Credit Card: కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు లాభమేనా?

చేతిలో డబ్బు అవసరం లేదు.. నచ్చిన వస్తువును క్షణాల్లో కొనొచ్చు.. క్రెడిట్‌ కార్డు ఉంటే ఇదంతా సాధ్యమే. ఇప్పుడు పరిస్థితులు మరీ మారిపోయాయి.

Updated : 12 Jan 2024 07:41 IST

చేతిలో డబ్బు అవసరం లేదు.. నచ్చిన వస్తువును క్షణాల్లో కొనొచ్చు.. క్రెడిట్‌ కార్డు ఉంటే ఇదంతా సాధ్యమే. ఇప్పుడు పరిస్థితులు మరీ మారిపోయాయి. బ్రాండ్లంటే ఇష్టం ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని, కార్డులు ప్రత్యేకంగా వస్తున్నాయి. కొత్త భారతంలో మారుతున్న ప్రజల అవసరాలకు తగ్గట్లుగా క్రెడిట్‌ కార్డు సంస్థలూ వినూత్న ఆవిష్కరణలతో వస్తున్నాయి. ఆకర్షణీయమైన రాయితీలను తీసుకొస్తున్నాయి. గతంతో పోలిస్తే.. వ్యక్తిగత అవసరాలకూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే కో-బ్రాండెడ్‌ కార్డులు ఇప్పుడు ఎంతో ఆదరణ పొంతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని ఎంచుకోవడం వల్ల లాభాలేమిటి? తీసుకునేటప్పుడు చూడాల్సిన అంశాలేమిటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

న దేశంలో దాదాపు 9.4 కోట్ల క్రియాశీల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి ఈ సంఖ్య వేగంగా పెరుగుతూనే ఉంది. కార్డులతోపాటు, అవి అందిస్తున్న ప్రయోజనాలూ మారుతూనే ఉన్నాయి. క్రెడిట్‌ కార్డు వినియోగదారులూ, బ్రాండ్ల మధ్య ఒక బలమైన వ్యాపార భాగస్వామ్యాన్ని సృష్టించేందుకు కో-బ్రాండ్‌ కార్డులు దోహదం చేస్తాయి. జీవనశైలి ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రత్యేకమైన రాయితీలు, ప్రయోజనాలూ కోరుకునే వారికి ఇప్పుడు ఇవి తప్పనిసరి ఎంపికగా మారిపోయాయి. మీరూ కొత్తగా కో-బ్రాండెడ్‌ కార్డు కోసం చూస్తుంటే.. వీటిని సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.

అవసరాల మేరకు..

కో-బ్రాండెడ్‌ కార్డుల ప్రధాన ప్రయోజనాల్లో రివార్డులు అందించడం ఒకటి. ప్రధానంగా తమతో ఒప్పందం ఉన్న బ్రాండ్లకే ఇవి పరిమితం చేస్తాయి కార్డు సంస్థలు. ఉదాహరణకు ఒక కార్డు సంస్థ ఒక విమానయాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అనుకుందాం. ఆ విమాన సంస్థ టిక్కెట్లు బుకింగ్‌ చేసుకున్నప్పుడే రాయితీలు, ఇతర ప్రయోజనాలూ అందుతాయి. కొన్ని రిటైల్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. అక్కడ కొనుగోళ్లు చేసినప్పుడే నిర్ణీత ప్రయోజనాలు అందిస్తాయి. కాబట్టి, మీ అవసరాలేమిటి? వాటికి అనుగుణంగా ఉన్న కార్డు ఏమిటి? అనేది చూసుకోవాలి. దాన్ని ఎంత తరచుగా మీరు ఉపయోగిస్తారు అన్నదీ ఇక్కడ కీలకమే. కొన్ని కార్డులు వినియోగదారులకు ప్రత్యేక సేవలనూ అందిస్తుంటాయి. వీటినీ గమనించాలి.

రాయితీలు..

కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను తీసుకున్నప్పుడు తొలి ఏడాదిలో ఎలాంటి వార్షిక రుసుములు వసూలు చేయవు. నో-కాస్ట్‌ ఈఎంఐ లేదా గణనీయమైన రాయితీలను అందిస్తుంటాయి. అదనంగా భాగస్వామ్యం ఉన్న బ్రాండ్ల కొనుగోళ్లకు ప్రత్యేకమైన తగ్గింపులు, నగదు వెనక్కిలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుంటాయి. ఇతర సంస్థల ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి ఖర్చులుంటాయి అనేది చూసుకోవడం తప్పనిసరి.

సరైన కార్డునే..

సాధారణ క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే ఈ తరహా కార్డులు అందించే ప్రయోజనాలు కాస్త అధికంగానే ఉంటాయి. అయినప్పటికీ వీటిని ఎంచుకునేటప్పుడు ప్రధానంగా కొన్ని అంశాలను పరిశీలించాలి..

  • ఖర్చు అలవాట్లు: మీ జీవనశైలికి అనుగుణంగా కార్డు ఉందా లేదా చూసుకోండి. మీ సాధారణ ఖర్చులను విశ్లేషించండి. మీరు తరచూ ప్రయాణించే వారైతే.. విమానయాన సంస్థలు, హోటళ్లు అందించే కో-బ్రాండెడ్‌ కార్డులు ప్రయోజనకరంగా ఉంటాయి. లేదా హోటళ్లు, విమాన టిక్కెట్లు బుకింగ్‌ చేసుకునే సంస్థలతో ఒప్పందం ఉన్న కార్డులనూ తీసుకోవచ్చు. మీరు ఎప్పుడూ ఒకే రిటైల్‌ మాల్‌లో కొనుగోళ్లు చేస్తున్నారనుకోండి. ఆయా సంస్థల కో-బ్రాండెడ్‌ కార్డులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • రివార్డులు: కార్డును వాడిన ప్రతి సందర్భంలోనూ రివార్డు పాయింట్లు జమ అయ్యేలా ఉండాలి. సంపాదించిన పాయింట్లను సమయానుకూలంగా వినియోగించుకోవాలి. దీనివల్ల మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది.
  • రుసుములు: రివార్డులు, ఇతర ప్రయోజనాలకు మించి చూడాల్సిన మరో విషయం వార్షిక రుసుము ఎలా విధిస్తారనే విషయాన్ని. విదేశీ లావాదేవీలకు ఎలాంటి ఫీజులను వసూలు చేస్తున్నారన్నదీ పరిశీలించాలి. నెలవారీ బిల్లులను పూర్తిగా కాకుండా, కనీస మొత్తం చెల్లిస్తే.. మిగతా మొత్తానికి విధించే వడ్డీ రేట్లనూ చూసుకోవాలి.
  • అదనపు ప్రోత్సాహకాలు: ప్రయాణ బీమా, కొనుగోళ్లకు రక్షణ, మోసపోయినప్పుడు కార్డుదారుడి బాధ్యత వంటి అదనపు ప్రోత్సాహకాలను చూడాలి. క్రెడిట్‌ కార్డు అందిస్తున్న సంస్థ, ఒప్పందం కుదుర్చుకున్న బ్రాండు.. ఈ రెండింటినీ పరిశీలించాలి. బలమైన బ్రాండ్లతో అనుబంధం ఉన్న కార్డులను ఎంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే అవి మీకు గరిష్ఠంగా ఉపయోగపడతాయి. పరిమిత ప్రయోజనాలు అందిస్తూ, అధిక రుసుములను వసూలు చేసే కార్డులకు దూరంగా ఉండాలి. బిల్లులను ఎప్పటికప్పుడు తీర్చేయాలి. లేకపోతే క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కార్డులను వాడేటప్పుడు వ్యయ నిష్పత్తి తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని