అప్పు తీసుకుంటున్నారా?

ఆర్థిక అత్యవసరాల్లో అప్పు తీసుకోవడం సర్వసాధారణం. ఇల్లు, కారు, వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది రుణాలు తీసుకుంటారు.

Updated : 19 Jan 2024 10:29 IST

ఆర్థిక అత్యవసరాల్లో అప్పు తీసుకోవడం సర్వసాధారణం. ఇల్లు, కారు, వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది రుణాలు తీసుకుంటారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తేలిగ్గానే అప్పు లభిస్తున్నప్పటికీ కాస్త జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలను ముందుగా తెలుసుకున్నాకే రుణం తీసుకునేందుకు ముందడుగు వేయాలి.

రుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు మీ తిరిగి చెల్లించే సామర్థ్యం గురించి పూర్తి అంచనా వేసుకోవాలి. మీ ప్రస్తుత ఆదాయం, స్థిరంగా ఉండే ఖర్చులు, బాధ్యతల ఆధారంగా రుణ వాయిదాల్ని చెల్లించే శక్తిని అంచనా వేయొచ్చు. సాధారణంగా నికర ఆదాయంలో ఖర్చులు దాదాపు 40-50 శాతం వరకూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు రుణదాతలు మీ దరఖాస్తును వేగంగా ఆమోదించే అవకాశాలున్నాయి. కాబట్టి, రుణం తీసుకునే ముందు మీ ఖర్చులు 40 శాతానికి మించకుండా ఉండేలా చూసుకోవాలి.

750కి మించితేనే.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణ దరఖాస్తును పరిశీలించేటప్పుడు రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరు, నివేదికను పరిగణనలోకి తీసుకుంటాయి. మీ క్రెడిట్‌ రిపోర్టులో క్రెడిట్‌ స్కోరు, రుణం తిరిగి చెల్లింపు చరిత్ర, ఇప్పటికే కొనసాగుతున్న రుణ ఖాతాలు, పొదుపు ఖాతాల గురించి సమాచారం ఉంటుంది. రుణం తీసుకోబోయే ముందు సొంతంగానే క్రెడిట్‌ స్కోరును చూసుకోవాలి. ఇప్పుడు చాలా సంస్థలు నెలవారీ క్రెడిట్‌ రిపోర్టును ఉచితంగానే అందిస్తున్నాయి. ఎలాంటి క్రెడిట్‌ చరిత్ర లేని వారు.. క్రెడిట్‌ కార్డును తీసుకోవడం ద్వారా దాన్ని నిర్మించుకోవచ్చు. రెండు మూడేళ్లపాటు బిల్లు చెల్లింపులు సరిగ్గా చేస్తే మంచి స్కోరును సాధించవచ్చు.

ఇవి పరిశీలించండి...

ఏ అవసరం కోసం రుణం తీసుకుంటున్నారు అన్నది ముఖ్యం. ఇల్లు కొనుగోలు, వాహనం, వ్యక్తిగత రుణం ఇందులో ఏది తీసుకుంటున్నారు, దానికి ఏ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను సంప్రదించడం మంచిది అనే విషయంలో కొంత అవగాహన ఉండాలి. అప్పుడే సరైన చోట నుంచి రుణం తీసుకునేందుకు వీలవుతుంది. చాలామంది గృహరుణం తీసుకునేటప్పుడు బ్యాంకులను మాత్రమే పరిశీలిస్తుంటారు. కొన్నిసార్లు గృహరుణ సంస్థలూ, బ్యాంకింగేతర రుణ సంస్థలు మంచి ప్రయోజనాలతో రుణం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఒకసారి అన్ని అవకాశాలను పూర్తిగా తెలుసుకోవడం మంచిది.
చాలామంది రుణగ్రహీతలు తమకు అవసరమైన దానికంటే ఎక్కువ రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. అవసరం మేరకే రుణాన్ని తీసుకోవడం మంచిది. రుణం తీసుకున్నపుడు వడ్డీ భారం ఉంటుంది. ఏ లక్ష్యం లేకుండా అప్పు తీసుకుంటే వడ్డీ భారం తప్ప ప్రయోజనం ఉండదు.


ముందుగానే...

బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ తమ విచక్షణ మేరకు ఒక వ్యక్తికి ఎంత రుణం ఇవ్వాలనేది నిర్ణయిస్తాయి. సాధారణంగా వయసు, నెలకు నికర ఆదాయం, ప్రస్తుతం ఉంటున్న నివాసం వివరాలు ఉంటాయి. మీరు సంప్రదించే బ్యాంకు ఎలాంటి షరతులతో రుణం ఇస్తుందన్నది ముందు తెలుసుకోవాలి. లేకపోతే దరఖాస్తు చేసిన, తర్వాత అర్హత సరిపోలేదు అని తిరస్కరించే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చాలా బ్యాంకులు ఆన్‌లైన్‌లోనే రుణాన్ని ముందుగానే మంజూరు చేస్తున్నాయి. మీ బ్యాంకు నుంచి ఇలాంటి సౌకర్యం ఉందా అనేది తెలుసుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని