అప్పు చేసి ఇల్లు కొంటున్నారా?

సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. దీన్ని నిజం చేసుకునే క్రమంలో గృహరుణం తీసుకుంటాం. తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తున్నవారూ.. ఇప్పటికే ఉన్నదాన్ని మార్చి, పెద్దది తీసుకోవాలనుకున్నా.

Updated : 03 May 2024 06:52 IST

సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. దీన్ని నిజం చేసుకునే క్రమంలో గృహరుణం తీసుకుంటాం. తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తున్నవారూ.. ఇప్పటికే ఉన్నదాన్ని మార్చి, పెద్దది తీసుకోవాలనుకున్నా. కొన్ని ఆర్థిక విషయాలను పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఇంటి రుణం ఒక దీర్ఘకాలిక ఒప్పందం. దీన్ని తీర్చేందుకు కనీసం 15 నుంచి 30 ఏళ్ల సమయం పడుతుంది. ఇంతకాలంపాటు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ, మరో వైపు ఇతర ఆర్థిక లక్ష్యాలకూ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి సిద్ధంగా ఉన్నప్పుడే ఇంటి రుణం తీసుకునేందుకు ప్రయత్నించాలి.

అంచనా వేయండి..

గృహరుణం తీసుకునే ముందు మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడం ముఖ్యం. ప్రధానంగా మీ ఆదాయం, పొదుపు, ఇప్పటికే ఉన్న అప్పులను లెక్కించండి. మీ నెలవారీ నగదు రాకపోకలను గుర్తించండి. మీ ఆర్థిక లక్ష్యాలు, ఖర్చులపై స్పష్టమైన అవగాహనకు రావాలి. వీటన్నింటినీ లెక్కలు వేసుకున్నాకే మీ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ఇంటి కొనుగోలు బడ్జెట్‌ను నిర్ణయించుకునేందుకు వీలవుతుంది.

ఆదాయం నిష్పత్తి..

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటి రుణ దరఖాస్తును ఆమోదించే ముందు చూసే ముఖ్యమైన విషయం.. మీ ఆదాయంలో రుణ నిష్పత్తి ఎంత అనేది. ఇది మీ ఆదాయంలో నుంచి రుణాలకు ఎంత మొత్తం చెల్లిస్తున్నారన్నది చెబుతుంది. తక్కువ నిష్పత్తి ఉంటే.. మంచి రుణగ్రహీత అని అర్థం. సాధారణంగా బ్యాంకులు ఆదాయంలో రుణాల నిష్పత్తి 35 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడు అప్పు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. మీకు ఇతర ఆదాయాలున్నప్పుడు వాటిని తెలియజేయడం ద్వారా రుణం వచ్చే అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు.

ముందస్తు చెల్లింపు..

ఇంటి కొనుగోలు కోసం ముందుగా కొంత మొత్తాన్ని చేతి నుంచి చెల్లించాల్సి వస్తుంది. దీన్ని డౌన్‌ పేమెంట్‌ అంటాం. ఇంటి కొనుగోలు ధరలో దాదాపు 20 శాతం వరకూ చేయడం మంచిది. కొంతమంది రుణదాతలు మొత్తం ఇంటి విలువకు రుణం ఇస్తారు. ఇందులో ఏది ఎంచుకోవాలన్నది సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ చేతిలో మిగులు మొత్తం ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకూ ముందస్తు చెల్లింపు చేసి, రుణం తీసుకోవడమే మంచిది. దీనివల్ల దీర్ఘకాలంలో వడ్డీ భారం తగ్గుతుంది.

అదనపు ఖర్చుల కోసం..

కొత్త ఇంటిని కొనుగోలు చేసినప్పుడు గృహరుణ వాయిదాలకు మించి చూడాల్సిన ఖర్చులు ఎన్నో ఉంటాయి. ఆస్తి పన్ను, నెలవారీ నిర్వహణ రుసుములు, ఇంటి మరమ్మతులు, బిల్లులు ఇలా పలు ఖర్చులు ఉంటాయి. వీటన్నింటికీ కొంత మొత్తం విడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఆర్థికంగా చిక్కులు తప్పవు.

భవిష్యత్తు ప్రణాళికలు..

ఇంటి రుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు మీ దీర్ఘకాలిక లక్ష్యాలను పరిశీలించండి. ఒక్కసారి రుణం తీసుకున్న తర్వాత మీ ఆదాయంలో అధిక భాగం ఈ రుణ వాయిదాకే వెళ్తుంది. మీ భవిష్యుత్తు ఆర్థిక లక్ష్యాల విషయంలో కొంత రాజీ పడక తప్పని పరిస్థితి వస్తుంది. కాబట్టి, ఈ విషయంలో ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు కుటుంబానికి తగిన ఆర్థిక భరోసానూ కల్పించాలి. ఇందుకోసం లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీని ఎంచుకోవాలి. దీంతోపాటు మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడమూ మర్చిపోవద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని