Credit Cards: క్రెడిట్‌ కార్డు..ఈ రుసుములు చూశారా?

అత్యవసరాల్లో కొనుగోళ్లు చేసేందుకు క్రెడిట్‌ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రయోజనాలు అధికమే.

Published : 31 May 2024 00:52 IST

అత్యవసరాల్లో కొనుగోళ్లు చేసేందుకు క్రెడిట్‌ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రయోజనాలు అధికమే. కానీ, ఇది విధించే రుసుముల సంగతి తెలుసుకోకుండా కార్డును వాడితే మాత్రం ఆర్థికంగా ఇబ్బంది తెచ్చుకున్నట్లే..

బ్యాంకులు అందించే ప్రతి సేవకూ కొంత రుసుము చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్‌ కార్డుల విషయమూ అంతే. మీరు కార్డు బిల్లును నిశితంగా పరిశీలించినప్పుడే ఈ రుసుములు, ఫీజుల సంగతి బయటపడుతుంది. క్రెడిట్‌ కార్డును తీసుకునే తొందరలో మనం కొన్ని ప్రాథమిక విషయాలను విస్మరిస్తుంటాం. ఇందులో ప్రధానంగా..

  • వార్షిక రుసుములు: క్రెడిట్‌ కార్డును ఇచ్చే క్రమంలో బ్యాంకులు చెప్పే మొదటి మాట.. ఎలాంటి వార్షిక రుసుములూ ఉండవని. కానీ, దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయన్న సంగతిని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు కార్డును ఏడాదిలో కనీసం ఇంత పరిమితి వరకూ వినియోగించాలనే నిబంధన ఉండొచ్చు. తక్కువగా వాడితే నిర్ణీత వార్షిక రుసుము తప్పదు. 
  • నగదు తీసుకుంటే: నగదు తీసుకునేందుకు క్రెడిట్‌ కార్డును వినియోగించుకోవచ్చు. కానీ, అధిక రుసుములు తప్పవు. ఇలా తీసుకున్నప్పుడు తక్షణమే వడ్డీ ప్రారంభమవుతుంది. నగదుపై 3 నుంచి 4 శాతం వరకూ ఇది ఉంటుంది. మరీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలి.
  • ఆలస్యమైతే: బిల్లు చెల్లింపులు ఎప్పుడూ గడువు లోపు పూర్తి చేయాలి. ఒక్క రోజు ఆలస్యం చేసినా జరిమానాలు తప్పకపోవచ్చు. ఆలస్యపు చెల్లింపు రుసుములను నివారించేందుకు గడువు తేదీకి ముందు కనీస మొత్తాన్ని చెల్లించడం మేలు. 
  • అధికంగా వినియోగిస్తే: కొన్నిసార్లు క్రెడిట్‌ కార్డులు పరిమితికి మించి అధికంగా వాడేందుకూ వెసులుబాటునిస్తాయి. దీనికి రూ.500-రూ.1,000 వరకూ రుసుము వసూలు చేస్తాయి. కొన్ని కార్డులు అధికంగా వినియోగించుకున్న మొత్తంపై 2-3 శాతం వరకూ నెలవారీ వడ్డీని వసూలు చేస్తాయి. తరచూ అధికంగా ఖర్చు చేస్తుంటే.. బ్యాంకును సంప్రదించి, మీ కార్డు పరిమితిని పెంచుకునేందుకు ప్రయత్నించండి.
  • విదేశీ లావాదేవీలు: విదేశీ కరెన్సీలో లేదా విదేశాల్లో చేసే చెల్లింపులపైనా 1.5-2.5 శాతం వరకూ రుసుములుంటాయి. కార్డు తీసుకునేటప్పుడే నిబంధనలను పూర్తి స్థాయిలో తెలుసుకుంటే, రుసుముల భారం లేకుండా చూసుకోవచ్చు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని