్లించేటప్పుడు తరచూ డిఫాల్టవ్వకుండా చూసుకోవాలి. లేనిపక్షంలో బ్యాంకులు ఆస్తిని వేలం వేసే అవకాశముంది. ముందస్తు చెల్లింపులు జరిపినప్పుడు బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి.

మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లపై రుణం

మ్యూచువల్‌ ఫండ్లను, స్టాక్స్‌ను తాకట్టు పెట్టుకుని బ్యాంకులు రుణాలిస్తున్నాయి. బ్యాంకులు వీటి విలువపై 50% వరకు రుణాలిస్తాయి. రుణం తిరిగి చెల్లించే సమయంలో ఈ ఫండ్లు/స్టాక్స్‌పై వచ్చే డివిడెండ్‌ను పొందుతూ ఉండొచ్చు. అయితే, షేర్ల ధరల్లో, మ్యూచువల్‌ ఫండ్ల ఎన్‌ఏవీలో తగ్గుదల ఉన్నప్పుడు బ్యాంకు కొన్ని షేర్లను, మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను విక్రయించవచ్చు లేదా అదనపు షేర్లు/పెట్టుబడులను డిమాండ్‌ చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని