సిబిల్‌ నివేదికలో తప్పులుంటే

రుణం తీసుకోవాలంటే.. బ్యాంకులు ముందుగా పరిశీలించేది క్రెడిట్‌ నివేదికనే. ఇందులో ఎలాంటి తప్పులూ దొర్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు రుణం కోసం వెళ్తే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది.

Updated : 22 Mar 2024 03:46 IST

రుణం తీసుకోవాలంటే.. బ్యాంకులు ముందుగా పరిశీలించేది క్రెడిట్‌ నివేదికనే. ఇందులో ఎలాంటి తప్పులూ దొర్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు రుణం కోసం వెళ్తే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. ఒకవేళ నివేదికలో పొరపాట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని వెంటనే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ (సిబిల్‌) దృష్టికి తీసుకెళ్లాలి. ఈ నివేదికలో సాధారణంగా వచ్చే తప్పులు, వాటిని ఎలా సరిచేసుకోవాలో చూద్దాం..

  •  నివేదికలో కొన్నిసార్లు మన పేరు, చిరునామా, పుట్టిన రోజు, పాన్‌ వివరాలు తప్పుగా వస్తుంటాయి.
  •  ఇప్పటికే ఉన్న రుణాలకు సంబంధించిన సమాచారం నివేదికలో కనిపిస్తుంది. ఈ రుణాల సంఖ్య లేదా మొత్తం అధికంగా ఉన్నప్పుడు ఎక్కడో పొరపాటు దొర్లిందని అర్థం.
  • రుణ వాయిదాల చెల్లింపులో ఎప్పుడైనా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎన్ని రోజులు ఆలస్యంగా చెల్లించారనే విషయాన్ని నివేదికలో పేర్కొంటారు. కొన్నిసార్లు సమయానికే చెల్లిస్తున్నా ఆలస్యమైనట్లు పేర్కొనవచ్చు.
  •  మనకు ఏమాత్రం సంబంధం లేని రుణాలు నివేదికలో కనిపించే అవకాశాలూ ఉన్నాయి. ఇలాంటప్పుడు మన రుణ అర్హత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఒకసారి క్రెడిట్‌ నివేదికను నిశితంగా పరిశీలించండి. ఏమాత్రం అనుమానాలున్నా వెంటనే సంబంధిత పొరపాటును సరి చేయాల్సిందిగా కోరుతూ సిబిల్‌ను సంప్రదించాలి.
  • దీనికి ముందుగా.. నివేదికను ఒకటికి రెండుసార్లు పరిశీలించండి. మీ రుణ ఖాతా వివరాలను పోల్చి చూడండి. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే బ్యాంకును సంప్రదించి, వాటిని సరిచేయాల్సిందిగా కోరండి. చాలా సందర్భాల్లో బ్యాంకు నుంచి సమాచారం వెళ్లగానే నివేదికలో సరైన వివరాలు కనిపిస్తాయి. సిబిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో మీ వివరాలతో లాగిన్‌ కావడం ద్వారా పొరపాట్లను నమోదు చేయొచ్చు.
  • నివేదికలో ఉన్న వివరాలు అర్థం కాకపోతే మీ బ్యాంకు శాఖను సంప్రదించి, వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి.
  •  సిబిల్‌ నివేదికలో ప్రతి ఖాతాదారుడికీ ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. పొరపాట్లను నమోదు చేసేటప్పుడు దీన్ని పేర్కొనాల్సి ఉంటుంది. మీ నుంచి వచ్చిన వివరాలను క్రెడిట్‌ బ్యూరో సంబంధిత బ్యాంకులు/ఆర్థిక సంస్థలకు పంపించి, ధ్రువీకరించుకుంటుంది. ఆ తర్వాతే మార్పులు చేస్తుంది.
  •  పొరపాట్లను సరిచేసేందుకు 30-45 రోజుల వరకూ సమయం పడుతుంది.
  • రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేకున్నా.. కనీసం ఏడాదికోసారైనా మీ క్రెడిట్‌ నివేదికను తనిఖీ చేసుకోవడం మర్చిపోవద్దు. అప్పుడే ఎలాంటి   తప్పులకూ తావుండదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని