Foreign Education: విదేశీ విద్యా రుణాలు, వివిధ అంశాల గురించి తెలుసుకోండి?

విద్యార్థులు విదేశీ చదువుకు..రుణ సంస్థల నుంచి పొందే ఆర్థిక సహాయంతో పాటు కొన్ని ముఖ్యమైన ఇతర అంశాల గురించి తెలుసుకోవాలి, అవేంటో ఇక్కడ చూడండి.

Published : 05 Apr 2024 17:20 IST

నేడు చాలా మంది యువత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ఎదురు చూస్తున్నారు. విదేశాల్లో విద్యనభ్యసించడానికి ఖర్చు ఎక్కువే అవుతుంది. విదేశీ విద్యకు ఖర్చు గతంతో పోలిస్తే ఇప్పుడు బాగా పెరిగింది. ఈ కారణంగా చాలా మంది తల్లిదండ్రులు..పిల్లల విదేశీ విద్యను నెరవేర్చడంలో విఫలమవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ విద్యా రుణం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కలలను నెరవేర్చడానికి బ్యాంకులు కూడా వేగంగా రుణాలిస్తున్నాయి. అయితే, ఈ విద్యా రుణాల గురించి, అనేక ఇతర అంశాల గురించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనేక సందేహాలు ఉన్నాయి. కాబట్టి, విద్యార్థుల విదేశీ విద్యకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.

అంతర్జాతీయ కోర్సులు

చాలా మంది విద్యార్థులకు అన్ని అంతర్జాతీయ కోర్సులకు విద్యా రుణం లభిస్తుందా అనేది సందేహాం. దాదాపుగా అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు విదేశీ విద్యా కలలను సాధించాలని ఆకాంక్షించే విద్యార్థుల కోసం అనేక రకాల విద్యా ఫైనాన్సింగ్‌ పరిష్కారాలను రూపొందించాయి. ఈ రుణాల పరిధి..సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ వంటి సంప్రదాయ కోర్సులకు మాత్రమే పరిమితం కాకుండా..ఏవియేషన్‌, ఫిల్మ్‌ మేకింగ్‌, సౌండ్‌ ఇంజనీరింగ్‌ వంటి సంప్రదాయేతర రంగాలకు కూడా విస్తరించాయి. ఇంకా కొన్ని రుణ సంస్థలు ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ, వొకేషనల్‌, స్కిల్లింగ్‌, అప్‌స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్స్‌ కోసం కూడా విద్యా రుణాలను అందిస్తున్నాయి.

విశ్వవిద్యాలయాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ విశ్వవిద్యాలయంలోనైనా చదువుకోవడానికి విద్యారుణం పొందవచ్చా, లేదా అని తెలుసుకోవడం కూడా చాలా అవసరం. అయితే, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుఉన్న ఏ విశ్వవిద్యాలయాలలోనైనా నాణ్యమైన విద్యను ఇబ్బందులు లేకుండా చదువుకోవడానికి విద్యా రుణాలు అందుబాటులో ఉన్నాయని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు చెబుతున్నాయి. రుణ సంస్థలు..విద్యార్థుల విద్యాపరమైన ఆకాంక్షలకు ఆటంకం లేకుండా రుణ సహాయం చేస్తున్నాయి. ట్యూషన్‌ ఫీజులు, వసతి, ప్రయాణ ఖర్చులు, అభ్యాస పరికరాల ఖర్చు, జీవన వ్యయాలు, ఇతర విద్యా సంబంధిత ఖర్చులను విద్యా రుణంలో భాగంగా రుణ సంస్థలు కవర్‌ చేస్తున్నాయి.

వడ్డీ రేట్లు

ఈ విద్యా రుణాలకై వడ్డీ రేట్లు..బేస్‌ రేటు, స్ప్రెడ్‌ రేటు అనే రెండువిధాలుగా ఉంటాయి. బేస్‌ రేటును రుణ సంస్థలు ముందుగా నిర్ణయిస్తాయి, ఇవి బ్యాంకును బట్టి కూడా మారతాయి. స్ప్రెడ్‌ రేటు రుణ కాలవ్యవధిలో మార్కెట్‌ కదలికలను బట్టి మారతాయి. కాబట్టి, దీన్ని వేరియబుల్‌ వడ్డీ రేటు అని కూడా అంటారు. ఈ వడ్డీ రేట్లు..విద్యార్థి ఎంచుకున్న దేశం, విశ్వవిద్యాలయం, కోర్సు, కోరిన రుణ మొత్తం, రుణ రకం, ఎంచుకున్న రుణ కాలవ్యవధి, సహ-రుణగ్రహీత రుణ చెల్లింపుల చరిత్ర వంటి బహుళ అంశాల ఆధారంగా మారవచ్చు. ఇంకా నిర్దిష్ట రుణానికి వడ్డీ రేటును నిర్ణయించే ముందు ఆర్థిక సంస్థలు వివిధ అంశాలను అంచనా వేస్తాయి. విద్యార్థికి సంబంధించిన భవిష్యత్తు ఉపాధి సామర్థ్యాన్ని నిర్ణయించడానికి విశ్వవిద్యాలయ చరిత్ర, విద్యార్థి అకడమిక్‌ స్కోర్లు, ప్రవేశ పరీక్ష స్కోర్లు వంటి వాటిని చూస్తాయి. అలాగే, చాలామంది విద్యార్థులు కేవలం వడ్డీ రేట్ల ఆధారంగా రుణ సంస్థలను షార్ట్‌ లిస్ట్‌ చేయడంలో సాధారణ తప్పులు చేస్తుంటారు. కానీ, రుణసంస్థల అంక్షలు, 100% ఫైనాన్సింగ్‌, కస్టమర్‌ సర్వీస్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా విద్యార్థులు మెరుగైనా రుణ సంస్థను ఎంచుకోవచ్చు.

తల్లిదండ్రుల పాత్ర

విదేశీ విద్యా రుణాలు తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకం. పిల్లల విద్యా ప్రణాళికాలో వారు ఎప్పుడూ భాగంగానే ఉంటారు. పిల్లలను మొదటి నుంచి అర్ధం చేసుకుని, సరైన గైడెన్స్‌ ఇవ్వడమే కాకుండా, సహ-రుణగ్రహీతలుగా సహ సంతకం చేయడం ద్వారా రుణ దరఖాస్తు ప్రక్రియలో చురుకుగా వ్యవహరిస్తారు. ఇది రుణ దరఖాస్తుకు సంబంధించిన మొత్తం క్రెడిట్‌ యోగ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పిల్లల విద్యా రుణానికి..తల్లిదండ్రుల ఆస్తి లేదా ఎఫ్‌డీలు వంటి అవసరమైన పూచీకత్తును తాకట్టు పెట్టి సురక్షిత రుణం కోసం దరఖాస్తు చేయోచ్చు. వారి ఆర్థిక సహాయం, నిబద్ధత, రుణం గురించిన పరిజ్ఞానం..పిల్లల విదేశీ చదువుల కోసం విద్యా రుణాన్ని విజయవంతంగా పొందేందుకు ఎంతగానో దోహదపడతాయి.

రుణ చెల్లింపులు

విద్యా రుణాలను ఎంచుకునే విద్యార్థులు రుణాన్ని తప్పనిసరిగా తిరిగి చెల్లించే అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్థిక క్రమశిక్షణను సరిగ్గా నిర్వహించడం ద్వారా ఈఎంఐలను సరైనా సమయానికే చెల్లించొచ్చు. దీనివల్ల మెరుగైన క్రెడిట్‌ స్కోరు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థికి రుణం చెల్లించడానికి గ్రేస్‌ పీరియడ్‌ వెసులుబాటు ఉన్నప్పటికీ..ఈ సమయంలో తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించడం ఉత్తమం. దీనివల్ల రుణ బకాయిలు పేరుకుపోకుండా ఉంటాయి. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో విద్యా రుణ చెల్లింపును కొనసాగించడానికి విద్యార్థులు తప్పనిసరిగా కొంత నిధిని పక్కన పెట్టాలి.

అడ్మిషన్‌ లెటర్‌, వీసా

అంతర్జాతీయ విద్య కోసం రుణం పొందే ప్రక్రియ..సాధారణంగా విదేశీ విశ్వవిద్యాలయం నుంచి అడ్మిషన్‌ లెటర్‌, వీసా సిద్ధంగా ఉందో లేదో అనే దానితో సంబంధం లేకుండా ముఖ్యమైన దశలలో ప్రారంభమవుతుంది. ముందుగా విద్యార్థి తన ఆర్థిక అవసరాలను తీర్చగల ఆర్థిక సంస్థను గుర్తించడానికి సమగ్ర పరిశోధన చేయాలి. విద్యార్థులు ఫైనాన్షియర్‌ వెబ్‌సైట్‌ లేదా ఆ శాఖ కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకుకు సంబంధించిన విద్యా రుణ కన్సల్టెంట్‌తో మాట్లాడిన తర్వాత, విద్యార్థులు అవసరమైన పత్రాలను అందించాలి. విద్యార్థికి సంబంధించిన అన్ని అర్హతలు రుణానికి నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే బ్యాంకులు విద్యా రుణాన్ని మంజూరుజేస్తాయి. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు వీసా అవసరం పడుతుంది. కానీ, రుణ దరఖాస్తు ప్రారంభంలో ఇది తప్పనిసరి కాదు. విద్యా రుణ పంపిణీకి ముందు విదేశీ విశ్వవిద్యాలయం నుంచి అడ్మిషన్‌ లెటర్‌ అవసరం. ఈ అడ్మిషన్‌ లెటర్‌ రుణం త్వరగా పొందేందుకు విలువైన పత్రంలా పనిచేస్తుంది. ఇది విద్యార్థి కోర్సు వివరాలతో పాటు రుణ మొత్తాన్ని అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది. విద్యార్థి విదేశాల్లో చదువుకోవడానికి అవసరమైన నిధులను వారి ఖాతాలో చూపినప్పుడు మాత్రమే ఆయా దేశాలు వీసాను జారీ చేస్తాయి.

రుణ పంపిణీ

విదేశీ విద్యకు రుణం చాలా అవసరం కాబట్టి, ఇది 2-3 సంవత్సరాల కోర్సుకు ఒకేసారి మంజూరు చేస్తారా, కోర్సు సెమిస్టర్స్‌ను బట్టి దశలవారీగా మంజూరు చేస్తారా అనేది తెలుసుకోవాలి. రుణానికి దరఖాస్తు చేసినప్పుడు విద్యార్థి తన ప్రొఫైల్‌తో పాటు ముఖ్యమైన అన్ని పత్రాలను బ్యాంకుకు సమర్పించాలి. అన్ని పత్రాలు నిర్ణీత ప్రమాణాల మేరకు పూర్తి చేసిన తర్వాత, రుణం మంజూరవుతుంది. కళాశాల/విశ్వవిద్యాలయం అవసరాలకు అనుగుణంగా..బ్యాంకులు రుణాన్ని విడతల వారీగా భారతీయ కరెన్సీలో పంపిణీ చేస్తాయి. ఒక విద్యార్థి విదేశాల్లో చదువుకోవడానికి, ఉండేందుకు అవసరమైన నిధులు వారి బ్యాంకు ఖాతాలో చూపినప్పుడు మాత్రమే కొన్ని ఎంబసీలు వీసా జారీ చేస్తాయి. రుణం పొందడం అంటే విదేశంలో చదువుకోవడానికి తాత్కాలికంగా హక్కును కలిగి ఉండడమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు