JioHotStar: 1 బిలియన్‌ వీక్షకులే లక్ష్యం.. ఎయిర్‌టెల్‌, వొడాతో జియో చర్చలు

Eenadu icon
By Business News Team Published : 21 Mar 2025 13:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

JioHotStar | ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 (IPL 2025) రేపటినుంచి ప్రారంభం కానుంది. ఈ తరుణంలో వీక్షకుల సంఖ్యను పెంచుకోవాలని జియో హాట్‌స్టార్‌ (JioHotstar) చూస్తోంది. మరిన్ని డేటా ప్లాన్లను అందుబాటులోకి తేవాలని చూస్తోంది. తన ప్లాట్‌ఫామ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను జోడించాలని భావిస్తోంది. అందులోభాగంగా ప్రముఖ టెలికాం సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా.. టెలికాం సంస్థలు అందిస్తున్న డేటా ప్లాన్‌లతో జియో హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను బండిల్‌ చేయాలని చూస్తోంది. యూజర్ల సంఖ్యను పెంచుకొనేందుకు ఈ చర్య సాయపడుతుందని భావిస్తోంది. 2025 ఐపీఎల్‌లో టెలివిజన్‌, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 1 బిలియన్‌ కంటే ఎక్కువమంది వీక్షకులను చేరుకోవాలని జియోస్టార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో టెలికాం డేటా వినియోగం గణనీయంగా పెరుగుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.

2024 ఐపీఎల్‌ సమయంలో జియో సినిమాలో వీక్షకుల సంఖ్య 620 మిలియన్లుగా నమోదైంది. స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో 541 మిలియన్లను తాకింది. రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18, స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ విలీనం తర్వాత ఏర్పడిన ‘జియోస్టార్‌’కు ఈ ఐపీఎల్‌ కీలకం. లీగ్‌ సమయంలో ప్రకటనలతో రూ.4,500 కోట్ల ఆదాయాన్ని పొందాలని చూస్తోంది. ఇప్పటికే 20 మంది స్పాన్సర్‌లను సొంతం చేసుకుంది.

జియోహాట్‌స్టార్‌తో ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్లు

ఐపీఎల్‌ నేపథ్యంలో జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్‌ రెండు కొత్త డేటా ప్లాన్లను ప్రవేశపెట్టింది. 30 రోజుల వ్యాలిడిటీతో రూ.100 ప్లాన్‌ తీసుకొచ్చింది. ఓటీటీ సభ్యత్వంతో పాటు 5జీబీ డేటా ఇస్తోంది. ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన మరో ప్లాన్‌ ధర రూ.195. 90 రోజుల వ్యాలిడిటీ, 15జీబీ డేటా పొందొచ్చు. వీటితో పాటు జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. ఐపీఎల్‌ కోసం జియో ఇప్పటికే పలు ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రూ.100తో డేటా ప్లాన్‌ తీసుకొచ్చింది. 90 రోజుల వ్యాలిడిటీ, 5జీబీ డేటా అందిస్తోంది. అలాగే, రూ.299 కంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జి చేసుకుంటే ఉచితంగా ఐపీఎల్‌ను వీక్షించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు