No cost EMI: పండగ సేల్‌లో నో-కాస్ట్‌ ఈఎంఐతో కొనుగోళ్లు చేస్తున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే..!

No cost EMI: పండగ ప్రత్యేక సేల్‌లో భాగంగా గ్యాడ్జెట్లు, గృహోపకరణాలపై రిటైలర్లు నో-కాస్ట్‌ ఈఎంఐను ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే, దీన్ని ఎంచుకునే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.. 

Updated : 11 Oct 2023 14:27 IST

No cost EMI | ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగ సీజన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిటైలర్లు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. గ్యాడ్జెట్లు, గృహోపకరణాలపై నో-కాస్ట్‌ లేదా జీరో-కాస్ట్‌ ఈఎంఐ (No-cost EMI) పథకాలను ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో తక్షణమే డబ్బు చేతిలో లేనివారు చాలా మంది ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకుంటుంటారు. మరి నో-కాస్ట్‌ ఈఎంఐ (No-cost EMI) ఆప్షన్‌ను ఎంచుకోవడానికి ముందు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం..

ఎలా పనిచేస్తుంది?

నో-కాస్ట్‌ ఈఎంఐ (No-cost EMI) సదుపాయాన్ని ఎంచుకుంటే కస్టమర్‌ ప్రోడక్ట్‌ను కొన్న వెంటనే దాని ధర మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి వడ్డీ భారం లేకుండా అసలు ధరను వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వాస్తవంగా వడ్డీ భారాన్ని రద్దు చేయడమేమీ ఉండదని ఆర్థిక నిపుణులు తెలిపారు. దాన్ని తయారీదారులు లేదా విక్రేతలు భరిస్తారు. తిరిగి వారు ఆ మొత్తాన్ని ఎక్కువ మొత్తంలో ప్రోడక్ట్‌లను విక్రయించడం వల్ల వచ్చే లాభం ద్వారా భర్తీ చేసుకుంటారు.

మరికొన్నిసార్లు నో-కాస్ట్‌ ఈఎంఐ (No-cost EMI) ఎంచుకున్న కస్టమర్లకు ఇతర ప్రయోజనాలను రద్దు చేస్తారు. రాయితీ, ఆఫర్లను రద్దు చేసి ప్రోడక్ట్‌ వాస్తవ ధరను ఈఎంఐ కిందకు మారుస్తారు. ఇంకొన్ని సందర్భాల్లో వడ్డీ భారాన్ని వస్తువుల ధరలో కలిపేసి ఆ మొత్తాన్ని ఈఎంఐగా మారుస్తారు. పైన తెలిపిన మూడు సందర్భాల్లో కేవలం మొదటి దాంట్లో మాత్రమే కస్టమర్‌కు పూర్తి ప్రయోజనం చేకూరుతుంది.

పండగ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌ కొంటున్నారా? అమెజాన్‌లో వీటిపై ఓ లుక్కేయండి!

ఉదాహరణకు మీరు రూ.1 లక్ష ల్యాప్‌టాప్‌ తీసుకున్నారనుకుందాం. ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. వడ్డీరేటు 12 శాతం. ఆరు నెలల వాయిదాల చెల్లించాలి. మొత్తం రూ.6,000 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పైన తెలిపినట్లుగా మొదటి సందర్భంలో అయితే, ఈ భారాన్ని తయారీదారులు, విక్రేతలు భరిస్తారు. పెద్ద సంఖ్యలో వస్తువులను అమ్మడం వల్ల వచ్చిన లాభంతో సరిపెట్టుకుంటారు. రెండో సందర్భంలో.. ఒకేసారి ల్యాప్‌టాప్‌ ధరను చెల్లించడం వల్ల ఉన్న రాయితీలు, ఆఫర్లు సహా ఇతర ప్రయోజనాలను తీసేస్తారు. ఉదాహరణకు ఏకమొత్తంలో డబ్బు చెల్లించడం వల్ల మీకు రూ.10 వేల రాయితీ లభిస్తుందనుకుందాం. అలాగే ల్యాప్‌టాప్‌పై కీబోర్డ్‌, మౌస్‌ వంటి వస్తువులను ఉచితంగా ఇస్తారనుకుందాం. నో-కాస్ట్‌ ఈఎంఐ (No-cost EMI) ఎంచుకోవడం వల్ల అవేవీ ఉండవు. వాస్తవ ధర అయిన రూ.1 లక్షను వాయిదాల కిందకు మారుస్తారు. ఇక మూడో సందర్భంలో వడ్డీ రూ.6,000ను కూడా కలిపి ల్యాప్‌టాప్‌ ధరను రూ.1.06 లక్షలుగా పేర్కొంటారు. ఆ మొత్తాన్నే ఈఎంఐల కిందకు మారుస్తారు.

ఎప్పుడు ఎంచుకోవాలి?

ఒకవేళ ఖరీదైన వస్తువులు కొని.. మొత్తం ఒకేసారి చెల్లించే పరిస్థితిలో లేనప్పుడు నో-కాస్ట్‌ ఈఎంఐ (No-cost EMI)కి వెళ్లడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసి.. ఆ మొత్తాన్ని వాయిదాల కిందకు మార్చుకోవడం కంటే నో-కాస్ట్‌ ఈఎంఐ (No-cost EMI)ని ఎంపిక చేసుకోవడం మేలు. క్రెడిట్‌ కార్డ్‌ ఈఎంఐపై 20- 25 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

స్మార్ట్‌ టీవీకి పండగే

ఇవి గుర్తుంచుకోవాలి..

  • కొన్ని నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI)లు స్వల్పకాలిక గడువుతో వస్తాయి. దీనివల్ల వాయిదా మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సకాలంలో వాయిదా చెల్లించలేకపోతే మాత్రం క్రెడిట్‌ స్కోర్‌పై తీవ్ర ప్రభావం ఉంటుంది. పైగా జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే నో-కాస్ట్‌ ఈఎంఐ (No-cost EMI)ని ఎంచుకోవడానికి ముందే ఎన్ని వాయిదాలు, ఎంత మొత్తం చెల్లించాలో చూసుకోవాలి.
  • ఒకవేళ నో-కాస్ట్‌ ఈఎంఐలో వస్తువులు దొరుకుతున్నాయి కదా అని ఎడాపెడా కొనుగోలు చేస్తే.. బిల్లు భారం పెరిగి అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. పైగా క్రెడిట్‌ కార్డు జారీ సంస్థ ఇచ్చిన లిమిట్‌ను అధికంగా వినియోగించడం వల్ల సిబిల్‌ స్కోరుపై ప్రభావం పడే అవకాశం ఉంది.
  • నో-కాస్ట్‌ ఈఎంఐ (No-cost EMI)ని కొన్ని కంపెనీలు మాత్రమే ఆఫర్‌ చేస్తుంటాయి. అది కూడా ఎంపిక చేసిన వస్తువులపై మాత్రమే ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రత్యేక బ్రాండ్‌లో ప్రత్యేక వస్తువును నో-కాస్ట్‌ ఈఎంఐలో కొనుగోలు చేద్దామని ముందే నిర్ణయం తీసుకోవద్దు.
  • మరికొన్ని సార్లు నో-కాస్ట్‌ ఈఎంఐ (No-cost EMI) ఎంపిక చేసుకోవడానికి ఎంతో కొంత డౌన్‌పేమెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది.
  • ఒక్కోసారి కంపెనీలు ప్రాసెసింగ్‌ ఫీజు వంటి ఇతరత్రా ఛార్జీల రూపంలో కూడా వడ్డీని వసూలు చేస్తుంటాయి. దీన్ని గమనించాలి.
  • కొనాలనుకుంటున్న వస్తువు అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిటైలర్లలో ఏ ధరకు అందుబాటులో ఉందో చూడాలి. అప్పుడే వడ్డీ భారాన్ని వస్తువు అసలు ధరలో కలిపారో లేదో తెలుస్తుంది. అలాగే నో-కాస్ట్‌ ఈఎంఐ (No-cost EMI) ఎంచుకోవడం వల్ల వర్తించే నియమ నిబంధనలన్నింటినీ ముందే అర్థం చేసుకోవాలి. వాయిదా మొత్తం, ఎన్ని నెలలు, ఫీజులు, ముందస్తు చెల్లింపు ఛార్జీల వంటి వివరాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈఎంఐ తేదీని మర్చిపోవద్దు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు