Sundar Pichai: గూగుల్‌లో మళ్లీ వ్యక్తిగత ఇంటర్వ్యూలు

Eenadu icon
By Business News Desk Published : 17 Aug 2025 02:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఏఐ సాధనాలతో మోసం చేస్తున్న వారికి కళ్లెం
కనీసం ఒక విడత నేరుగా ముఖాముఖి

దిల్లీ: దృశ్య మాధ్యమ (వర్చువల్‌) విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు జరుపుతుంటే, నమ్మదగిన వ్యక్తులు సంస్థలోకి రావడం లేదని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే గూగుల్‌లో మళ్లీ వ్యక్తిగత ఇంటర్య్వూలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులను నిర్ధారించుకోవడానికి, అభ్యర్థులను కనీసం ఒక విడత వ్యక్తిగత ఇంటర్వ్యూలతో పరీక్షించాలని గూగుల్‌ యోచిస్తోందని పిచాయ్‌ తెలిపారు.

ఆన్‌లైన్‌లో ఎందుకు వద్దంటే..: కృత్రిమ మేధ (ఏఐ) సమస్య చాలా విస్తృతంగా వ్యాపించినందున, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు రిమోట్‌ జాబ్‌ ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలను నిర్వహించవద్దని గూగుల్‌ ఉద్యోగులు కంపెనీ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత అభ్యర్థులు రియల్‌-టైమ్‌ కోడింగ్‌ సవాళ్లను పరిష్కరించాల్సి ఉంటుందని, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూల సమయంలో కెమేరా బయట ఏఐ సాధనాలను ఉపయోగించడం వల్ల అభ్యర్థుల వాస్తవిక సత్తా తెలియడం లేదని వాపోయారు. దీనిపై గూగుల్‌ ఇప్పుడు పునరాలోచనలో పడింది.

గతంలో ఎందుకు నిర్వహించారు?: గూగుల్‌ గతంలో ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలను ఎందుకు ఇష్టపడిందంటే.. ప్రాథమిక సవాలును ఎదుర్కోవడం ఇష్టం లేకపోవడం వల్లే అని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బ్రియాన్‌ ఓంగ్‌ అంగీకరించారు. వర్చువల్‌ ఇంటర్వ్యూలు రెండు వారాల పాటు వేగంగా షెడ్యూల్‌ చేయడం సులభమని తెలిపారు. దీంతో శ్రమ, సమయం, వ్యయాలు తగ్గుతాయని పేర్కొన్నారు. అయితే ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ప్రక్రియలో ఏఐ ఇప్పుడు ఎలా ప్రభావం చూపుతుందో సమగ్రంగా పర్యవేక్షించడానికి మేము కచ్చితంగా ఇంకా ఎక్కువగా దీనిపై పని చేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.

మోసం చేస్తోంది 50% కంటే ఎక్కువే: ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల్లో 50% కంటే ఎక్కువ మంది ఏఐ సాధనాల సాయంతో మోసం చేస్తున్నారని నియామక నిర్వాహకులు పేర్కొంటున్నారని ఒక నివేదిక వెల్లడించింది. ‘మనమందరం హైబ్రిడ్‌గా పని చేస్తున్నందున, ఇంటర్య్వూలలో కొంత భాగాన్ని వ్యక్తిగతంగా నిర్వహించడంపై ఆలోచించడం మంచిదని నేను భావిస్తున్నాను. గూగుల్‌ సంస్కృతిని అభ్యర్థులు అర్థం చేసుకోవడానికి కూడా ఇది సహాయపడుతుందని అనుకుంటున్నాన’ని పిచాయ్‌ వెల్లడించారు.

సమస్య అంతటా: ఈ సమస్య కేవలం గూగుల్‌కే పరిమితం కాలేదని, ‘పరిశ్రమ వ్యాప్త సంక్షోభం’గా మారుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గాలను అన్వేషిస్తున్నామని బ్రియాన్‌ ఓంగ్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు