PhonePe: సెక్యూర్డ్‌ లోన్‌ల విభాగంలోకి ఫోన్‌పే.. ఎన్‌బీఎఫ్‌సీలతో జట్టు

PhonePe: ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలు, బీమా పంపిణీ, మ్యూచువల్‌ ఫండ్ల వంటి సేవలకే పరిమితమైన ఫోన్‌పై తాజాగా సెక్యూర్డ్ లోన్ల పంపిణీ విభాగంలోకి ప్రవేశించింది.

Published : 30 May 2024 15:21 IST

PhonePe | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే (PhonePe) సెక్యూర్డ్‌ లోన్‌ల పంపిణీ విభాగంలోకి ప్రవేశించింది.  ఇందుకోసం పలు బ్యాంకింగేతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకొంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ మొత్తం ఆరు రకాల లోన్లను అందించనుంది.

మ్యూచువల్‌ ఫండ్లు, తనఖా రుణాలతో పాటు బంగారం, ద్విచక్రవాహనం, ఫోర్‌ వీలర్‌, గృహ, విద్య రుణాలను పంపిణీ చేయనున్నట్లు ఫోన్‌పే  (PhonePe) వెల్లడించింది. ఇందుకోసం టాటా క్యాపిటల్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌, హీరో ఫిన్‌కార్ప్‌, ముథూట్‌ ఫిన్‌కార్ప్‌, డీఎంఐ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌, రూపీ, వోల్ట్‌ మనీ, గ్రాడ్‌రైట్‌ వంటి సంస్థలతో చేతులు కలిపింది. రాబోయే కొన్ని వారాల్లో మరిన్ని సంస్థలు ఈ జాబితాలో చేరనున్నట్లు ఫోన్‌పే తెలిపింది. యాప్‌లో ఉండే లోన్‌ల విభాగంలోకి వెళ్లి కావాల్సిన రుణ ప్రోడక్ట్‌ను ఎంచుకోవాలి. అనంతరం ఏ సంస్థ నుంచి కావాలో ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.

అన్‌సెక్యూర్డ్‌ లోన్‌లపై ఆచితూచి ముందుకెళ్లాలని రుణ జారీ సంస్థలను రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ఇటీవల హెచ్చరించింది. దీంతో బడా బ్యాంకింగేతర సంస్థలు సెక్యూర్డ్‌ రుణాల కస్టమర్లను ఆకర్షించడం కోసం ఫిన్‌టెక్‌ సంస్థలను ఆశ్రయిస్తున్నాయి. ఈ తరుణంలో ఫోన్‌పే (PhonePe) తాజా నిర్ణయం వెలువడడం గమనార్హం. ఫోన్‌పేకు 53.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని