వ్యక్తిగత రుణాలు మోసాల బారిన పడొద్దు

ఎలాంటి హామీ లేకుండా లభించే వ్యక్తిగత రుణాలు అవసరమైనప్పుడు ఎంతో ఉపయోగపడతాయి. మన అవసరాలను ఆసరాగా తీసుకొని, సైబర్‌ మోసగాళ్లు మన కష్టార్జితాన్ని కాజేసేందుకు సిద్ధంగా ఉంటారు.

Updated : 15 Mar 2024 10:20 IST

ఎలాంటి హామీ లేకుండా లభించే వ్యక్తిగత రుణాలు అవసరమైనప్పుడు ఎంతో ఉపయోగపడతాయి. మన అవసరాలను ఆసరాగా తీసుకొని, సైబర్‌ మోసగాళ్లు మన కష్టార్జితాన్ని కాజేసేందుకు సిద్ధంగా ఉంటారు. ముందస్తు రుసుములు, ఇతర ఖర్చులంటూ.. మీ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 ఆర్థిక నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా పద్ధతులతో మోసాలకు పాల్పడుతుంటారు. వీటి గురించి అవగాహన లేని వారి నుంచి అందినకాడికి రాబట్టుకోవడమే వారి పని. వ్యక్తిగత రుణాలు ఇస్తామని, క్రెడిట్‌ కార్డులు కావాలా అంటూ ఫోన్లు, సందేశాలు, ఇ-మెయిళ్లు పంపిస్తూనే ఉంటారు. తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్నా రుణం ఇస్తామంటూ చెబుతుంటారు. క్షణాల్లోనే రుణం ఆమోదం అంటూ తొందర పెడతారు. ఇలాంటి వాటిపట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఎలాంటి దరఖాస్తు చేయకుండానే రుణం ఇస్తామంటూ వచ్చే ఫోన్లు, సందేశాలను నమ్మొద్దు. మీ ఆదాయంతో సంబంధం లేకుండా అధిక మొత్తంలో, తక్కువ వడ్డీకే రుణం ఇస్తామని చెబుతున్నారంటే అది కచ్చితంగా సైబర్‌ స్కామ్‌ అని గుర్తుంచుకోవాలి.

రుణ ఆఫర్లతో: మీ పేరుపై ముందుస్తు రుణం మంజూరయ్యిందని పేర్కొంటూ మోసగాళ్లు సంప్రదిస్తుంటారు. బ్యాంకు నుంచే వచ్చినట్లు భ్రమించేలా నకిలీ సందేశాలు పంపిస్తారు. ఆకర్షించేలా రుణ ఆఫర్లు ఇస్తారు. నిజానికి మీ ఖాతా ఉన్న బ్యాంకులో తప్ప, ఇతర చోట్ల ముందస్తు రుణాలు మంజూరవ్వడం సాధారణంగా ఉండదు. కాబట్టి, ఇలాంటి విషయాలపై అప్రమత్తంగా ఉండాలి. రుణం ఇస్తామన్న సంస్థ ఆర్‌బీఐ గుర్తింపు పొందిందా లేదా అనేది చూసుకోవాలి.  
వివరాల తస్కరణ: మీ రుణ చరిత్ర నివేదికలు, క్రెడిట్‌ నివేదికలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. ఎవరైనా మీ గుర్తింపులను వాడి, రుణం తీసుకున్నారా అనేది దీని ఆధారంగానే తెలుసుకోవచ్చు. మీ రుణ చరిత్ర నివేదికలో అనధికారిక రుణాలు ఉంటే బ్యాంకులకు ఆ విషయాన్ని తెలియజేయండి. క్రెడిట్‌ బ్యూరోలకూ ఫిర్యాదు చేయాలి.

అదనంగా రుణం: ఇప్పటికే తీసుకున్న రుణంపై అదనంగా రుణం ఇచ్చేందుకు వీలుంది. బ్యాంకులు ఇచ్చే ఈ ఆఫర్లు సాధారణంగా నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లలో కనిపిస్తుంటాయి. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఈ వివరాలు బ్యాంకులు తమ రుణ ఏజెంట్లకూ అందిస్తుంటాయి. వాళ్లు ఫోన్లు చేసి, అదనంగా రుణం ఇప్పిస్తామంటూ చెబుతుంటారు. ఇలాంటివి వచ్చినప్పుడు ముందుగా మీ బ్యాంకును సంప్రదించి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే అదనంగా రుణాన్ని తీసుకోవాలి. లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతారు.
పరిశీలనా రుసుము: బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి మాట్లాడుతున్నట్లుగా మోసగాళ్లు ఫోన్లు చేస్తుంటారు. తక్కువ వడ్డీకి రుణం ఇస్తున్నామని చెబుతారు. పరిమిత కాలంపాటే ఇది అందుబాటులో ఉంటుందంటారు. రుణ దరఖాస్తును పరిశీలించడం, డాక్యుమెంటేషన్‌, ఇతర రకరకాల పేర్లు చెప్పి, కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందని చెబుతారు. ఆన్‌లైన్‌లో నగదు బదిలీ కాకుండా.. గిఫ్ట్‌ కార్డులు, లేదా ఇతర రూపాల్లో ఆ మొత్తాన్ని చెల్లించాలని అంటారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర రుసుములు రుణం మంజూరైన తర్వాత ఆ మొత్తం నుంచే మినహాయించుకొని, మిగతాది మన బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. గిఫ్ట్‌ కార్డుల్లాంటివి అడుగుతున్నారంటే.. అది కచ్చితంగా మోసమే.  
స్కోరుతో అవసరం లేదంటూ: ఎలాంటి ధ్రువీకరణలూ, క్రెడిట్‌ స్కోరు అవసరం లేకుండానే రుణం ఇస్తామంటూ కొందరు చెబుతుంటారు. అప్పు ఇచ్చే ముందు ఆర్థిక సంస్థలు కేవైసీ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అలాంటిదేమీ అవసరం లేదంటూ చెప్పారంటే మోసం అని గుర్తించాలి. రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరును సమగ్రంగా పరిశీలించాకే బ్యాంకులు రుణం ఇస్తాయి.

అనుమతి ఉంటేనే: బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్‌బీఐ అనుమతి ఉంటుంది. ఇలాంటి సంస్థల నుంచే రుణాలు తీసుకునేందుకు ప్రయత్నించాలి. గుర్తింపు లేని సంస్థల నుంచి రుణాలు తీసుకున్నప్పుడే ఇబ్బందులు వస్తుంటాయి. ముందుగా మీకు రుణం ఇస్తామని చెప్పిన సంస్థల గురించి పూర్తి ఆరా తీయండి. వెబ్‌సైట్ను పరిశీలించండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి.
పోల్చి చూడండి: వ్యక్తిగత రుణంపై వడ్డీ ఎంత విధిస్తున్నారు, పరిశీలనా రుసుములు, ముందస్తు చెల్లింపు సమయంలో విధించే ఛార్జీల్లాంటివి పోల్చి చూడండి. దీనికోసం పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకుల వెబ్‌సైట్లలో వ్యక్తిగత రుణాల వివరాలను పరిశీలించండి.

వివరాలు తెలుసుకోండి: రుణానికి సంబంధించిన స్పష్టమైన వివరాలు తెలుసుకోండి. కీ ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్‌ను అడిగి తీసుకోండి. ఇందులో మీ రుణానికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. రుణ మొత్తం, వడ్డీ, వ్యవధి తదితరాలుంటాయి.
అవసరం లేకుండా వ్యక్తిగత రుణాలు తీసుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. సాధారణంగా వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. కాబట్టి, మీకు నిజంగా డబ్బు అవసరం ఉన్నప్పుడు మాత్రమే రుణాన్ని తీసుకునేందుకు ప్రయత్నించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని