Personal Loan: తక్కువ క్రెడిట్‌ స్కోరున్నవారు వ్యక్తిగత రుణం పొందొచ్చా?

Personal loan: తక్కువ క్రెడిట్‌ స్కోరున్నవారు వ్యక్తిగత రుణాన్ని పొందడానికి కొన్ని మార్గాలు, అవకాశాలున్నాయి. అవేంటో చూడండి.

Updated : 13 Nov 2023 20:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇతర రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణం (Personal loan) పొందడం కాస్త సులభమే. ప్రస్తుతం ఏ రుణానికి దరఖాస్తు చేసినా క్రెడిట్‌ స్కోరు తప్పక చూస్తారు. అందులోనూ వ్యక్తిగత రుణం అసురక్షిత రుణం కాబట్టి.. ఈ రుణాలకు స్కోరు పట్టింపు మరీ ఎక్కువ. రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఎంత విశ్వసనీయంగా ఉంటారనేది క్రెడిట్‌ స్కోరు తెలియజేస్తుంది. ఈ స్కోరు మీరు బకాయిలను గడువులోగా తిరిగి చెల్లించడంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలియజేస్తుంది. స్కోరు అనేది క్రెడిట్‌ రిపోర్ట్‌ల సమాచారంపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తి క్రెడిట్‌ హిస్టరీ, చెల్లింపుల అలవాట్లు, బకాయి మొత్తం, ఇతర ఫైనాన్షియల్‌ డేటా క్రెడిట్‌ రిపోర్ట్‌లో ఉంటాయి.

క్రెడిట్‌ స్కోరు

ఇది మీ క్రెడిట్‌ హిస్టరీ. ఆర్థిక అలవాట్లను ప్రతిబింబించే మూడు అంకెల సంఖ్య. ఇది 300-900 వరకు ఉంటుంది. ముఖ్యంగా మీ క్రెడిట్‌ను ఎంత మెరుగ్గా నిర్వహించారో చూపిస్తుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వంటి రుణసంస్థలు.. రుణగ్రహీతగా మీ విశ్వసనీయతను అంచనా వేయడానికి ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. మీరు సిబిల్‌తో పాటు అనేక వెబ్‌సైట్ల ద్వారా మీ క్రెడిట్‌ స్కోరును ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

స్కోరు ఎంతుండాలి?

మెరుగైన క్రెడిట్‌ స్కోరున్నవారిని రుణ సంస్థలు నమ్మకమైన వ్యక్తిగా భావించి రుణ అప్రూవల్‌ను వేగవంతం చేస్తాయి. మరోవైపు తక్కువ సిబిల్‌ స్కోరున్నవారిని క్రెడిట్‌ రిస్క్‌ ఎక్కువ ఉన్నవారిగా భావించి రుణ సంస్థలు రుణ మంజూరు విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకుంటాయి. 750-900 మధ్య క్రెడిట్‌ స్కోరుంటే వారిని అద్భుతమైన నమ్మకదగిన వ్యక్తిగా చూస్తాయి. 700-749 మధ్య క్రెడిట్‌ స్కోరుంటే వారిని మంచి (గుడ్‌) క్రెడిట్‌ స్కోరుగానే భావిస్తాయి. 650-699 మధ్య క్రెడిట్‌ స్కోరుంటే మధ్యస్తమైన రిస్క్‌ ఉన్నట్లు భావిస్తాయి. 600-649 మధ్య క్రెడిట్‌ స్కోరుంటే వారిని అత్యంత ప్రమాదకరంగా చూస్తాయి. 600లోపు క్రెడిట్‌ స్కోరుంటే వారిని రుణ సంస్థలు అసలు విశ్వసించవు. దీన్ని బట్టి సిబిల్‌ స్కోరు 600లోపు ఉన్న వ్యక్తులు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాన్ని పొందడం కష్టమే. అయితే, స్కోరు 650-700 మధ్య ఉంటే కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు రుణ దరఖాస్తును ఆమోదిస్తున్నాయి. రుణాన్ని మంజూరు చేసేటప్పుడు మెరుగైన క్రెడిట్‌ స్కోరు మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. కాబట్టి తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్నా వ్యక్తిగత రుణం పొందొచ్చు. అందుకున్న మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం..

స్థిరమైన ఆదాయం

మీరు ఉద్యోగం చేసేవారై ఉండి ఆదాయపరంగా పర్వాలేని స్థితిలో ఉంటే వచ్చే ఆదాయాన్ని రుణ సంస్థకు తెలపొచ్చు. మీ నెలవారీ ఆదాయం కేవలం సంఖ్య మాత్రమే కాదు.. ఇది మీ రీ-పేమెంట్‌ సామర్థ్యాన్ని సూచిస్తుంది. రుణ మంజూరుకు రుణ సంస్థలు దరఖాస్తుదారుడి ఆదాయాన్ని చూస్తాయి. అధికాదాయం ఉన్న వ్యక్తులు రుణ ఎగవేతకు దూరంగా ఉండొచ్చని బ్యాంకులు నమ్ముతాయి. ప్రత్యేకించి మీకు క్రెడిట్‌ హిస్టరీ లేకుంటే.. మీకున్న బలమైన, స్థిరమైన ఆదాయం కొన్నిసార్లు తక్కువ క్రెడిట్‌ స్కోరును భర్తీ చేస్తుంది. దీని ద్వారా రుణ సంస్థ రుణ మంజూరుకు సుముఖతను వ్యక్తం చేయొచ్చు. 

పెద్ద సంస్థలో ఉద్యోగం

రుణం ఆశించే వ్యక్తి ఎక్కడ పనిచేస్తున్నారనేది కూడా రుణ సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయి. కొన్ని స్థిరమైన సంస్థలకు సొసైటీలో పేరు ప్రఖ్యాతులుంటాయి. ఈ సంస్థల మనుగడ, జీతభత్యాలను ఇవ్వడంలో అత్యంత క్రమశిక్షణ లాంటి విషయలు కూడా సంస్థకు పేరు ప్రఖ్యాతలను తీసుకొస్తాయి. రెండు సంవత్సరాల ఉపాధి చరిత్ర కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మీరు ఆర్థిక ఒత్తిడి లేకుండా ఈఎంఐలను తీర్చగలనని మీ ఆదాయ వివరాలను వారికి చూపించి వారిని రుణానికి ఒప్పించొచ్చు. క్రెడిట్‌ స్కోరు తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి సంస్థల్లో పని చేసే వారి రుణ అభ్యర్థనలను కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవచ్చు.

సహ-దరఖాస్తుదారుడు

వ్యక్తిగత రుణ దరఖాస్తులో సహ-దరఖాస్తుదారు(ల)ను చేర్చడం వల్ల బ్యాంకుకు క్రెడిట్‌ రిస్క్‌ తగ్గుతుంది. ఎందుకంటే సహ-దరఖాస్తుదారుడు కూడా రుణాన్ని తిరిగి చెల్లించడంలో బాధ్యత వహిస్తారు. అందువల్ల తక్కువ ఆదాయం, తక్కువ క్రెడిట్‌ స్కోరు, నిలకడలేని ఉపాధి, సరిపోని రీపేమెంట్‌ సామర్థ్యం కారణంగా నిరాశ పడనక్కర్లేదు. వ్యక్తిగత రుణాలను పొందే అవకాశాలు తక్కువగా ఉన్న ఇలాంటి దరఖాస్తుదారులు మెరుగైన క్రెడిట్‌ ప్రొఫైల్‌తో ఉన్న సహ-దరఖాస్తుదారుని జోడించడం ద్వారా వారి అర్హతను మెరుగుపరచుకోవచ్చు. ఇంకా సహ-దరఖాస్తుదారుని కలుపుకోవడం వల్ల వ్యక్తిగత రుణాన్ని అధిక మొత్తంలో పొందవచ్చు.

ఇతర ఆదాయ వనరులు

రుణగ్రహీతలు రెగ్యులర్‌ ఉద్యోగం ద్వారానే కాకుండా, ఏవైనా అద్దెల ద్వారా వచ్చే ఆదాయం, విద్యార్థులకు కోచింగ్‌ ఇవ్వడం, ఫ్రీలాన్స్‌ ఆదాయాలు ఉంటే వాటిని రుణ సంస్థకు మీ ఆదాయ వనరులుగా చూపెట్టొచ్చు. విభిన్న ఆదాయ మార్గాలున్న మిమ్మల్ని రుణసంస్థలు సంపాదనపరుడిగా పరిగణిస్తాయి. క్రెడిట్‌ స్కోరు తక్కువ ఉన్నప్పుడు వీటి వల్ల కూడా మీరు విశ్వసనీయ వ్యక్తిగా బ్యాంకు రుణాన్ని ఆశించొచ్చు.

బ్యాంకు ఖాతాదారుడు

క్రెడిట్‌ స్కోరు తక్కువ ఉన్నప్పుడు వ్యక్తిగత రుణాన్ని పొందడానికి ఇప్పటికే జీతం ఖాతా, క్రెడిట్‌ కార్డు కలిగి ఉన్న బ్యాంకును సంప్రదించడం మంచిది. బ్యాంకుకు మీ నెలవారీ ఆదాయం, ఉపసంహరణ వివరాలు క్షుణ్ణంగా తెలుస్తాయి. కాబట్టి, ఖాతా ఉన్నవారికి బ్యాంకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. అంతేకాకుండా పొదుపు ఖాతాల‌ను తెరిచిన త‌ర్వాత వాటిని నిర్వహించే మంచి చ‌రిత్ర క‌లిగి ఉంటే మీరు మీ బ్యాంకుకు నమ్మకమైన ఖాతాదారుడవుతారు. మీ బ్యాంకుతో మంచి సంబంధాలు, ముందు నుంచి మంచి ఆర్థిక లావాదేవీలు క‌లిగి ఉన్నట్లయితే.. అవసరమైనప్పుడు వ్యక్తిగత రుణం పొంద‌డం సుల‌భ‌మ‌వుతుంది. ఎందుకంటే, బ్యాంకులు త‌మ ఆర్థిక రికార్డుల‌ ఫైల్‌లో ఉన్న ఖాతాదారులను, రుణగ్రహీతలను ముందుగా విశ్వసిస్తాయి. మంచి ఖాతాదారుల‌ను నిలుపుకోవాల‌ని బ్యాంకులు కోరుకుంటాయి. అందుచేత బ్యాంకులతో మంచి ఆర్థిక సత్సంబంధాలను నిర్వహించాలి. 

చివరిగా: మెరుగైన క్రెడిట్‌ స్కోరు కలిగి ఉంటే మంచిదే గానీ తక్కువ క్రెడిట్‌ స్కోరు కలిగి ఉండడం మీ రుణ ఆకాంక్షలకు ముగింపు కాదని గుర్తుంచుకోండి. మీ ఆర్థిక ప్రయాణంలో ఎల్లప్పుడూ తగిన రెగ్యులర్‌ ఆదాయాన్ని కలిగి ఉండడం వల్ల రుణ అర్హత మెరగవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని