Smart TV: స్మార్ట్‌ టీవీకి పండగే

దసరా -దీపావళి పండగ సీజన్‌లో సాధారణంగానే టీవీల అమ్మకాలు అధికంగా జరుగుతుంటాయి.

Updated : 10 Oct 2023 10:30 IST

ఈసారి అత్యధిక అమ్మకాలు ఇవే
కలిసొస్తున్న బ్రాడ్‌బ్యాండ్‌- ఓటీటీ పథకాలు
పోటాపోటీగా బ్రాండ్ల రాయితీలు
ఈనాడు వాణిజ్య విభాగం

సరా -దీపావళి పండగ సీజన్‌లో సాధారణంగానే టీవీల అమ్మకాలు అధికంగా జరుగుతుంటాయి. ఈసారి క్రికెట్‌ ప్రపంచకప్‌ పోటీలూ ఇప్పుడే నిర్వహిస్తుండటంతో టీవీల కొనుగోళ్లు మరింత జోరుగా సాగుతున్నాయని కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. ఎల్‌ఈడీల్లో స్మార్ట్‌మోడళ్ల విక్రయాలే అత్యధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో ప్రత్యేకంగా కొన్ని బ్రాండ్లు భారీ రాయితీలు ఆఫర్‌ చేస్తుండగా, మరికొన్ని దిగ్గజ బ్రాండ్లు సంప్రదాయ విక్రయశాలలతో పాటు ఆన్‌లైన్‌లోనూ రాయితీలిస్తున్నాయి. టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ పథకాలను ఆవిష్కరించడం, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై అతి తక్కువ సమయంలోనే కొత్త సినిమాలు ప్రసారమవుతుండటం వల్ల స్మార్ట్‌టీవీల కొనుగోలుకు గ్రామీణులూ మొగ్గుచూపుతున్నారు.

గత కొన్నేళ్లుగా టీవీ అమ్మకాల వృద్ధిలో స్తబ్దత నెలకొంది. ఈ ఏడాది మాత్రం స్వాతంత్య్ర దినోత్సవంతో మొదలుకుని ఓనమ్‌, వినాయక చవితి, రాబోయే దసరా-దీపావళితో పాటు నూతన సంవత్సర వేడుకల వరకు టీవీల అమ్మకాలు బాగుంటాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. 4కే రిజొల్యూషన్‌తో స్మార్ట్‌టీవీలో చిత్ర స్పష్టతను ఆస్వాదించేందుకు హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ పథకాలు ఉపయోగ పడుతున్నాయి. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ ప్రారంభించిన 5జీ సేవలతో పాటు వైర్‌లెస్‌ ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలతో నెట్ వేగం 30-1000 ఎంబీపీఎస్‌ వరకు లభిస్తున్నందున, స్మార్ట్‌టీవీలపై ప్రజలు మొగ్గుచూపుతున్నారని షియామీ ఇండియా అధిపతి బి.మురళీకృష్ణన్‌ తెలిపారు. తెలుగులోనూ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల జోరు పెరగడం స్మార్ట్‌ టీవీలకు గిరాకీ పెంచుతోంది.

రూ.50,000లోపే 65 అంగుళాల టీవీలూ

ఇంటర్నెట్‌ వేగం పెరగడం వల్ల, 4కే స్పష్టతతో-55 అంగుళాలు, అంతకుమించిన పెద్ద తెరలపై ప్రసారాలు వీక్షించడం అధికమవుతోంది. ఇప్పుడు 32 అంగుళాల స్మార్ట్‌ టీవీలను రూ.10,000 కంటే తక్కువకే ఏసర్‌, షియామీ, వీడబ్ల్యూ, టీసీఎల్‌, హ్యుందాయ్‌ వంటి కంపెనీలు ఆఫర్‌ చేస్తున్నాయి. ఎల్‌జీ కూడా రూ.12,000 శ్రేణి నుంచీ ఆన్‌లైన్‌ మోడళ్లు అందిస్తోంది. థామ్సన్‌ బ్రాండ్‌ అయితే 43 అంగుళాల క్యూఎల్‌ఈడీ టీవీని రూ.20,999కి, 55 అంగుళాల టీవీని రూ.30,999, 65 అంగుళాల స్మార్ట్‌ ఎల్‌ఈడీని రూ.47,999కే అందిస్తోంది.

91 శాతం ఇవే: దేశీయంగా ఏడాదికి 1.10 కోట్ల టీవీలు అమ్ముడవుతున్నాయని అంచనా. ఇందులో 91 శాతం స్మార్ట్‌ మోడళ్లే ఉంటున్నాయి. ఇందులోనూ షియామీ, శామ్‌సంగ్‌ తొలి 2 స్థానాల్లో ఉన్నాయని అంచనా. ఇవి రెండూ ఆన్‌లైన్‌తో పాటు సంప్రదాయ విక్రయశాలల్లోనూ తమ ఉత్పత్తులను అమ్ముతున్నాయి. 5 అంతర్జాతీయ బ్రాండ్లు థామ్సన్‌, కొడాక్‌, బ్లాపన్ట్‌, వైట్‌ వెస్టింగ్‌హౌస్‌, వెస్టింగ్‌హౌస్‌ టీవీలను దేశీయంగా తయారు చేసి కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్న సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ కూడా రెండేళ్లలో స్మార్ట్‌టీవీ విపణిలో 8% వాటా సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆ సంస్థ సీఈఓ అవ్‌నీత్‌ సింగ్‌ మార్వా తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి 7 లక్షల స్మార్ట్‌టీవీలు తయారు చేస్తున్నామని, ఉత్తర ప్రదేశ్‌లో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న కొత్త ప్లాంటు అందుబాటులోకి వస్తే ఏడాదికి 20 లక్షల టీవీలు తయారు చేయగలమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్ల టర్నోవర్‌ ఆశిస్తున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.2000 కోట్లకు చేరుతుందనే అంచనాను ఆయన వ్యక్తం చేశారు. 2022-23లో 4.50 లక్షల స్మార్ట్‌ీవీల విక్రయంపై రూ.700 కోట్ల టర్నోవర్‌ సాధించామన్నారు. ప్రస్తుత పండగ సీజన్‌లోనే 4 లక్షల టీవీలు అమ్మగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తమ టీవీలన్నీ ఆండ్రాయిడ్‌, గూగుల్‌ టీవీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తాయని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని