గృహరుణం ఇప్పుడేం చేయాలి?

ఏడాది కాలంగా రెపో  రేటు 6.50 శాతం వద్ద కొనసాగుతోంది. దీన్ని పెంచకపోవడం మంచి పరిణామమే. అదే సమయంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నప్పటికీ, వడ్డీ రేట్లను తగ్గించేంతగా సహకరించడం లేదు.

Updated : 23 Feb 2024 09:10 IST

ఏడాది కాలంగా రెపో  రేటు 6.50 శాతం వద్ద కొనసాగుతోంది. దీన్ని పెంచకపోవడం మంచి పరిణామమే. అదే సమయంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నప్పటికీ, వడ్డీ రేట్లను తగ్గించేంతగా సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో గృహరుణం తీసుకున్న వారు.. అధిక వడ్డీ భారాన్ని భరించక తప్పని పరిస్థితులున్నాయి. మరి, ఇప్పటికే గృహరుణం తీసుకున్న, ఇల్లు కొంటున్న వారు ఏం చేయాలన్న వివరాలు తెలుసుకుందాం.


 

సొంతిల్లు కొనాలనే ఆలోచనతో ఉన్న వారికి రుణాలను అందించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. రుణగ్రహీతలను ఆకట్టుకునే క్రమంలో స్వయంగా కొంత ప్రీమియంను తగ్గించుకుంటున్నాయి. 2022 ఫిబ్రవరిలో ఉన్న వడ్డీ రేట్లతో పోలిస్తే ఇప్పుడు అధికంగానే ఉన్నాయి. గత ఏడాదితో చూస్తే కాస్త తగ్గిన మాట వాస్తవం. 750కి మించి క్రెడిట్‌ స్కోరున్న వారికి మాత్రమే బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తుండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. మహిళలు, బ్లూచిప్‌ కంపెనీల్లో పనిచేస్తున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రీమియం ఆస్తులను కొనుగోలు చేస్తున్న వారికీ గృహరుణ వడ్డీలో కొంత రాయితీ లభిస్తోంది. మరోవైపు బ్యాంకును మార్చుకున్నప్పుడూ వడ్డీ తగ్గే అవకాశం ఉంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఇంటి రుణంపై కనీస వడ్డీ రేటు 8.30 నుంచి 8.60 శాతం మధ్యలోనే ఉంది.

ఇప్పటికే రుణం ఉంటే..

మీరు 2020కి ముందు రుణం తీసుకుంటే.. ఇప్పుడు మార్కెట్లో ఉన్న వడ్డీ రేటు కంటే అధికంగా చెల్లించే అవకాశాలున్నాయి. అక్టోబరు 2019 నుంచి బ్యాంకులు గృహరుణ వడ్డీ రేటును నిర్ణయించేందుకు రెపోను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అంతకుముందు ఇది నిధుల ఆధారిత వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) లేదా బేస్‌ రేటు ఆధారంగా ఉండేది. రెపో రేటు ఆధారిత రుణాలు అది మారినప్పుడల్లా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ప్రస్తుతం తక్కువ గృహరుణ వడ్డీని తీసుకుంటున్న బ్యాంకు రుణం రెపో రేటుపై 180 బేసిస్‌ పాయింట్లు అధికంగా ఉంది. కానీ, కొన్ని పాత రుణాలు రెపో రేటుపై 300 బేసిస్‌ పాయింట్లకన్నా అధికంగా కొనసాగుతున్నాయి.

ఏం చేయాలి?

ప్రస్తుతం మీ రుణానికి వడ్డీ రేటు ఎంత ఉందో ముందుగా తెలుసుకోండి. ఇంకా ఎంత మొత్తం బాకీ ఉన్నారన్నదీ చూడండి. ఇప్పటికీ సగానికి మించి రుణం తీర్చాల్సి ఉందనుకుందాం. మీకు కొత్తగా రుణం తీసుకుంటే 50-100 బేసిస్‌ పాయింట్లు తక్కువ వడ్డీకే రుణం వస్తుందని అనుకుంటే.. కొత్త బ్యాంకుకు మారే విషయాన్ని పరిశీలించవచ్చు. లేదా బ్యాంకునే ఒకసారి అడిగి చూడండి. ఎంసీఎల్‌ఆర్‌ లేదా బేస్‌ రేటు ఆధారిత వడ్డీ చెల్లిస్తుంటే.. దానిని రెపో ఆధారిత రుణ వడ్డీ రేటుకు మార్చుకోండి. దీనికోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకును మార్చాలనుకున్నప్పుడు అనేక పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఫీజులూ అధికంగానే ఉంటాయి. మీరు తీసుకునే రుణంలో ఇవి 1 శాతం వరకూ ఉండొచ్చు. తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు ఈ ఖర్చులు ఏడాదిలో తిరిగి పొందే అవకాశం ఉంది.

మీ గృహరుణం బాకీ రూ.30 లక్షలనుకుందాం. ఇంకా పదేళ్ల వ్యవధి ఉంది. వడ్డీ రేటు   9.50 శాతం నుంచి 8.50 శాతానికి మారితే.. 10 ఏళ్లలో రూ.1,95,000 వరకూ ఆదా అవుతుంది.

ప్రభుత్వ బ్యాంకుల్లో..

మీరు ప్రభుత్వ బ్యాంకుల నుంచి గృహరుణం తీసుకున్నారా? అప్పుడు కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న గృహరుణాల్లో చాలా వరకూ పాత బెంచ్‌మార్క్‌ల ఆధారంగానే ఉన్నాయని ఆర్‌బీఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో 79 శాతం రుణాలు రెపో రేటుకు మారాయి. విదేశీ బ్యాంకుల విషయంలో ఇది 90 శాతం వరకూ ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లో 38 శాతం మాత్రమే రెపో విధానానికి మారడం గమనార్హం. 2020కి ముందు ప్రభుత్వ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే.. ఒకసారి బ్యాంకును సంప్రదించండి. రెపో రేటుకు మారేందుకు ప్రయత్నించండి.

ఇల్లు కొంటున్నారా?

గృహరుణం తీసుకొని, ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? ముందుగా మీ అర్హత ఎంతుందో తెలుసుకోండి. క్రెడిట్‌ స్కోరు సరిగా ఉందా? ఇప్పటికే తీసుకున్న రుణాల వాయిదాల చెల్లింపులన్నీ సక్రమంగా ఉన్నాయా పరిశీలించండి. క్రెడిట్‌ కార్డు బాకీలూ ఉండకూడదు. 800కి మించి క్రెడిట్‌ స్కోరున్నప్పుడు బ్యాంకుతో వడ్డీ విషయంలో బేరమాడొచ్చు.

అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని