క్రెడిట్‌ కార్డు బాధ్యతగా వాడండి

మీ జేబులో ఉన్న క్రెడిట్‌ కార్డు.. ఒక అద్భుతమైన ఆర్థిక సాధనం. చేతిలో డబ్బు లేకపోయినా కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని మీరు సరైన మార్గంలో ఉపయోగిస్తే.. అది మీ కోసం ఎన్నో పనులు చేస్తుంది.

Updated : 12 Apr 2024 07:36 IST

మీ జేబులో ఉన్న క్రెడిట్‌ కార్డు.. ఒక అద్భుతమైన ఆర్థిక సాధనం. చేతిలో డబ్బు లేకపోయినా కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని మీరు సరైన మార్గంలో ఉపయోగిస్తే.. అది మీ కోసం ఎన్నో పనులు చేస్తుంది. వస్తువులు, సేవలను కొనుగోలు చేయడం, నగదు వెనక్కి, రివార్డు పాయింట్లు అందించడంతో పాటు, క్రెడిట్‌ స్కోరును మెరుగ్గా ఉంచేందుకూ దోహదం చేస్తుంది. దీన్ని బాధ్యతగా వాడినప్పుడే ఈ ప్రయోజనాలన్నీ. మీ కార్డు మీ కోసం మరింత పనిచేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా..

ఆర్థిక ప్రణాళికలో ఇప్పుడు క్రెడిట్‌ కార్డుల నిర్వహణా ఎంతో కీలకంగా మారింది. వీటిని ఏమాత్రం అజాగ్రత్తగా వాడినా, భవిష్యత్తులో మనం అనుకున్న కొన్ని లక్ష్యాలకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

బాధ్యతాయుతంగా క్రెడిట్‌ కార్డును వాడాలంటే.. ముందుగా దాన్ని అర్థం చేసుకోవాలి. వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు, కార్డు సంస్థలు క్రెడిట్‌ కార్డులను అందిస్తున్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు ట్రావెల్‌ సంస్థలతో ఒప్పందాలున్న కార్డులను తీసుకోవచ్చు. కొనుగోళ్లు చేసే వారు నగదు వెనక్కి, రాయితీలు అధికంగా ఇస్తున్న కార్డులను ఎంచుకోవాలి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారూ ఇదే సూత్రాన్ని పాటించాలి. అదే సమయంలో గరిష్ఠంగా మూడు కార్డులకు మించి ఉండకూడదు అనే నిబంధన పాటించాలి.

క్రెడిట్‌ స్కోరు: సకాలంలో చెల్లింపులు, తక్కువ క్రెడిట్‌ వినియోగం మీ క్రెడిట్‌ స్కోరును సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. మెరుగైన రుణ నిబంధనలు, విస్తృత అవకాశాలనూ ఇది కల్పిస్తుంది.

రివార్డులు వచ్చేలా..: క్రెడిట్‌ కార్డులతో కొనుగోళ్లు చేసినప్పుడు రివార్డుల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఉదాహరణకు కొన్ని కార్డులు పెట్రోలు కొనుగోలు చేసినప్పుడు కొంత రాయితీని అందిస్తాయి. మరికొన్ని విద్యుత్‌ ఉపకరణాల కొనుగోలుపై నగదు వాపసు సౌకర్యాన్ని అందిస్తాయి. పలు హోటళ్లతో ఒప్పందం ఉన్న కార్డులూ ఉంటాయి. ఇప్పుడు చాలా బ్రాండ్లు కార్డు సంస్థలతో కలిసి కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులనూ తీసుకొస్తున్నాయి. అధిక రివార్డులు, ప్రయోజనాలు ఉన్న కార్డులను తీసుకునేందుకు ప్రయత్నించండి.  

బీమా రక్షణ: క్రెడిట్‌ కార్డులు వ్యక్తిగత ప్రమాద బీమా, ప్రయాణ బీమాలాంటి వాటినీ అనుబంధంగా అందిస్తుంటాయి. మీ కార్డు అందిస్తున్న బీమా పాలసీల గురించి తెలుసుకోండి.

వ్యవధిని అర్థం చేసుకోండి..: క్రెడిట్‌ కార్డుల బిల్లింగ్‌ తేదీని చూసుకోవడమూ అవసరం. క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లపై ఎలాంటి వడ్డీని చెల్లించకూడదనేది మీ లక్ష్యంగా ఉండాలి. అదే సమయంలో వీలైనంత ఎక్కువ వ్యవధి లభించేలా చూసుకోవాలి. ఉదాహరణకు బిల్లింగ్‌ తేదీ ముగిసిన మర్నాడు ఏదైనా కొనుగోలు చేయాలి. అప్పుడు మీకు దాదాపు 45 రోజుల వరకూ వ్యవధి లభిస్తుంది. కార్డులకు వేర్వేరు బిల్లింగ్‌ తేదీలు ఉండేలా చూసుకోవాలి.

ఏదైనా సందర్భంలో కార్డు బిల్లును చెల్లించలేకపోతే.. మరో క్రెడిట్‌ కార్డు నుంచి బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌లాంటి సదుపాయాన్ని వినియోగిచుకునే ప్రయత్నం చేయొచ్చు. దీనివల్ల బిల్లుపై వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు వీలవుతుంది. బదిలీ రుసుములు చూసుకోవడం మర్చిపోవద్దు.

ఆలస్యం చేయొద్దు: మీ క్రెడిట్‌ కార్డు బిల్లులను ఆలస్యంగా చెల్లిస్తే రుసుములు, వడ్డీలు ఉంటాయి. మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావానికి దారి తీస్తుంది.

ఖర్చులను పర్యవేక్షించండి: మీ ఖర్చులను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. అనధికార లావాదేవీలను ముందుగానే గుర్తించండి. కార్డుపై ఉన్న పరిమితిలో గరిష్ఠంగా 30-40 శాతానికి మించి వాడకుండా చూసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని