నెలకు రూ.8 వేలతో రూ.5 కోట్లు

నా వయసు 34. ప్రైవేటు ఉద్యోగిని. ఆరేళ్ల మా అమ్మాయి భవిష్యత్‌ కోసం నెలకు రూ.15 వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచన. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? 

Updated : 01 Dec 2023 10:52 IST

 

నా వయసు 34. ప్రైవేటు ఉద్యోగిని. ఆరేళ్ల మా అమ్మాయి భవిష్యత్‌ కోసం నెలకు రూ.15 వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచన. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?  

 రాజేశ్‌

ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. ఇందుకోసం మీ పేరుపైన టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.15వేలలో రూ.5వేలను సుకన్య సమృద్ధి పథకంలో జమ చేయండి. రూ.10వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో పెట్టుబడి పెట్టండి. ఇలా మీరు 12 ఏళ్లపాటు కొనసాగిస్తే.. దాదాపు 11 శాతం సగటు వార్షిక రాబడి అంచనాతో.. రూ.40,88,373 అయ్యేందుకు అవకాశం ఉంది.


 మా నాన్న పేరుమీద రూ.14 లక్షల వరకూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేద్దామని అనుకుంటున్నాం. ఆరు నెలలకోసారి వడ్డీని వెనక్కి తీసుకునేలా ఏర్పాటు చేయొచ్చా? వేరే పథకాలేమైనా ఉన్నాయా?      

సౌమ్య
ప్రస్తుతం బ్యాంకులో వడ్డీ రేట్లు బాగున్నాయి. మీకు ఆరు నెలలకోసారి వడ్డీ కావాలంటే.. నాన్‌ క్యుములేటివ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయండి. దీనికి ప్రత్యామ్నాయంగా పోస్టాఫీసులో సీనియర్‌ సిటిజెన్‌ సేవింగ్‌ స్కీంనూ పరిశీలించవచ్చు. ఇందులో 8.2 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే ఇందులో కాస్త అధికంగా వడ్డీ వస్తోంది. ఇందులో మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. అయిదేళ్లపాటు దీన్ని కొనసాగించుకోవచ్చు. తర్వాత వీలును బట్టి, పెంచుకోవచ్చు.


మ్యూచువల్‌ ఫండ్లలో రూ.20 లక్షలు ఒకేసారి మదుపు చేసి, నెలకు రూ.20వేల వరకూ తీసుకోవచ్చా? దీనివల్ల ఏమైనా నష్టం ఉంటుందా?

గిరి
రూ.20లక్షలు పెట్టుబడి పెట్టి, నెలకు రూ.20వేలు తీసుకోవాలంటే.. పెట్టుబడిపై దాదాపు 12 శాతం రాబడి అందాలి. అప్పుడే మీ పెట్టుబడి తగ్గకుండా ఉంటుంది. ఇక డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 7 నుంచి 7.5 శాతం వరకూ రాబడిని అందిస్తున్నాయి. మీరు 12 శాతం రాబడిని అందుకోవాలని కచ్చితంగా అనుకుంటే.. మీ పెట్టుబడి క్షీణిస్తుంది. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తాన్ని బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసి, క్రమానుగత విత్‌డ్రాయల్‌ పద్ధతిలో నెలనెలా డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. నెలకు రూ.20వేలు కాకుండా, రూ.16 వేల వరకూ తీసుకునే ప్రయత్నం చేయండి. పెట్టుబడి పెట్టిన రెండేళ్ల తర్వాత ఇలా తీసుకుంటే ఇంకా మంచిది.


నాకు స్థిరంగా ఆదాయం ఉండదు. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా కొంత మొత్తాన్ని మదుపు చేద్దామని అనుకుంటున్నాను. దీనికోసం షేర్లను ఎంచుకోవచ్చా?      

ప్రదీప్‌
షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టాలంటే.. స్టాక్‌ మార్కెట్‌పై సరైన అవగాహన ఉండాలి. షేర్లను ఎప్పుడు కొనాలి, ఏ ధరకు అమ్మాలి అనే విషయాలు తెలిసి ఉండాలి. మార్కెట్‌ హెచ్చుతగ్గుల్ని గమనిస్తూ ఉండాలి. దీనికి బదులు మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కాకుండా.. ఒక చోట జమ చేసి, దాన్ని నెలనెలా మదుపు చేసేలా ప్రణాళిక వేసుకోండి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలకు ఆస్కారం ఉంటుంది.

తుమ్మ బాల్‌రాజ్‌


ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నా వయసు 23. వేతనం రూ.28వేలు. ఇందులో నుంచి రూ.8 వేల వరకూ మదుపు చేయాలని అనుకుంటున్నాను. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి?         

సుధీర్‌

చిన్న వయసులో ఉన్నారు కాబట్టి, మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ లభిస్తుంది. అదే విధంగా ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోండి. మీ ఆరు నెలల ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా జమ చేసుకోండి. ఆ తర్వాతే పెట్టుబడి గురించి ఆలోచించండి. మీరు దీర్ఘకాలంపాటు పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టండి. మీకు 60 ఏళ్లు వచ్చే వరకూ అంటే దాదాపు 37 ఏళ్ల పాటు నెలకు రూ.8వేల చొప్పున క్రమం తప్పకుండా మదుపు చేస్తే.. 12 శాతం వార్షిక సగటు రాబడి అంచనాతో.. రూ.5,21,85,474 అయ్యేందుకు అవకాశం ఉంది. తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టినా.. దీర్ఘకాలం కొనసాగిస్తే.. అధిక మొత్తంలో జమ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని