రుణాలు.. తొందరగా తీర్చేద్దాం

అవసరానికి అప్పు చేయడం కొన్నిసార్లు తప్పకపోవచ్చు. తీసుకున్న రుణాన్ని తొందరగా తీర్చేయడమే ఆర్థిక క్రమశిక్షణ. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డులు.. ఇలా సులభంగా రుణం దొరికే మార్గాలున్న రోజుల్లో మన వద్ద లేని డబ్బును ఖర్చు చేసేప్పుడు ఆలోచించాల్సిందే.

Published : 05 Apr 2024 00:57 IST

అవసరానికి అప్పు చేయడం కొన్నిసార్లు తప్పకపోవచ్చు. తీసుకున్న రుణాన్ని తొందరగా తీర్చేయడమే ఆర్థిక క్రమశిక్షణ. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డులు.. ఇలా సులభంగా రుణం దొరికే మార్గాలున్న రోజుల్లో మన వద్ద లేని డబ్బును ఖర్చు చేసేప్పుడు ఆలోచించాల్సిందే. రుణాలను తొందరగా తీర్చాలంటే మీ ఖర్చులను అర్థం చేసుకోవడం. రూపాయిని ఆదా చేసుకునేందుకు ఎక్కడ కోత వేయాలో తెలుసుకోవాలి. చిన్న, పెద్ద ఖర్చులన్నింటినీ ఒక దగ్గర రాసి పెట్టుకోండి. మీ నెలవారీ ఖర్చులతోపాటు, ఏడాదికోసారి వచ్చే వ్యయాలనూ ఇందులో చేర్చాలి. ఆరు నెలల బ్యాంకు ఖాతా, క్రెడిట్‌ కార్డు బిల్లులను పరిశీలించండి. ఎంత ఆదాయం వస్తుంది, నుంచి అద్దె లేదా గృహరుణ వాయిదాలు, వాహన ఈఎంఐ, కిరాణా, విద్యుత్‌ ఇతర బిల్లులకు ఖర్చు ఎంతలాంటివన్నీ స్పష్టంగా తెలిసిపోతాయి. సరదాలు, ఇతర అవసరాల కోసం చేసిన ఖర్చులనూ లెక్క తీయాల్సిందే.

అప్పుల జాబితా: మీకు ఉన్న మొత్తం అప్పులు ఎన్ని? వ్యక్తిగత రుణాలు, వాహన రుణం, క్రెడిట్‌ కార్డు బిల్లులు, ఇతర చేబదుళ్లు అన్నీ ఒక దగ్గర జాబితాగా రాసుకోండి. ఒక్కో రుణానికీ మీరు ఎంత చెల్లిస్తున్నారు? దానికి విధిస్తున్న వడ్డీ ఎంత? అనే అవగాహన ఉండాలి. దీనివల్ల మీ కష్టార్జితాన్ని వడ్డీల రూపంలో ఎంత కోల్పోతున్నారో అర్థం అవుతుంది.  

 బడ్జెట్‌ వేసుకోవాలి: మీ ఆదాయం, ఖర్చుల గురించి అవగాహన వచ్చిన తర్వాత, మీరు త్వరగా రుణాన్ని ఎలా వదిలించుకోవాలన్నది ఆలోచించాలి. మీ ఖర్చులు నెలవారీగా మారుతుంటాయి. కానీ, ఆదాయంలో తేడా ఉండదు. మీ నగదును ఎక్కువగా హరించే వ్యయాలకు కాస్త కళ్లెం వేయాల్సిందే. సాధారణంగా ఇవన్నీ ఖరీదైన జీవన శైలి ఖర్చులే. వీటిని కట్టడి చేయడం వల్ల నిజానికి నిత్య జీవితంలో పెద్ద ప్రతికూల ప్రభావమేమీ ఉండదు. ఇక జీవితంలో సరదా ఏముంటుంది అనుకుంటే.. ఆ ఖర్చులను కనీసం 60 శాతమైనా తగ్గించే ప్రయత్నం చేయండి.  

 ప్రాధాన్యాలను చూసుకోండి: తప్పనిసరి నెలవారీ ఖర్చులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు గృహరుణం లేదా ఇంటి అద్దె, ఆహార ఖర్చులు, విద్యుత్‌, మొబైల్‌ బిల్లులు. వీటికి డబ్బును కేటాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని రుణ వాయిదాలను చెల్లించేందుకు ప్రయత్నించాలి. అధిక వడ్డీతో ఉన్న రుణాలను తొందరగా తీర్చేయడంపై దృష్టి పెట్టాలి. క్రెడిట్‌ కార్డు రుణం, వ్యక్తిగత రుణం, వాహన రుణం, గృహరుణం ఇలా ప్రాధాన్యాలను నిర్ణయించుకోవాలి. ఖర్చులు, రుణ వాయిదాలను మాత్రమే పట్టించుకుంటూ.. పెట్టుబడులను నిర్లక్ష్యం చేయొద్దు. ఆదాయంలో కనీసం 10-15 శాతం పెట్టుబడులకు మళ్లించాలి. అప్పులు తీరిన తర్వాత ఈ మొత్తాన్ని పెంచుకోవాలి. రుణాలను తీర్చేందుకు అత్యవసర నిధిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు.  
వాయిదా వేయండి...: మీకు నిజంగా ఏది అవసరమో అన్నది నిర్ణయించుకుంటే.. డబ్బు ఆదా చేయడం వచ్చినట్లే. ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు కనీసం 2 రోజుల పాటు దాని గురించి ఆలోచించండి. ఆ తర్వాత 30 రోజులు వస్తువు లేకుండా ఉండేందుకు ప్రయత్నించండి. అప్పటికీ.. అది మీకు కావాల్సిందే అనుకున్నప్పుడే కొనండి. అప్పు చేసి కాకుండా, అవసరమైన డబ్బును జమ చేసి కొనడం అలవాటు చేసుకోవాలి.  
అదనపు ఆదాయం వస్తే: ఉద్యోగులకు కొన్ని సందర్భాల్లో ప్రత్యేక బోనస్‌లు వస్తుంటాయి. ఈ మొత్తాన్ని రుణాలను చెల్లించేందుకు వినియోగించుకోవచ్చు.  
ఆలోచించి నిర్ణయం: వారసత్వ లేదా ఆస్తిని విక్రయించినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. ఇలాంటప్పుడు అప్పులు తీర్చేయడం కన్నా, పెట్టుబడులు పెట్టటమే మంచిదని చాలామంది భావిస్తారు. పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలతో రుణాలను తీర్చాలనే ప్రయత్నాలు అన్ని సందర్భాల్లోనూ మంచి ఫలితాలు ఇవ్వవు. 12 శాతానికి మించి వడ్డీకి తీసుకున్న రుణాలను వెంటనే వదిలించుకోండి. ఆ తర్వాత మిగిలిన డబ్బును దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం కేటాయించండి.
మంచి అలవాట్లను కొనసాగించండి: మీ అప్పులను తీర్చిన తర్వాతా మీ జీవన శైలి, బడ్జెట్‌, ఆర్థిక ప్రణాళికలు, డబ్బును ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలాంటి మంచి అలవాట్లను కొనసాగించాలి. ఇవన్నీ మీ ఆర్థిక విజయానికి దోహదం చేస్తాయని మర్చిపోవద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని