క్రెడిట్‌ కార్డు.. ఇలా తీసుకుందాం

క్రెడిట్‌ కార్డులు మన రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో ఒక భాగం అయ్యాయి. ఇప్పుడు యూపీఐ ఆధారిత చెల్లింపుల కోసమూ వీటిని ఉపయోగించుకునేందుకు వీలవుతోంది.

Published : 03 May 2024 00:39 IST

క్రెడిట్‌ కార్డులు మన రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో ఒక భాగం అయ్యాయి. ఇప్పుడు యూపీఐ ఆధారిత చెల్లింపుల కోసమూ వీటిని ఉపయోగించుకునేందుకు వీలవుతోంది. అవసరంలో ఖర్చుల కోసం వాడుకోవడంతోపాటు, డబ్బును ఆదా చేయడంలోనూ ఇవి సహాయం చేస్తాయి. మనకు అనుకూలమైన క్రెడిట్‌ కార్డును ఎంపిక చేసుకున్నప్పుడే ప్రయోజనాలు బాగుంటాయి.

మార్కెట్లో ఎన్నో క్రెడిట్‌ కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది తీసుకోవాలన్నది నిర్ణయించుకోవడం కష్టమైన పనే. మీ ఖర్చు అలవాట్లకు అనుగుణంగా మీ కోసం పనిచేసే కార్డును ఎంచుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో కార్డును తీసుకునేటప్పుడు పరిశీలించాల్సిన విషయాలను చూద్దాం..

ఖర్చు అలవాట్లు..

సాధారణంగా క్రెడిట్‌ కార్డును ఎంపిక చేసుకునేటప్పుడు చాలామంది తమ ఖర్చు అలవాట్లను పట్టించుకోరు. ప్రతి అవసరానికీ ఒక క్రెడిట్‌ కార్డును అందిస్తున్న రోజులివి. హోటల్‌ బిల్లులు, ప్రయాణాలు, నిత్యావసరాలు, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లలో కొనుగోలు, పెట్రోలు ఇలా పలు అవసరాలకు వినియోగించినప్పుడు రివార్డు పాయింట్లను అందిస్తాయి. మీరు ఎక్కడ అధికంగా ఖర్చు చేస్తున్నారో చూసుకోండి. దీనికోసం రెండు మూడు నెలల ఖర్చుల జాబితాను తీసుకొని పరిశీలించండి. వీటికి అనుగుణంగా రివార్డులు, నగదు వెనక్కిలాంటి ప్రయోజనాలను అందించే కార్డును ఎంపిక చేసుకోండి.

వార్షిక రుసుములు..

క్రెడిట్‌ కార్డులను వినియోగించినప్పుడు వార్షిక రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కార్డులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తాయి. దీనికి బదులుగా కొన్ని విలాసవంతమైన ప్రయోజనాలను అందిస్తుంటాయి. వీటిని మీరు ఎంత మేరకు ఉపయోగిస్తారో పరిశీలించండి. అవసరం లేకుండా అధిక రుసుములు ఉన్న కార్డులను తీసుకోవద్దు. వార్షిక రుసుములు లేని వాటిని ఎంపిక చేసుకోవడమే ఎప్పుడూ మంచిది. కొన్ని కార్డులు రుసుములను విధించినా, తర్వాత ఆ మొత్తాన్ని వెనక్కి ఇస్తుంటాయి. వీటినీ పరిశీలించాలి.

వడ్డీ రేట్లు..

బిల్లుల చెల్లింపులు ఎప్పుడూ సకాలంలోనే చేయాలి. ఒకవేళ ఆలస్యం చేస్తే.. క్రెడిట్‌ కార్డు విధించే వడ్డీ అధికంగా ఉంటుందని మర్చిపోవద్దు. కార్డును తీసుకునేటప్పుడు చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు. కేవలం రివార్డులు, ఇతర ప్రయోజనాలపైనే దృష్టి పెడతారు. అనుకోని పరిస్థితుల్లో బిల్లు చెల్లించకపోతే.. తక్కువ  వార్షిక వడ్డీని విధించే కార్డును ఎంచుకోండి.

దీర్ఘకాలిక ప్రయోజనాలు..

కార్డును తీసుకున్నప్పుడు ఒకేసారి కొన్ని రివార్డు పాయింట్లు, బోనస్‌లను అందిస్తుంటాయి. ఇవి తాత్కాలిక ప్రయోజనాలే. రాబోయే రోజుల్లో ఇచ్చే రివార్డులను పరిశీలించాలి. పాయింట్లను ఎలా రిడీమ్‌ చేసుకోవాలి, వినియోగదారులకు అందిస్తున్న సేవలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని, కార్డును ఎంపిక చేసుకోవాలి.

షరతులతో జాగ్రత్త..

దరఖాస్తు చేసే ముందు ఫీజులు, వడ్డీ రేట్లు, రివార్డు పాయింట్ల విధానం, వాటిని ఎలా వాడొచ్చు.. తదితర నిబంధనలు, షరతులను నిశితంగా పరిశీలించండి. కనీస నెలవారీ చెల్లింపు, అదనపు గడువు, విదేశీ లావాదేవీలపై వసూలు చేసే రుసుములనూ చూడండి.

ఒకటికి మించి దరఖాస్తులు..

ఒకేసారి ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులకు దరఖాస్తు చేయడం మంచిది కాదు. దీనివల్ల మీ క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది. ప్రతి దరఖాస్తు వివరాలూ మీ రుణ చరిత్ర నివేదికలో కనిపిస్తాయి. ఫలితంగా స్కోరు తాత్కాలిక తగ్గుదలకు కారణమవుతుంది. ఒక కార్డును తీసుకున్న తర్వాతే మరో కార్డుకు దరఖాస్తు చేయండి. ఒకవేళ కార్డు రాకపోతే.. దానికి కారణాలు తెలుసుకొని, సరి చేసుకున్నాకే మరోసారి దరఖాస్తు చేయాలి. కార్డులు కావాలని బ్యాంకులను వెంటవెంటనే కోరితే మీరు రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారని బ్యాంకులు భావిస్తాయి.

మోసపోవద్దు..

ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో సైబర్‌ నేరాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇందులోనూ క్రెడిట్‌ కార్డు మోసాలు అధికంగా ఉంటున్నాయి. కార్డును వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ లావాదేవీలను నిర్వహించేప్పుడు కార్డు వివరాలు, ఓటీపీల విషయంలో జాగ్రత్త అవసరం. ఏమైనా అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకు/కార్డు సంస్థ దృష్టికి తీసుకెళ్లాలి. లిఖిత పూర్వక ఫిర్యాదును నమోదు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని