పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉండాలి?

వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో పొదుపు ఖాతాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనం చేసే ఆదాయ-వ్యయాలన్నింటికీ ఆధారం ఇదే. బ్యాంకు, మీరు ఎంచుకున్న ఖాతా రకాన్ని బట్టి, ఇందులో కనీస నిల్వ ఎంత ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది. వేతనం ఖాతాలో సున్నా నిల్వ ఉన్నా ఇబ్బందేమీ ఉండదు.

Updated : 01 Mar 2024 04:46 IST

వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో పొదుపు ఖాతాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనం చేసే ఆదాయ-వ్యయాలన్నింటికీ ఆధారం ఇదే. బ్యాంకు, మీరు ఎంచుకున్న ఖాతా రకాన్ని బట్టి, ఇందులో కనీస నిల్వ ఎంత ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది. వేతనం ఖాతాలో సున్నా నిల్వ ఉన్నా ఇబ్బందేమీ ఉండదు. కనీసం రూ.500 నుంచి రూ.5లక్షల వరకూ కనీస నిల్వ ఉండే ఖాతాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉండాలనే సందేహం చాలామందికి వస్తుంటుంది.

వచ్చిన ఆదాయం వచ్చినట్లు ఖర్చు చేయలేం కదా.. అవసరాలను బట్టి, దానికి బడ్జెట్‌ వేసుకోవాలి. చాలామంది ఆర్థిక నిపుణులు చెప్పే మాటేమిటంటే.. 50-30-20 సూత్రాన్ని పాటించాలని. ఆదాయాన్ని సమర్థంగా నిర్వహించడంలో ఇది తోడ్పడుతుందని ఇప్పటికే చాలామంది తేల్చి చెప్పారు..
వచ్చిన ఆదాయంలో ముందుగా 50 శాతాన్ని అవసరాల కోసం వినియోగించుకోవాలి. అంటే.. రుణ వాయిదాల చెల్లింపు, నిత్యావసరాలు, ఫీజులు, రవాణాలాంటి వాటికోసం ఉపయోగించాలి. 30 శాతాన్ని వస్తువుల కొనుగోళ్ల కోసం, మీ కుటుంబ సంతోషం కోసం ఖర్చు చేయాలి. మిగతా 20 శాతాన్ని కచ్చితంగా పొదుపు, పెట్టుబడులకు మళ్లించాలి. మీ ఖర్చులు, అవసరాలకు అధిక మొత్తం అవసరమైతే.. 30 శాతం ఖర్చును తగ్గించుకోవాల్సిందే. పొదుపు ఖాతాలో జమైన మొత్తంలో మీ అవసరాలకు తగిన మొత్తం ఉంచుకొని, మిగతాది పెట్టుబడులకు మళ్లించాలి.

అత్యవసర నిధి..

ఖర్చులకు ఏ ఇబ్బందీ లేకుండా అందుబాటులో డబ్బు ఉండేలా చూసుకోవాలి. కనీసం 6 నుంచి 12 నెలల ఖర్చులకు సరిపోయే డబ్బును అత్యవసర నిధిగా పెట్టుకోవాలి. ఈ మొత్తాన్ని బ్యాంకు పొదుపు ఖాతాలోనే ఉంచుకోవడం మేలు. ఒకేసారి అంత పెద్ద మొత్తం నిధిని జమ చేయలేం అనుకుంటే.. నెలకు రూ.2వేలు లేదా మీకు వీలైనంత వరకూ పొదుపు చేస్తూ వెళ్లండి. అంతేకానీ, సాధ్యం కాదు అని వదిలేయొద్దు.

చేతిలో నగదు..

అన్ని లావాదేవీలనూ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేస్తున్నాం. చేతిలో డబ్బుతో పెద్దగా పని ఉండటం లేదు. అయినప్పటికీ.. కొంత మొత్తం నగదు రూపంలోనూ ఇంట్లో ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎంత అన్నది వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు, అవసరాలను బట్టి, ఆధారపడి ఉంటుంది. రూ.20వేలకు మించి ఉండకపోవడమే మేలు.

వడ్డీ వచ్చేలా..

పొదుపు ఖాతాలో వడ్డీ తక్కువగా ఉంటుంది. అదే ఫ్లెక్సీ డిపాజిట్‌ చేసినప్పుడు కాస్త అధిక వడ్డీ ఆర్జించేందుకు వీలుంటుంది. ఇవి అటు పొదుపు ఖాతా, ఇటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల ప్రయోజనాన్ని అందిస్తాయి. దీని గురించి పూర్తిగా తెలుసుకొని, ప్రారంభించాలి. మీ దగ్గర నెలవారీ అవసరాలు, అత్యవసర నిధికి మించి డబ్బు ఉన్నప్పుడు నష్టభయం లేని లిక్విడ్‌ ఫండ్లు, డెట్‌ ఫండ్లలో మదుపు చేయండి. అప్పుడు ఇది పెట్టుబడులకు కేటాయించే 20 శాతానికి అదనం అన్నమాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని