కొత్తగా అప్పు తీసుకుంటున్నారా?

వ్యక్తిగత ఆర్థిక రంగంలో ఎన్నో కీలక మార్పులు వస్తున్నాయి. ఫలితంగా ఎంతో మంది కొత్తవారు రుణాల వ్యవస్థలో భాగం అవుతున్నారు. తక్షణమే అందుతున్న వ్యక్తిగత రుణాలు చాలామందికి ఆర్థిక భరోసానిస్తున్నాయి.

Published : 26 Jan 2024 00:28 IST

వ్యక్తిగత ఆర్థిక రంగంలో ఎన్నో కీలక మార్పులు వస్తున్నాయి. ఫలితంగా ఎంతో మంది కొత్తవారు రుణాల వ్యవస్థలో భాగం అవుతున్నారు. తక్షణమే అందుతున్న వ్యక్తిగత రుణాలు చాలామందికి ఆర్థిక భరోసానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రుణ మార్కెట్లోకి అడుగు పెడుతున్న వారు (న్యూ టు క్రెడిట్‌).. కొన్ని విషయాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అవేమిటో తెలుసుకుందాం.

వ్యక్తిగత రుణం, క్రెడిట్‌ కార్డు.. ఏదైనా సరే.. కొత్తగా తీసుకునేటప్పుడు వాటిపై కొంత అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నించాలి. క్రెడిట్‌ స్కోరు, వడ్డీ రేటు, తిరిగి చెల్లించే విధానం, విధించే జరిమానాలు, రుసుముల్లాంటి ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోండి. అందుబాటులో ఉన్న విభిన్న రకాల రుణాల గురించి విస్తృతంగా తెలుసుకోండి. వాటి ప్రయోజనాలు, క్రెడిట్‌ స్కోరుపై చూపించే ప్రభావాన్ని విశ్లేషించండి. ఆర్థిక సమాచారాన్ని అందించే పత్రికలను చదవడం అలవాటు చేసుకోండి. ఆన్‌లైన్‌లోనూ పేరున్న వెబ్‌సైట్లను మాత్రమే చూడాలి. మీకు పూర్తి విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడే సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు.

బలమైన స్కోరుతో..

బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణం ఇచ్చేటప్పుడు అతని అర్హతలను తెలుసుకునేందుకు ప్రధానంగా క్రెడిట్‌ నివేదికలు, స్కోరుపై ఆధారపడతాయి. కొత్తగా రుణాలను తీసుకునే వారికి ఈ చరిత్ర, స్కోరు ఉండకపోవచ్చు. కానీ, దీన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రాథమిక స్థాయిలో తక్కువ పరిమితితో క్రెడిట్‌ కార్డులను తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. వినియోగ వస్తువుల కొనుగోలు కోసం చిన్న రుణాలను తీసుకోవచ్చు. బిల్లు, వాయిదాలు సకాలంలో చెల్లించడం ద్వారా మంచి రుణ చరిత్రను నిర్మించుకోవచ్చు. భవిష్యత్తులో పెద్ద రుణాలు తీసుకునేందుకు ఇది పునాదిగా ఉపయోగపడుతుంది. స్కోరు పెరుగుతున్న కొద్దీ రకరకాల రుణాలు మీకు అందుబాటులోకి వస్తుంటాయి.  

బాధ్యతగా..

కొత్తగా రుణం తీసుకునే వారు ఎంత మేరకు రుణం తీసుకోవాలన్న విషయంలో గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటారు. అవసరానికి మించి బ్యాంకులు రుణం ఇస్తామని అంటాయి. చాలా సందర్భాల్లో కొత్త రుణగ్రహీతలు తమకు అవసరం లేకపోయినా అధిక రుణాన్ని తీసుకుంటుంటారు. అనవసరంగా వడ్డీ భారం మోస్తుంటారు. ఆ నిధులను సక్రమంగా వినియోగించకపోతే అదనపు ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే. కాబట్టి, రుణం తీసుకునేటప్పుడు కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఆదాయం, నెలవారీ ఖర్చులతో సమగ్ర బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. ఎంత మేరకు ఈఎంఐ చెల్లించడం మీకు సౌకర్యంగా ఉంటుందో చూసుకోండి. అధికంగా రుణం తీసుకుంటే మీ ఆదాయ-వ్యయాల నిష్పత్తిని అది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అధిక రుణం అందుబాటులో ఉన్నప్పటికీ.. అవసరం మేరకే తీసుకోవడం మేలు.

తనిఖీ చేసుకోండి..

ఆర్థిక ప్రయాణంలో క్రెడిట్‌ స్కోరు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చాలా ముఖ్యం. క్రెడిట్‌ స్కోరులో ఏమైనా వ్యత్యాసాలుంటే గుర్తించడం సులభమవుతుంది. మోసపూరిత, అనధికార రుణాలున్నా తెలుసుకోవచ్చు. వెంటనే వాటిపై ఫిర్యాదు చేసి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయొచ్చు. క్రెడిట్‌ బ్యూరో వెబ్‌సైట్లలో మీ క్రెడిట్‌ నివేదికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవచ్చు. కొన్ని క్రెడిట్‌ బ్యూరోలు వాట్సాప్‌లోనూ క్రమం తప్పకుండా నివేదికలను పంపిస్తున్నాయి. ఆరోగ్యకరమైన క్రెడిట్‌ స్కోరున్నప్పుడు వడ్డీ రేట్ల విషయంలో బేరమాడేందుకు అవకాశం కల్పిస్తుంది. సంపాదన ప్రారంభమైన తర్వాత కొత్తగా రుణం తీసుకోవడం చాలా కష్టమైన పనిగా అనిపిస్తుంది. కానీ, అవగాహన పెంచుకుంటే సులభంగా రుణం తీసుకునేందుకు మార్గాలు తెలుస్తాయి. పూర్తి సమాచారంతో నిర్ణయాలు తీసుకోవాలి. గుర్తుంచుకోండి.. ఆర్థిక ప్రయాణంలో రుణాలు ఎంతో కీలకం. అప్పు తీసుకునేటప్పుడు తొందరపడ్డా, చిన్న పొరపాటు చేసినా అధిక వడ్డీ భారం మోయాల్సిందే. సకాలంలో వాయిదాలు చెల్లించకపోతే భవిష్యత్తులో కొత్త అప్పులు తీసుకోవడమూ కష్టంగా మారుతుంది.

సాయికృష్ణన్‌ శ్రీనివాసన్‌, ఎండీ, ఎక్స్‌పీరియన్‌ క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని