Gmail Purchases Tab: జీ-మెయిల్‌లో కొత్త ఫీచర్.. ఆర్డర్లను ట్రాక్‌ చేయడం ఇక సులభం!

Eenadu icon
By Business News Team Published : 12 Sep 2025 16:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్: ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు సంబంధించి ఇన్‌వాయిస్‌, బిల్లు లేదా ఆర్డర్‌ ట్రాకింగ్‌ వంటి మెయిల్స్‌ కోసం మామూలుగా సెర్చ్‌ చేయాల్సి ఉంటుంది. అన్ని మెయిల్స్‌తో కలిసిపోయి ఉండటంతో ఆయా తరహా మెయిళ్లను కనిపెట్టడం కాస్త కష్టమే. ఈ ఇబ్బందికి చెక్‌ పెడుతూ గూగుల్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు సంబంధించిన అన్ని మెయిల్స్‌ను ఒకేచోట చూపించే విధంగా కొత్త ట్యాబ్‌ను ప్రవేశపెట్టింది. రానున్న ఫెస్టివల్‌ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు ఉపయోగపడే విధంగా గూగుల్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

కొనుగోళ్లు (Purchases) అనే కొత్త ట్యాబ్‌తో ఆర్డర్‌ కన్ఫర్మేషన్‌లు, షిప్పింగ్ అప్‌డేట్స్‌ వంటి అన్ని మెయిల్‌లు ఒకేచోట అందుబాటులో ఉండేలా ఈ ట్యాబ్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఉన్న ప్యాకేజ్‌-ట్రాకింగ్‌ ఫీచర్‌ ఆధారంగా ఇది మరింత అప్‌గ్రేడ్‌గా వస్తోంది. ఈ ఫీచర్‌తో 24 గంటల్లో డెలివరీ అయ్యే ఆర్డర్లను హైలైట్‌ చేస్తూ, సంబంధిత మెయిల్‌ పైభాగంలో ఆర్డర్‌ కార్డులను చూపించే సౌకర్యం కల్పిస్తోంది. ఈ ట్యాబ్‌లో ‘Arriving Soon’ కార్డులు కూడా కనిపిస్తాయి. వీటితో త్వరలో రానున్న డెలివరీలను సులభంగా చూడొచ్చు.

అదే విధంగా ప్రమోషన్స్‌ ట్యాబ్‌లో ‘most relevant’ అనే కొత్త ఫిల్టర్‌ను జోడించారు. ఎక్కువగా ఇంటరాక్ట్‌ అయ్యే బ్రాండ్ల నుంచి వచ్చే ఆఫర్లు, అప్‌డేట్స్‌ ముందుగా కనిపించేలా ఇది పనిచేస్తుంది. ఈ ఫిల్టర్‌ వద్దనుకుంటే యూజర్లు ఎప్పుడైనా ‘Most Recent’ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అదనంగా జీ-మెయిల్‌ nudges ద్వారా రాబోయే ఆఫర్లు, డీల్స్‌ను హైలైట్‌ చేస్తూ యూజర్లకు అలర్ట్‌ ఇస్తుంది. ఈ కొత్త ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్, వెబ్‌లో దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు