కార్పొరేట్‌ బాండ్లు ఎంచుకోండి జాగ్రత్తగా

మన దేశంలో అత్యంత సురక్షితమైన, ప్రజాదరణ పొందిన పొదుపు పథకాల్లో బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) ముందుంటాయి. నిర్ణీత కాలానికి, స్థిరమైన వడ్డీని అందించే వీటిని చాలామంది ఇష్టపడతారు.

Published : 23 Feb 2024 00:40 IST

మన దేశంలో అత్యంత సురక్షితమైన, ప్రజాదరణ పొందిన పొదుపు పథకాల్లో బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) ముందుంటాయి. నిర్ణీత కాలానికి, స్థిరమైన వడ్డీని అందించే వీటిని చాలామంది ఇష్టపడతారు. ప్రస్తుతం అధిక వడ్డీ రేట్ల కారణంగా ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి. వీటిలోనూ కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కాస్త అధిక వడ్డీ రేటును అందిస్తూ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

కొంత కాలంగా బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 7-8 శాతంగా ఉన్నాయి. కొన్ని బ్యాంకులు 8.5 శాతం వరకూ వడ్డీనిస్తున్నాయి. దీనికి భిన్నంగా కార్పొరేట్‌ ఎఫ్‌డీలు 9 శాతం వరకూ వడ్డీ రేటును అందిస్తున్నాయి. కాబట్టి, సహజంగానే వీటిని ఎంచుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

మీరు సాధారణ, సంప్రదాయ పెట్టుబడులను ఇష్టపడేవాళ్లయితే.. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లవైపే మొగ్గు చూపండి. మిగతా విషయాలను పట్టించుకోవద్దు. అందులోనూ ప్రభుత్వ లేదా ప్రైౖవేటు బ్యాంకుల్లో అగ్రస్థానాల్లో ఉన్న బ్యాంకులనే ఎంచుకోండి. చిన్న బ్యాంకులు, సహకార సంస్థలు అధిక వడ్డీ రేటును అందిస్తామని చెపుతుంటాయి. నష్టభయం ఏమాత్రం భరించలేనప్పుడు వీటి వైపు చూడొద్దు. ఇక కాస్త నష్టం వచ్చినా ఇబ్బంది లేదు.. అధిక రాబడి వస్తే చాలు అనుకున్నప్పుడు మాత్రమే కార్పొరేట్‌ ఎఫ్‌డీలను పరిశీలించాలి.

కొన్ని కార్పొరేట్‌ సంస్థలూ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రజల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను స్వీకరిస్తాయి. బ్యాంకులతో పోలిస్తే అధిక వడ్డీ ఇచ్చినప్పుడే వీటిలో పెట్టుబడులు పెడతారు. అందుకే, ఇవి కాస్త ఎక్కువ వడ్డీని అందిస్తాయి. బ్యాంకులతో పోలిస్తే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వ్యాపారంలో కాస్త నష్టభయం ఎక్కువ. అది మన డిపాజిట్లనూ ప్రభావితం చేసే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ డిపాజిట్లలో డబ్బు జమ చేసేటప్పుడు కొన్ని అంశాలను విశ్లేషించుకోవాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

  • మీరు చిన్న మొత్తంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారనుకుందాం. ఇలాంటప్పుడు దాన్ని సాధారణ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడమే ఉత్తమం. తక్కువ మొత్తం డిపాజిట్‌ చేసినప్పుడు 1 శాతం అదనపు వడ్డీ పెద్దగా కనిపించదు. పైగా బ్యాంకులో రూ.5 లక్షల లోపు డిపాజిట్లకు డీఐసీజీసీ బీమా వర్తిస్తుంది.
  • అత్యవసర నిధిని ఎట్టి పరిస్థితుల్లోనూ కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మదుపు చేయొద్దు. కొంతమంది లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్లనూ దీనికోసం ఎంచుకుంటారు. సులభంగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా డబ్బును వెనక్కి తీసుకునే ఏర్పాటు ఉండాలి. కార్పొరేట్‌ ఎఫ్‌డీలు కొన్నిసార్లు వెంటనే నగదుగా మార్చుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఇలాంటప్పుడు అత్యవసరంలో కష్టం అవుతుంది.
  • మీ దగ్గర ఉన్న మొత్తం పెట్టుబడిలో 75 శాతం వరకూ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మదుపు చేయండి. మిగతా మొత్తాన్ని మాత్రమే కార్పొరేట్‌ ఎఫ్‌డీలకు మళ్లించండి. ఉదాహరణకు మీరు రూ.10 లక్షలు డిపాజిట్‌ చేద్దామని అనుకుంటున్నారు.. అప్పుడు రూ.7.5 లక్షలు బ్యాంకు ఎఫ్‌డీలోనూ.. మిగతా రూ.2.5 లక్షలు 9 శాతం వరకూ రాబడినిచ్చే కార్పొరేట్‌ సంస్థల ఎఫ్‌డీలోనూ జమ చేయొచ్చు. రూ.7.5 లక్షలనూ రెండు, మూడు మంచి బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయండి. కార్పొరేట్‌ సంస్థలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.
  • ఎఫ్‌డీలకు మించి కాస్త అధిక వడ్డీ కావాలనుకున్నప్పుడు డెట్‌ ఫండ్లనూ పరిశీలించవచ్చు.
  • కార్పొరేట్‌ ఎఫ్‌డీలను ఎంచుకునేటప్పుడు కేవలం అధిక వడ్డీ రేటును ఒకటే చూడొద్దు. వాటి రేటింగ్‌లను కచ్చితంగా చూడాలి. గతంలో తీసుకున్న డిపాజిట్ల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? చెల్లింపులు సకాలంలో చేశారా లాంటి విషయాలను పరిశీలించాలి. సరైన కార్పొరేట్‌ ఎఫ్‌డీలను ఎంచుకున్నప్పుడే మీ డబ్బుకు ఎలాంటి నష్టభయమూ ఉండదని గుర్తుంచుకోండి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని